Share News

అగ్రికల్చర్‌ డిప్లొమాతో అవకాశాలెన్నో..

ABN , Publish Date - May 20 , 2026 | 11:35 PM

అగ్రికల్చర్‌ డిప్లొమా కోర్సుతో గ్రామీణ ప్రాంత విద్యార్థినీ, విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఈ కోర్సు పూర్తి చేస్తే ఏజీ బీఎస్పీని అభ్యసించే అవకాశముంది.

అగ్రికల్చర్‌ డిప్లొమాతో అవకాశాలెన్నో..
చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల

ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసిన ఆచార్య ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయం

31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

చింతపల్లి, మే 20 (ఆంధ్రజ్యోతి): అగ్రికల్చర్‌ డిప్లొమా కోర్సుతో గ్రామీణ ప్రాంత విద్యార్థినీ, విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఈ కోర్సు పూర్తి చేస్తే ఏజీ బీఎస్పీని అభ్యసించే అవకాశముంది. దీంతో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు సైతం అగ్రికల్చర్‌ డిప్లొమా చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు. అగ్రికల్చర్‌ డిప్లొమాలో ప్రవేశాలకు గుంటూరు ఆచార్య ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయం ప్రకటన విడుదల చేసింది. బుధవారం నుంచి దరఖాస్తు చేసుకునేందుకు వెబ్‌సైట్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ నెల 31లోగా ఆచార్య ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

రాష్ట్రంలో ప్రస్తుతం వ్యవసాయ పాలిటెక్నిక్‌ 16 ప్రభుత్వ, 40 ప్రైవేటు కళాశాలలు, విత్తన సాంకేతిక(సీడ్‌ టెక్నాలజీ) పాలిటెక్నిక్‌ ఒక ప్రభుత్వ, ఆరు ప్రైవేటు, వ్యవసాయ యాంత్రీకరణ(అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌) పాలిటెక్నిక్‌ రెండు ప్రభుత్వ, 11 ప్రైవేటు, సేంద్రీయ వ్యవసాయ పాలిటెక్నిక్‌ ఒక ప్రభుత్వ కళాశాల వుంది. ప్రభుత్వ కళాశాల పరిధిలో 688, ప్రైవేటు కళాశాలల్లో 1,370 సీట్లు వున్నాయి. అగ్రికల్చర్‌ డిప్లొమాలో నాలుగు రకాల కోర్సులు అందుబాటులో వున్నాయి. రెండేళ్ల కాలపరిమితి కలిగిన కోర్సుల్లో వ్యవసాయ పాలిటెక్నిక్‌, విత్తన సాంకేతిక, సేంద్రీయ వ్యవసాయ పాలిటెక్నిక్‌, మూడేళ్ల కాలపరిమితి కలిగిన వ్యవసాయ యాంత్రీకరణ కోర్సులు వున్నాయి.

ఎవరు అర్హులంటే..

పదవ తరగతి గాని, తత్సామానమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరూ అర్హులు. ఓపెన్‌ స్కూల్‌, ఇన్‌స్టెంట్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులు, ఇంటర్‌ ఫెయిల్‌ అయిన విద్యార్థులు కూడా అర్హులు. ఇంటర్‌ పాసైన విద్యార్థులు అనర్హులు. విద్యార్థి దరఖాస్తు చేసుకునే సమయానికి 22 సంవత్సరాలలోపు వయస్సు ఉండాలి.

దరఖాస్తు చేసుకునే విధానం

అర్హులైన విద్యార్థులు ఇంటర్నెట్‌ సెంటర్లు, వ్యక్తిగత కంప్యూటర్ల నుంచి డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఎఎన్‌జిఆర్‌ఎయు.ఎసి.ఐఎన్‌ వెబ్‌సైట్‌ నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాలి. 2026 మే 31 రాత్రి 12 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రిజిస్ట్రేషన్‌తో పాటు డెబిట్‌, క్రెడిట్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా ఎస్సీ, ఎస్టీలు రూ.400, ఇతరులు రూ.800 పరీక్ష ఫీజు చెల్లించి, అనంతరం దరఖాస్తును ఆన్‌లైన్‌లో నింపి సబ్మిట్‌ చేయాల్సివుంటుంది.

ఎంపిక విధానం

విద్యార్థులు పదవ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశాలకు ఎంపిక చేస్తారు. వివిధ కేటగిరీలకు కేటాయించిన రిజర్వేషన్‌లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. 50 శాతం సీట్లు ఓపెన్‌ కేటగిరీలో భర్తీ చేస్తారు. పదవ తరగతి మార్కుల ఆఽధారంగా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. కౌన్సెలింగ్‌ సమయంలో విద్యార్థులు టెన్త్‌ ట్రాన్స్‌ఫర్‌, స్టడీ సర్టిఫికెట్‌, ఎస్‌ఎస్‌సీ మార్కుల జాబితా, ఆదాయం, కులం ధ్రువపత్రాలు ఒరిజినల్స్‌, రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు జెరాక్స్‌ కాపీలు సమర్పించాలి.

ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థుల్లో 40 శాతం మంది విద్యార్థులకు వెంటనే ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. 20 శాతం మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏఈవో, ఎంపీఈవో, టెక్నికల్‌ అసిస్టెంట్‌, సచివాలయాల్లో అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు లభిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు విత్తనాలు, ఎరువులు, పురుగులు, తెగుళ్లు మందుల కంపెనీలు, పరిశోధన, విస్తరణ సంస్థల్లోనూ ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఎరువులు, పురుగుమందుల దుకాణాలు ఏర్పాటు చేసేవారికి అగ్రికల్చర్‌ డిప్లొమా, అగ్రికల్చర్‌ గ్రాడ్యుయేషన్‌ వుండాలి.

Updated Date - May 20 , 2026 | 11:35 PM