Share News

మన్యం గొంతెండుతోంది

ABN , Publish Date - May 16 , 2026 | 12:44 AM

మన్యంలోని అధిక గ్రామాల్లో గిరిజనం తాగునీటికి అల్లాడుతోంది. ప్రస్తుతం ఎండలు తీవ్రం కావడంతో నీటి సమస్య మరింత అధికమైంది. కాని గిరిజనుల దాహం కేకలు పాలకులు, అధికారులకు వినిపించని పరిస్థితి కొనసాగుతున్నది. దీంతో గిరి పల్లెల్లోని మహిళలకు తాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి.

మన్యం  గొంతెండుతోంది
అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ గాదిలోవలో ఊటగెడ్డ నీటిని సేకరిస్తున్న గిరి మహిళలు

గుక్కెడు నీటికి గిరి జనం కటకట

మారుమూల పల్లెల్లో అధికంగా నీటి ఎద్దడి

కానరాని వేసవి ప్రత్యేక కార్యాచరణ

గిరిజనుల ఊట నీరే గతి

తాగునీటి సమస్యలు పరిష్కరించాలని వేడుకోలు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

మన్యంలోని అధిక గ్రామాల్లో గిరిజనం తాగునీటికి అల్లాడుతోంది. ప్రస్తుతం ఎండలు తీవ్రం కావడంతో నీటి సమస్య మరింత అధికమైంది. కాని గిరిజనుల దాహం కేకలు పాలకులు, అధికారులకు వినిపించని పరిస్థితి కొనసాగుతున్నది. దీంతో గిరి పల్లెల్లోని మహిళలకు తాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి.

ఏజెన్సీ వ్యాప్తంగా 244 గ్రామ పంచాయతీల పరిధిలో 3,803 గ్రామాల్లో ఒక లక్షా 55 వేల 756 గిరిజన కుటుంబాలున్నాయి. వాటిలో 2,025 గ్రామాల్లో పూర్తిగా, 1,778 గ్రామాల్లో పాక్షిక తాగునీటి సదుపాయాలున్నాయని అఽధికారుల రికార్డులు చెబుతున్నాయి. అలాగే ఏజెన్సీలో ప్రస్తుతం అన్ని గ్రామాలకు ఏదో రకమైన తాగునీటి సదుపాయం ఉందనేది అధికారుల వాదన కాగా, నేటికీ సగానికిపైగా పల్లెల్లో తాగునీటి గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారనేది క్షేత్ర స్థాయి వాస్తవం. వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ వంటివి కాగితాలకే పరిమితమవ్వగా, నిధులు సక్రమంగా విడుదల కాని పరిస్థితుల్లో జల్‌ జీవన్‌ మిషన్‌ వంటివి ఆచరణలోకి రాని దుస్థితి ఏర్పడింది. దీంతో అన్ని విధాలా గిరిజనానికి తాగునీటి కష్టాలు తప్పడం లేదు.

ఆశించిన ఫలితవ్వని తాగునీటి పథకాలు

మన్యంలోని గిరిజనులకు తాగునీటి సదుపాయాలు కల్పించేందుకు 3,129 చేతి బోర్లు, 2,200 సింగిల్‌ విలేజ్‌ తాగునీటి పథకాలు, 10 బహుళ గ్రామ తాగునీటి పథకాలు, 750కి పైబడి సోలార్‌ నీటి పథకాలున్నాయి. వాస్తవానికి ఏజెన్సీ వ్యాప్తంగా 3,803 గ్రామాలుండగా 6,089 తాగునీటి (నీటి పథకాలు, బోర్లు)వనరులున్నాయి. అయినప్పటికీ సగానికిపైగా గిరిజన పల్లెల్లోని ప్రజలు గ్రామాలకు సమీపంలో ఉన్న ఊటగెడ్డలపైనే ఆధారపడుతున్నారు. గామీణ నీటి సరఫరా విభాగం నిర్మిస్తున్న తాగునీటి పథకాలు నాణ్యతగా లేకపోవడంతో ధీర్ఘకాలం పనిచేయడం లేదనేది ప్రధాన ఆరోపణ. దీంతో నీటి పథకం నిర్మించిన ఒకటి లేదా రెండు సంవత్సరాల్లోనే మూలకు చేరుతున్నది. ఫలితంగా గ్రామాల్లో నీటి పథకాలున్నా.. ప్రజలకు నీరందని దుస్థితి కొనసాగుతున్నది. అలాగే పల్లెల్లో నీటి పథకాలను ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు నిర్మిస్తుండగా, వాటి నిర్వహణ బాధ్యత పంచాయతీది. కాని తాగునీటి పథకాల వైపు పంచాయతీలు కన్నెత్తి చూడడం లేదు. దీంతో ఎక్కడికక్కడ తాగునీటి పథకాలు మరమ్మతులకు గురై మూలకు చేరుతున్నాయి. ఉదాహరణకు ముంచంగిపుట్టు మండలం సుజనకోటలో రూ.3 కోట్లతో బహళప్రయోజన నీటి పథకం నిర్మించారు. కాని దానికి సరైన నిర్వహణ లేకపోవడంతో మూలకు చేరింది. ఇలా ఏజెన్సీలో పదుల సంఖ్యలో నీటి పథకాలు ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నాయి. ఇవే కాకుండా సోలార్‌ ఆధారంగా పనిచేసే నీటి పథకాల పరిస్థితి మరీ దారుణం. వాటికి చిన్నపాటి మరమ్మతులు వచ్చినా పట్టించుకున్న దాఖాలాలు లేవు. దీంతో అనేక గ్రామాల్లో తాగునీటి పథకాలున్నా వాటి నిర్వహణపై పాలకులు శ్రద్ధచూపని కారణంగా నిరుపయోగంగా మారుతున్నాయి. అలాగే ఐటీడీఏ కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే మీకోసం కార్యక్రమంలో సైతం సగానికి పైగా వినతులు తాగునీటి సమస్యలే కావడం విశేషం.

గిరిజనులకు ఊటగెడ్డ నీరే ఆధారం

గిరిజన పల్లెలకు పక్కాగా రక్షిత నీటిని అందించని కారణంగా అధిక సంఖ్యలోని గిరిజన పల్లెల్లో ఊటగెడ్డలే ప్రధాన తాగునీటి వనరులుగా ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల బాధ్యతా రాహిత్యం, పంచాయతీల్లో పాలన పడకేయడం వంటి కారణాలతో గిరిజనులకు గుక్కెడు నీరు దొరకని దుస్థితి కొనసాగుతున్నది. ఉదాహరణకు అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ గాదిలోవ, అరకులోయ మండలం బస్కిపంచాయతీ మొర్రిగుడ ప్రాంతాల్లోని జనం ఊటగెడ్డలపైనే ఆధారపడుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీలో మత్స్యగెడ్డను ఆనుకుని ఉన్న ముంచంగిపుట్టు, పెదబయలు, డుంబ్రిగుడ, జి.మాడుగుల మండలాల్లోని గిరిజన పల్లెల్లో స్థితి మరీ దారుణం. మత్స్యగెడ్డ తీరంలోని చెలమలు చేసుకుని నీటిని పట్టుకుంటున్నారు. ఇతర మండలాల్లో పంట పొలాలకు సమీపంలోని ఊటగెడ్డలను ఆశ్రయిస్తున్నారు. పెదబయలు మండలం బొడ్డగొంది, లింగేటి, పన్నెడ, గుల్లెలు, హుకుంపేట మండలం తీగలవలస పంచాయతీ పంతెలచింత, ముంచంగిపుట్టు మండలం చీపురుగొంది, దొరగూడ, డెంగాగుడ, కర్లాపొదర్‌ గ్రామాల్లోని గిరిజనులు దూర ప్రాంతంలోని ఊటగెడ్డలకు నుంచే నీటిని మోసుకువస్తున్నారు. ఇలా ఏజెన్సీలో వందల సంఖ్యలో గిరి పల్లెల్లో దాహం కేకలు వేస్తున్నా పాలకులకు అవేవీ వినిపించకపోవడం గమనార్హం. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి గిరిజన పల్లెల్లోని తాగునీటి సమస్యలకు పరిష్కారం చూపి గిరిజనుల గొంతులు తడపాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - May 16 , 2026 | 12:44 AM