Share News

మన్యం గజగజ!

ABN , Publish Date - Nov 29 , 2026 | 12:03 AM

మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు దిగజారుగుతున్నాయి. గత నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గడంతో చలి తీవ్ర ప్రభావం చూపుతున్నది. దీంతో ఏజెన్సీ వాసులు గజగజలాడుతున్నారు.

మన్యం గజగజ!
జిల్లా కేంద్రం పాడేరులో శనివారం ఉదయం దట్టగా కమ్మేసిన పొగమంచు

సింగిల్‌ డిజిట్‌కు కనిష్ఠ ఉష్ణోగ్రతలు

ముంచంగిపుట్టులో 6.9, అరకులోయలో 7.8 డిగ్రీలు

కొనసాగుతున్న చలి తీవ్రత

పాడేరు, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి):

మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు దిగజారుగుతున్నాయి. గత నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గడంతో చలి తీవ్ర ప్రభావం చూపుతున్నది. దీంతో ఏజెన్సీ వాసులు గజగజలాడుతున్నారు. ఉదయం పది గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్మేస్తున్నది. దీంతో వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. శనివారం ముంచంగిపుట్టులో 6.9 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాదిలో ఇదే కనిష్ఠ ఉష్ణోగ్రత కావడం విశేషం. అలాగే అరకులోయలో 7.8, చింతపల్లి, హుకుంపేటలో 9.3, పాడేరులో 9.6, అనంతగిరిలో 14.3, కొయ్యూరులో 14.8 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

వణుకుతున్న మన్యం వాసులు

ఏజెన్సీలో గత నాలుగు రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో మన్యం వాసులు వణుకుతున్నారు. గతవారం రోజులుగా ఉదయం పది గంటల వరకు దట్టంగా పొగ మంచు కురవడం, మధ్యాహ్నం వేళలో ఒకటి రెండు గంటలు మాత్రమే ఎండ కాస్తుండడంతో పగలు రాత్రుళ్లు తేడా లేకుండా చలి ప్రభావం చూపుతున్నది. దీంతో జనం ఉన్ని దుస్తులు ధరిస్తూ, చలి మంటలు కాగుతూ రక్షణ పొందుతున్నారు. అయితే రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని స్థానికులు పేర్కొంటున్నారు.

చింతపల్లిలో 9.3డిగ్రీలు

మన్యంలో గిరిజనులు గజగజ వణుకుతున్నారు. శనివారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. ఏజెన్సీ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఏక సంఖ్యలో నమోదవుతున్నాయి. చింతపల్లిలో 9.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో చల్లగాలలు అధికంగా వీస్తున్నాయి. మంచు దట్టంగా కురుస్తున్నది. దీంతో వాహనదారులు లైట్లు వేసుకుని నెమ్మదిగా వెళుతున్నారు. చలి నుంచి రక్షణ పొందేందుకు స్థానిక గిరిజనులు 24గంటలు ఉన్ని దుస్తులను ధరించుకుని కనిపిస్తున్నారు. ప్రతి వీధి, ఇళ్ల వద్ద చలి మంటలు మండుతున్నాయి. కాగా డిసెంబరులో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గే అవకాశం ఉందని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Updated Date - Nov 29 , 2026 | 12:03 AM