Share News

మండల స్థాయి అధికారులు పీజీఆర్‌ఎస్‌కి హాజరుకావాలి

ABN , Publish Date - Mar 20 , 2026 | 11:28 PM

ప్రతీ సోమవారం మండల స్థాయిలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ(మీకోసం)కార్యక్రమంలో అధికారులు విధిగా పాల్గొనాలని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ ఆదేశించారు.

మండల స్థాయి అధికారులు పీజీఆర్‌ఎస్‌కి హాజరుకావాలి
ఐటీడీఏ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌ నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌, తదితరులు

కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశం

ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌లో 52 వినతులు స్వీకరణ

పాడేరు, మార్చి 20 (ఆంధ్రజ్యోతి):

ప్రతీ సోమవారం మండల స్థాయిలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ(మీకోసం)కార్యక్రమంలో అధికారులు విధిగా పాల్గొనాలని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (మీకోసం)కార్యక్రమంలో ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామ, మండల స్థాయి సమస్యలపై ప్రజలు జిల్లా కేంద్రానికి రాకూడదని, వాటిని మండల స్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలోనే పరిష్కరించాలన్నారు. ప్రతీ సోమవారం మండల కేంద్రాల్లో పీజీఆర్‌ఎస్‌ నిర్వహించాలని, అధికారులంతా విధిగా హాజరుకావాలని, లేకుంటే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమస్యలపై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, వాటికి కచ్చితమైన పరిష్కారం చూపాలన్నారు. ఈక్రమంలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చూడాలన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల పేషీల నుంచి వచ్చే అర్జీలను గడువులోగా పరిష్కరించాలన్నారు. మీకోసం అర్జీల పరిష్కార వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. పీజీఆర్‌ఎస్‌ సేవలపై ప్రజల నుంచి ప్రభుత్వం ఐవీఆర్‌ఎస్‌ ద్వారా అభిప్రాయాలను సేకరిస్తున్నదని, ఈ క్రమంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా పరిష్కారం చూపాలన్నారు. అర్జీదారునితో మర్యాదగా మాట్లాడి, సమస్యను పక్కాగా పరిశీలించాలన్నారు. సమస్యను పరిష్కరించకుండా ఫిర్యాదును ముగించవద్దని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాహిత్‌, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో ఎం.వెంకటేశ్వరరావు, ఆర్‌డీవో ఎంవీఎస్‌.లోకేశ్వరరావు గిరిజనుల నుంచి 52 వినతులను స్వీకరించారు.

1100 కాల్‌ సెంటర్‌ ద్వారా సేవలు

మీకోసం కార్యక్రమంలో అర్జీలను దాఖలు చేసిన వ్యక్తులు తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోకుంటే 1100 నంబర్‌కు ఫోన్‌ చేసి సేవలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ సూచించారు. అర్జీలకు సంబంధించిన ఎండార్స్‌మెంటును అర్జీదారులకు రిజిస్టర్‌ పోస్టులో పంపిస్తున్నామన్నారు కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ వి.మురళీ, డీఎంహెచ్‌వో కృష్ణమూర్తి నాయిక్‌, జిల్లా పరిశ్రమల శాఖాధికారి రమణారావు, డీఈవో రామకృష్ణారావు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమిళ, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌.నందు, డీపీవో చంద్రశేఖర్‌, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ ఈఈ టి.కొండయ్యపడాల్‌ , స్వర్ణగ్రామ శాఖ జిల్లా నోడల్‌ అధికారి పీఎస్‌.కుమార్‌, ఐసీడీఎస్‌ పీడీ ఝాన్సీబాయి, జాతీయ రహదారుల డిప్యూటీ తహశీల్దార్‌ వి.ధర్మరాజు, సీపీవో ప్రసాద్‌, ఐటీడీఏ ఏవో ఎం.హేమలత, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 20 , 2026 | 11:28 PM