Share News

అర్జీల పరిష్కారానికి మండల కమిటీలు

ABN , Publish Date - Mar 16 , 2026 | 11:56 PM

మీకోసం.. ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ(పీజీఆర్‌ఎస్‌)లో ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువచ్చే సమస్యల పరిష్కారానికి మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ సూచించారు.

అర్జీల పరిష్కారానికి మండల కమిటీలు
వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, పక్కన డీఆర్‌వో అంబేడ్కర్‌, ఆర్‌డీవో లోకేశ్వరరావు

పీజీఆర్‌ఎస్‌లో వినతులకు అధిక ప్రాధాన్యం

అధికారులకు కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ సూచన

పాడేరు, మార్చి 16(ఆంధ్రజ్యోతి): మీకోసం.. ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ(పీజీఆర్‌ఎస్‌)లో ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువచ్చే సమస్యల పరిష్కారానికి మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ సూచించారు. ఉమ్మడి అల్లూరి జిల్లాలోని పీజీఆర్‌ఎస్‌, ఇతర రెవెన్యూ సమస్యలపై వివిధ శాఖల అధికారులతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ మాట్లాడారు. పీజీఆర్‌ఎస్‌లో వినతుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలన్నారు. అందుకు గాను మండల స్థాయిలోనే కమిటీలను ఏర్పాటు చేసుకొని, మండల పరిధిలోనే సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. సమస్యలు పరిష్కరించే క్రమంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, జిల్లాలో కొయ్యూరు, చింతపల్లి, పాడేరు, హుకుంపేట, పెదబయలు మండలాల్లోనే ఎక్కువగా వినతులు వస్తున్నాయన్నారు. వాటిపై ఆయా మండలాల రెవెన్యూ, ఇతర అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. ప్రతి రోజు కనీసం వంద మందికి ఫోన్‌కాల్‌ చేసి ఆయా వినతులకు సంబంధించిన విషయాలపై పరిశీలన జరపాలని సూచించారు. అలాగే ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌లో ప్రజల సంతృప్తి స్థాయిని పెంచాలని, క్షేత్ర స్థాయిలో ఫిర్యాదుదారుని సమస్యను పరిష్కరించిన తరువాత, వారి స్పందనను ఆడియో, వీడియోలో రికార్డు చేయాలన్నారు. అలాగే మళ్లీ మళ్లీ వచ్చే అర్జీలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, సివిల్‌, భూ వివాదాలు, కోర్టు వ్యవహారాల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పి.అంబేడ్కర్‌, ఆర్‌డీవో ఎంవీఎస్‌ లోకేశ్వరరావు, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌ నందు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ వి.మురళి, డ్వామా పీడీ విద్యాసాగరరావు, హౌసింగ్‌ పీడీ బి.బాబునాయక్‌, ఉమ్మడి అల్లూరి జిల్లాలోని మండల ప్రత్యేకాధికారులు, రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2026 | 11:56 PM