మన్యం గజగజ
ABN , Publish Date - Jan 07 , 2026 | 11:48 PM
మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు దిగ జారుతున్నాయి. ఫలితంగా చలి తీవ్ర ప్రతాపం చూపుతుండడంతో మన్యం వాసులు గజగజ వణుకుతున్నారు.
జి.మాడుగులలో 2.7 డిగ్రీలు
కొనసాగుతున్న చలి తీవ్రత
పాడేరు, జనవరి 7(ఆంధ్రజ్యోతి): మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు దిగ జారుతున్నాయి. ఫలితంగా చలి తీవ్ర ప్రతాపం చూపుతుండడంతో మన్యం వాసులు గజగజ వణుకుతున్నారు. వాతావరణంలో మార్పులతో గత రెండు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగినట్టే పెరిగి మళ్లీ ఒక్కసారిగా దిగజారాయి. బుధవారం జి.మాడుగులలో 2.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాదిలో ఇదే కనిష్ఠ ఉష్ణోగ్రత కావడం విశేషం. అలాగే ముంచంగిపుట్టులో 3.5, అరకులోయలో 3.6, పాడేరులో 4.4, పెదబయలులో 5.8, హుకుంపేటలో 6.4, చింతపల్లిలో 8.0 కొయ్యూరులో 11.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వణుకుతున్న మన్యం వాసులు
ఏజెన్సీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో పాటు శీతలగాలుల ప్రభావం అధికంగా ఉండడంతో మన్యం వాసులు వణుకుతున్నారు. కొన్నాళ్లుగా ఉదయం పది గంటలు దాటే వరకు దట్టంగా పొగ మంచు కురుస్తోంది. మధ్యాహ్నం వేళలో ఒక మోస్తరుగా మాత్రమే ఎండ కాస్తున్నది. దీంతో రాత్రి, పగలు తేడా లేకుండా చలి తీవ్ర ప్రభావం చూపుతున్నది. దీంతో జనం ఉన్ని దుస్తులు ధరిస్తూ, చలి మంటలు కాగుతూ రక్షణ పొందుతున్నారు.