మన్యం గజగజ
ABN , Publish Date - Jan 10 , 2026 | 11:00 PM
మన్యంలో చలి తీవ్రత తగ్గలేదు. ఏజెన్సీ వాసులు రాత్రి, పగలు తేడా లేకుండా గజగజ వణుకుతున్నారు.
తగ్గని చలి తీవ్రత
అరకులోయలో 6.4 డిగ్రీలు
వణుకుతున్న మన్యం వాసులు
పాడేరు, జనవరి 10 (ఆంధ్రజ్యోతి):
మన్యంలో చలి తీవ్రత తగ్గలేదు. ఏజెన్సీ వాసులు రాత్రి, పగలు తేడా లేకుండా గజగజ వణుకుతున్నారు. దాదాపు అన్ని మండలాల్లోనూ శనివారం సైతం కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌లోనే నమోదయ్యాయి. చలి ప్రభావం విపరీతంగా ఉంది. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో జిల్లా కేంద్రం పాడేరుతో సహా అన్ని మండలాల్లోనూ ఉదయం ఎనిమిది గంటల వరకు ఒక మోస్తరుగా మాత్రమే పొగమంచు కురిసింది. చలి ప్రభావానికి జనం ఉన్ని దుస్తులు ధరిస్తూ, మంటలు కాగుతూ రక్షణ పొందుతున్నారు. వాతావరణంలోని మార్పులతో శనివారం ఆకాశం మేఘావృతం కావడంతో పెద్దగా ఎండ కాయలేదు. కాని శీతలగాలుల ప్రభావంతో చలి తీవ్రంగానే ఉంది.
కొనసాగుతున్న సింగిల్ డిజిల్
మన్యంలో శనివారం కొయ్యూరు మండలం మినహా పది మండలాల్లోనూ సింగిల్ డిజిట్‌లోనే కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అరకులోయలో 6.4 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా ముంచంగిపుట్టులో 6.9, హుకుంపేటలో 7.2, పాడేరులో 7.7, పెదబయలులో 7.9, చింతపల్లిలో 8.6, కొయ్యూరులో 12.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.