Share News

‘మేనేజ్‌’మెంట్‌ కోటా

ABN , Publish Date - May 06 , 2026 | 01:07 AM

బీఈడీ, లా కోర్సుల్లో ప్రవేశాలపై ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

‘మేనేజ్‌’మెంట్‌ కోటా

  • బీఈడీ, లా కళాశాలల యాజమాన్యాల ఇష్టారాజ్యం

  • ఒడిశా, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు చెందిన వారికే అత్యధిక ప్రవేశాలు

  • ఫీజులు కడితే చాలు సర్టిఫికెట్‌ వచ్చేస్తుందని భరోసా? భారీగా ఫీజు వసూలు

  • కాలేజీకి రెగ్యులర్‌గా వస్తే ఒక ఫీజు, పరీక్షలకు మాత్రమే హాజరైతే మరో రకమైన ఫీజు

  • స్థానికులకు దక్కని సీట్లు

  • ఈ ఏడాదైనా ఏయూ అధికారులు

  • ప్రత్యేకంగా దృష్టిసారించాలని డిమాండ్‌

    విశాఖపట్నం, మే 5 (ఆంధ్రజ్యోతి):

బీఈడీ, లా కోర్సుల్లో ప్రవేశాలపై ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ కోర్సుల్లో మేనేజ్‌మెంట్‌ కోటాలో చేరే విద్యార్థులంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒడిశా, చత్తీస్‌గఢ్‌ వంటి రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లకు కాలేజీల యాజమాన్యాలు భారీమొత్తంలో ఫీజు ఫిక్స్‌ చేస్తున్నాయి. అంత మొత్తం చెల్లించే స్థోమత లేకపోవడంతో స్థానిక విద్యార్థులకు సీట్లు లభించని పరిస్థితి నెలకొంది.

ఏయూ పరిధిలో 61 బీఈడీ, మరో ఆరు లా కళాశాలలు ఉన్నాయి. ఒక్కో కాలేజీలో మేనేజ్‌మెంట్‌ కోటా కింద కనీసం 20 నుంచి 40 సీట్లు ఉంటాయి. సీటు కోసం వేలాది రూపాయల ఫీజును ఫిక్స్‌ చేస్తున్నాయి. వేల రూపాయలు ఫీజు పెడితే స్థానిక విద్యార్థులు చేరరు. ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు మాత్రం ఫీజుతో సంబంధం లేకుండా సర్టిఫికెట్‌ కోసం ఎంతైనా చెల్లించేందుకు సిద్ధపడుతున్నారు.

ముందే రేటు ఫిక్స్‌

మేనేజ్‌మెంట్‌ కోటాలో రెండు రకాల ఫీజులు ఉంటున్నట్టు చెబుతున్నారు. విద్యార్థి కాలేజీకి రెగ్యులర్‌గా వస్తే ఒక రకమైన ఫీజు, కాలేజీకి రాకుండా పరీక్షలకు మాత్రమే హాజరైతే మరో రకమైన ఫీజు ఉంటుంది. పరీక్షల్లో అవసరమైన సహకారాన్ని అందించే ఏర్పాట్లు చేయాలంటే మరికొంత అదనంగా చెల్లించాల్సి ఉంటుందన్న ప్రచారమూ ఉంది. ఈ తరహా ఏర్పాట్లు ఉండడం వల్లే ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఏయూ పరిధిలోని కాలేజీల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని చెబుతున్నారు. ఆయా కోర్సులకు సంబంధించిన పరీక్షలు జరిగిన ప్రతిసారీ అనేకమంది విద్యార్థులు మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతూ అధికారులకు పట్టుబడుతున్నారు. దీనికి కారణం ఈ తరహా ఏర్పాట్లు చేస్తామని కాలేజీలు హామీ ఇవ్వడమేనంటున్నారు. అయితే అనూహ్యంగా వర్సిటీ అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తుండడంతో విద్యార్థులు అడ్డంగా బుక్‌ అవుతున్నారు. బీఈడీ, లా కోర్సుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల ప్రవేశాలను నియంత్రించినప్పుడే ఈ తరహా మాస్‌ కాపీయింగ్‌కు అడ్డుకట్ట పడుతుందని వర్సిటీలోని ఒక డీన్‌ పేర్కొన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆయా కోర్సుల్లో మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీపై వర్సిటీ అధికారులు ఇప్పటినుంచే ప్రత్యేకంగా దృష్టిసారించాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.

Updated Date - May 06 , 2026 | 01:07 AM