Share News

ఎరువు దరువు

ABN , Publish Date - May 16 , 2026 | 12:08 AM

మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది అన్నదాతల పరిస్థితి. ఒక పక్క వ్యవసాయ పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయి పంటలకు గిట్టుబాటు ధర లేక వ్యవసాయం అంటేనే భయపడిపోతున్న పరిస్థితుల్లో అన్నదాతలు ఉన్నారు.

ఎరువు దరువు
ఎరువులు చల్లుతున్న రైతు (ఫైల్‌)

మోతెక్కిపోయేలా కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు

యూరియా, డీఏపీ మినహా మిగిలిన కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు చుక్కల్లో..

రూ.2 వేల మార్కు దాటిపోయిన వైనం

రైతుల నెత్తిన ధరల భారం

ఖరీఫ్‌ సీజన్‌పై అన్నదాతల్లో గుబులు

చోడవరం, మే 15 (ఆంధ్రజ్యోతి): మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది అన్నదాతల పరిస్థితి. ఒక పక్క వ్యవసాయ పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయి పంటలకు గిట్టుబాటు ధర లేక వ్యవసాయం అంటేనే భయపడిపోతున్న పరిస్థితుల్లో అన్నదాతలు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎరువుల కంపెనీలు కాంప్లెక్స్‌ ఎరువుల ధరలను పెంచేశాయి. మరింత భారం పడడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.

కాంప్లెక్స్‌ ఎరువుల ధరలన్నీ పెరిగిపోయాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో కంపెనీలు పెంచిన ఎరువుల ధరలను చూసి వచ్చే ఖరీఫ్‌ సీజన్‌కు ఎరువుల ఖర్చులను తలచుకుని రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ఒక్క యూరియా బస్తా, డీఏపీ బస్తాల ధరలు మాత్రం నిలకడగా ఉండగా, మిగిలిన కాంప్లెక్స్‌ ఎరువుల బస్తాపై కంపెనీలు రూ.200 నుంచి రూ.300 వరకు ధరలను పెంచేశాయి. రైతులు ఎక్కువగా ఉపయోగించే పొటాష్‌ బస్తాపైనా రూ.125 పెరిగి సుమారుగా రూ.2 వేలకు చేరిపోవడడం గమనార్హం. ఇప్పటికే ఎరువులు, పురుగు మందుల ధరలు అందుబాటులో లేకపోవడంతో బెంబేలెత్తిపోతున్న రైతులకు తాజాగా కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు మరింత పెరిగిపోవడం తీవ్ర నిరాశను కలిగిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం అరకొర సరఫరా వల్ల గత ఏడాది మార్కెట్‌లో యూరియా కోసం రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. యూరియా బస్తాకు నిర్దేశిత ధర కంటే రూ.200 నుంచి రూ.300 వరకు బ్లాక్‌ మార్కెట్లో అదనంగా చెల్లించి కొనుక్కోవలసిన పరిస్థితి తలెత్తింది. తాజాగా కాంప్లెక్స్‌ ఎరువుల ధరల పెంపు నేపథ్యంలో ధర పెరుగుదల ఇక్కడితో ఆగిపోతుందా?, లేదంటే యుద్ధం పేరుతో మరింత భారం మోపుతారా? అనే ఆందోళన అన్నదాతల్లో ఉంది. పెరిగిన ఎరువుల ధరలు కొత్త స్టాకుతో అమల్లోకి వస్తాయని ప్రకటించడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతున్నది.

ధరల నిర్ణయం కంపెనీల చేతుల్లో..

కేంద్ర ప్రభుత్వం 2016 నుంచి యూరియా, డీఏపీ మినహా ఇతర కాంప్లెక్స్‌ ఎరువుల సబ్సిడీ భారం నుంచి తప్పుకోవడంతో ఎరువుల ధరల నిర్ణయం పూర్తిగా కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఎరువుల ధరల పెంపులో కంపెనీలదే ఇష్టారాజ్యంగా మారిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పరిస్థితుల ప్రభావం అన్న ప్రచారంతో ఎరువుల కంపెనీలు తమకు నచ్చినట్టుగా ఎరువుల ధరలు పెంచుకుంటూ పోతున్నాయి. యూరియా తప్ప ఇతర కాంప్లెక్స్‌ ఎరువులను రైతులు ఏటా పెరుగుతున్న ధరలకు కొనుగోలు చేయవలసి వస్తున్నది.

ఎమ్మార్పీ చూసి కొనకపోతే నష్టమే..

వాస్తవానికి ప్రస్తుతం పెరిగిన ఎరువుల ధరలు మార్కెట్‌లోకి కొత్తగా వచ్చే స్టాకుతో అమలు చేయాల్సి ఉంది. అయితే ఎరువుల డీలర్లు పాత స్టాకునే కొత్త ధరలకు అమ్మి రైతులకు టోకరా ఇచ్చే ప్రమాదం లేకపోలేదు. ఈ పరిస్థితుల్లో అన్నదాతలు ఎరువులు కొనేముందు అది పాత స్టాకా, లేక కొత్తదా అనేది ఎరువుల బస్తాపై ఉన్న ఎమ్మార్పీ ధరలను చూసి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు. కాగా ఇప్పటికే కొన్ని దుకాణాల్లో గ్రోమోర్‌ 28:28 రకం ఎరువు పాత ధర రూ.1,800 కాగా, కొత్త ధర రూ.1,900 అమ్ముతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఎరువుల ఽనిల్వలు, ధరలు కొత్తవా?, లేక పాతవా అనేది క్షుణ్ణంగా పరిశీలన చేయాల్సిన అవసరం అధికార యంత్రాంగంపై ఉందని అంటున్నారు. కాగా ఈ పెరిగిన ధరలు కూడా కంపెనీల వారీగా ఇవే ధరల కంటే మరికొంత హెచ్చుగా కూడా ఉండే అవకాశం ఉంది.

ఎరువుల కంపెనీలు, పాత, కొత్త ధరలు ఇలా..

కంపెనీ పాత ధర (రూ.లలో) కొత్త ధర (రూ.లలో)

20:20:0:13 1,500 1,800

14:35:14 2,150 2,350

16:20:0:13 1,400 1,750

15:15:0:9 1,650 1,950

10:26:26 1,950 2,025

16:16:16 1,675 2,050

12:32:16 1,850 1,950

24:24:0 2,000 2,200

పొటాష్‌(ఎంఓపీ) 1,850 1,975

ఎస్‌ఎస్‌పీ 615 775

డీఏపీ 1,350 1,350

యూరియా 266.50 266.50

Updated Date - May 16 , 2026 | 12:08 AM