Share News

బొడ్డాపుట్టులో బోలెడు సమస్యలు

ABN , Publish Date - Jun 06 , 2026 | 10:40 PM

మండలంలోని గోమంగి పంచాయతీ బొడ్డాపుట్టులో మౌలిక సౌకర్యాలు లేక గిరిజనులు దయనీయ జీవనం సాగిస్తున్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా.. ఆ గ్రామంలో అభివృద్ధి ఛాయలు కనిపించడం లేదు.

బొడ్డాపుట్టులో బోలెడు సమస్యలు
రోడ్డుపై రాళ్లను చూపిస్తున్న బొడ్డాపుట్టు గ్రామస్థులు

కనిపించని అభివృద్ధి ఛాయలు

రోడ్డు లేక తిప్పలు

గుక్కెడు నీటి కోసం అవస్థలు

అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం శూన్యం

పెదబయలు, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి):

మండలంలోని గోమంగి పంచాయతీ బొడ్డాపుట్టులో మౌలిక సౌకర్యాలు లేక గిరిజనులు దయనీయ జీవనం సాగిస్తున్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా.. ఆ గ్రామంలో అభివృద్ధి ఛాయలు కనిపించడం లేదు. గ్రామంలో 65 పీవీటీజీ కుటుంబాలు నివసిస్తున్నా ఇప్పటివరకు పక్కా రహదారి లేకపోవడంతో గిరిజనులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. లక్ష్మీపేట-గోమంగి ప్రఽధాన రహదారిలో గల పంగలం సమీపం నుంచి కేవలం రెండు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మిస్తే గ్రామానికి శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో అనారోగ్యం బారిన పడిన వారిని ఆసుపత్రికి తరలించాలంటే సుమారు 17 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. అత్యవసర సమయంలో ఈ దూరమే ప్రాణాలపై ప్రమాదంగా మారుతోందని గ్రామస్థులు వాపోతున్నారు. డిగ్రీ చదువుతున్న వంతాల కోటేశ్వరరావు మే నెలలో అనారోగ్యం బారిన పడ్డాడు. ఆస్పత్రికి తరలించేందుకు రోడ్డు సమస్య వెంటాడుతుండడంతో మరుసటి రోజు డోలీ ద్వారా అయినా ఆస్పత్రికి తరలించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఇంతలోనే ఆ యువకుడు మరణించాడు. అదే గ్రామానికి రోడ్డు సదుపాయం ఉంటే తమ కుమారుడు బతికేవాడని కోటేశ్వరరావు తల్లిదండ్రులు విలపించారు. బొడ్డాపుట్టును తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. రెండు కిలోమీటర్ల దూరం నుంచి ఊట నీరు సేకరించి తాగేవారమని, తమ దయనీయ స్థితిని అప్పటి ఎస్‌ఐ రాజారావు చూసి చలించిపోయి అతని సొంత డబ్బుతో గ్రావిటీ ద్వారా గ్రామానికి నీరు అందించారని గ్రామస్థులు తెలిపారు. ప్రస్తుతం అది కూడా ఇంకిపోవడంతో గ్రామంలో గుక్కెడు నీటికి అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. వేసవిలో అయితే పరిస్థితి మరింత దారుణంగా మరిందని, నీటి సమస్య కోసం గతంలో స్పందన, మీ కోసం గ్రీవెన్స్‌కు వెళ్లి వినతులు సమర్పించినా.. ఏ ఒక్క అధికారిగానీ పట్టించుకోలేదని వాపోయారు. ఎన్నికల సమయంలో మాత్రమే గ్రామంలోకి నాయకులు వస్తారని, తరువాత తమ కష్టాలను పట్టించుకోరని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బొడ్డాపుట్టు గ్రామానికి పక్కా రోడ్డు సౌకర్యంతోపాటు తాగునీటి సదుపాయం కల్పించాలంటున్నారు.

సమస్యలతో సతమతమవుతున్నాం

చిక్కుడు తిరుపతిరావు, మాజీ వార్డు సభ్యుడు

బొడ్డాపుట్టులో దశాబ్దాలుగా పక్కా రోడ్డు, తాగు నీరు లేక నానా అవస్థలు పడుతున్నాం. సమస్యలను పరిష్కారించాలని చెప్పులు అరిగేలా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం శూన్యం. అధికారులు స్పందించి గ్రామానికి రోడ్డు, నీటి సమస్య తీర్చాలి.

ఉన్నతాధికారుల దృష్టికి సమస్యలు

ఎస్‌డీ శ్యామ్‌సుందర్‌, ఎంపీడీవో

బొడ్డాపుట్టు గ్రామంలో నెలకొన్న రోడ్డు, నీటి సమస్యపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్షిస్తాం. ఉన్నతాధికారుల దృష్టికి గ్రామ సమస్యలు నివేదిస్తాం. సాధ్యమైనంత వరకు సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం.

Updated Date - Jun 06 , 2026 | 10:40 PM