ప్రభుత్వ భూమి రికార్డులు తారుమారు
ABN , Publish Date - May 26 , 2026 | 12:39 AM
విశాఖ రూరల్ మండలం మధురవాడ సర్వే నంబరు 133/పీలో గల 3.47 ఎకరాల పోరంబోకు భూమికి సంబంధించి తప్పుడు నివేదికలు ఇచ్చిన వ్యవహారంపై జాయింట్ కలెక్టర్‌ను విచారణాధిరిగా ప్రభుత్వం నియమించింది.
అప్పటి భీమిలి ఆర్డీవో సహా పలువురిపై అభియోగాలు
విచారణాధికారిగా జాయింట్ కలెక్టర్
విశాఖపట్నం, మే 25 (ఆంధ్రజ్యోతి):
విశాఖ రూరల్ మండలం మధురవాడ సర్వే నంబరు 133/పీలో గల 3.47 ఎకరాల పోరంబోకు భూమికి సంబంధించి తప్పుడు నివేదికలు ఇచ్చిన వ్యవహారంపై జాయింట్ కలెక్టర్‌ను విచారణాధిరిగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. సర్వే నంబరు 133/పీలో 3.47 ఎకరాల భూమికి సంబంధించి వైసీపీ హయాంలో ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా నివేదిక ఇచ్చినట్టు అప్పటి భీమిలి ఆర్డీవో ఎస్.భాస్కరరెడ్డి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ టి.మల్లేశ్వరరావు, గ్రేడ్-1 వీఆర్వో వి.సూరిబాబు, గ్రేడ్-2 వీఆర్వో కె.దుర్గాప్రసాద్‌పై అప్పట్లో అభియోగాలు నమోదయ్యాయి. ఈ ఘటనపై ఆరు వారాల్లో విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.
మరోమారు పెట్రో బాదుడు
పెట్రోల్‌పై లీటరుకు రూ.2.86, డీజిల్‌పై లీటరుకు రూ.2.84 పెంపు
11 రోజుల్లో పెట్రోల్‌పై రూ.8.05, డీజిల్‌పై రూ.7.88 భారం
మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందంటున్న ఆయిల్ వ్యాపారులు
విశాఖపట్నం, మే 25 (ఆంధ్రజ్యోతి):
పెట్రో ఉత్పత్తుల ధరలను కేంద్ర ప్రభుత్వం ఒకేసారి కాకుండా దఫదఫాలుగా పెంచుకుంటూ పోతోంది. ఒకేసారి లీటరుపై రూ.5 నుంచి రూ.10 పెంచితే విపక్షాల నుంచి విమర్శలతో పాటు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని దశల వారీగా పెంచుతోంది. ఈ నెల 15వ తేదీన తొలిసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. ఆ తరువాత 19వ తేదీన, మళ్లీ 23వ తేదీన, తాజాగా ఆదివారం అర్ధరాత్రి తెల్లవారితే సోమవారం (25వ తేదీ) మరోసారి పెంచింది. ఈసారి పెట్రోల్‌పై లీటరుకు రూ.2.86, డీజిల్‌పై రూ.2.84 పెంచింది.
ధరలు పెరగక ముందు 14వ తేదీ నాటికి పెట్రోల్ లీటరు రూ.108.33 ఉండగా, ఇప్పుడు పది రోజుల వ్యవధిలో అది రూ.116.38కి చేరింది. అంటే లీటరుపై ఇప్పటివరకు రూ.8.05 పెంచారు. డీజిల్ విషయానికి వస్తే తొలుత లీటరు రూ.96.22 ఉండేది. ఇప్పుడు రూ.104.10కి చేరింది. దశల వారీగా రూ.7.88 పెంచారు. పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.25 వరకు పెంచాలనే ప్రతిపాదన కేంద్రం వద్ద ఉన్నదని, దశల వారీగా పెంచుతుందని ఆయిల్ వ్యాపారులు చెబుతున్నారు. ఇది ఇక్కడితో ఆగదని కూడా అంటున్నారు.
ప్రజలపై భారం ఎంత అంటే..?
జిల్లాలో ప్రజలు రోజుకు 387 కిలోలీటర్ల పెట్రోల్ ఉపయోగిస్తున్నారు. ఈ పది రోజుల్లో లీటరుపై రూ.8.05 పెరిగింది. ఈ లెక్కన చూసుకుంటే పెట్రోల్ వినియోగదారులపై రోజుకు రూ.31,15,350 అదనపు భారం పడుతోంది. అంటే నెలకు రూ.9,34,60,500. అలాగే జిల్లాలో రోజుకు 710 కిలోలీటర్ల డీజిల్ వాడుతున్నారు. దీనిపై ఇప్పటివరకు లీటరుపై రూ.7.88 పెరిగింది. డీజిల్ వినియోగదారులపై అదనంగా రోజుకు రూ.55,94,800 భారం పడింది. అంటే నెలకు రూ.16,78,44,000.
ఎండ మండే
ఉక్కపోతతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి
ములగాడలో 44.4 డిగ్రీలు
విశాఖపట్నం, మే 25 (ఆంధ్రజ్యోతి):
రోహిణి కార్తె ప్రారంభం రోజునే నగరవాసులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. సోమవారం ఉదయంపూట నగరంపై ఆవరించిన మేఘాలు పది గంటలకు చెదిరిపోయి ఆకాశం నిర్మలంగా మారింది. దీంతో సాయంత్రం వరకు ఎండ తీవ్రంగా ఉంది. మధ్యాహ్నం నగరం నిప్పుల కుంపటిలా మారింది. ఆరుబయట పనిచేసేవారంతా ఎండకు తాళలేకపోయారు. ద్విచక్రవాహనాలపై వెళ్లే వారంతా ముఖాలకు రుమాళ్లు కట్టుకోవల్సి వచ్చింది. ములగాడలో 44.4, విశాఖ రూరల్‌లో 44 డిగ్రీలు, పద్మనాభంలో 39.8, పెందుర్తిలో 39.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మరో మూడు రోజులు జిల్లాలో వడగాడ్పులు వీస్తాయని, నెలాఖరు వరకు ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు.
టెన్త్ ఇంగ్లీష్ పరీక్ష 5కు వాయిదా
విశాఖపట్నం, మే 25 (ఆంధ్రజ్యోతి):
ఈనెల 28వ తేదీన జరగాల్సిన పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష బక్రీద్ కారణంగా వచ్చే నెల ఐదో తేదీకి వాయిదా పడినట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.ప్రేమకుమార్ తెలిపారు. పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలలో ఆంగ్లం పరీక్ష రాసే విద్యార్థులు ఈ విషయం గమనించాలని సూచించారు.
వీఎంఆర్‌డీఏకు ఇద్దరు కొత్త అధికారులు
అడిషనల్ కమిషనర్‌గా దాట్ల కీర్తి
ప్రాజెక్ట్స్ ఓఎస్‌డీగా రమావత్ కృష్ణ నాయక్
విశాఖపట్నం, మే 25 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌డీఓ స్థాయి అధికారులను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. తూర్పు గోదావరి జిల్లాలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టు మేనేజర్‌గా పనిచేస్తున్న దాట్ల కీర్తిని విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) అదనపు కమిషనర్‌గా బదిలీ చేసింది. కీర్తి గతంలో వీఎంఆర్‌డీఏలో సెక్రటరీగా కొన్నాళ్లు విధులు నిర్వహించారు. ఆ తరువాత విజయనగరం ఆర్‌డీఓగా బదిలీ అయ్యారు. ఇదిలావుండగా చిత్తూరులో జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్న రమావత్ కృష్ణ నాయక్‌ను వీఎంఆర్‌డీలో ప్రాజెక్ట్స్ ఓఎస్‌డీగా వేశారు.