నీటి పథకాల నిర్వహణ అస్తవ్యస్తం
ABN , Publish Date - May 16 , 2026 | 12:10 AM
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. గ్రామ పంచాయతీల్లో పాలకవర్గాల పదవీకాలం ముగియడం, సాధారణ నిధుల కొరత వంటి కారణాలతో గ్రామీణ రక్షిత నీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్) పథకాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది.
నిధుల్లేక సక్రమంగా జరగని రక్షిత నీటి సరఫరా
మోటార్లు మరమ్మతులకు గురికావడంతో ఇబ్బందులు
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. గ్రామ పంచాయతీల్లో పాలకవర్గాల పదవీకాలం ముగియడం, సాధారణ నిధుల కొరత వంటి కారణాలతో గ్రామీణ రక్షిత నీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్) పథకాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. పథకాల నిర్వహణకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో గ్రామ పంచాయతీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీంతో మోటార్ల మరమ్మతులు, పైపులైన్ లీకేజీల నివారణ, విద్యుత్ బిల్లుల చెల్లింపులు కూడా పంచాయతీలకు భారంగా మారింది.
జిల్లాలో అధికారుల గణాంకాల ప్రకారం 15,938 చేతి పంపులు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా వృథాగా దర్శనమిస్తున్నాయి. పీడబ్లూఎస్ పథకాలు 1,850, సీపీడబ్ల్యూఎస్ పథకాలు 27 ఉండగా, వీటి ద్వారా 359 గ్రామాలకు రక్షిత నీరు అందిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. కాగా గత కొన్నేళ్లుగా నిర్వహణ లేక ఇప్పటికే కొన్ని గ్రామ పంచాయతీల పరిఽధిలోని రక్షిత నీటి ట్యాంకర్లు నిర్వహణకు నోచుకోకపోవడంతో కలుషిత నీరు సరఫరా అవుతోంది. కొన్నిచోట్ల రక్షిత ట్యాంకులు శిథిలావస్థకు చేరాయి. అనకాపల్లి, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల మండలాల్లో రక్షిత పథకాల నిర్వహణకు నిధుల కొరత వేధిస్తోంది. సబ్బవరం మండలం ఎ.సిరసపల్లి గ్రామంలో నీటి ట్యాంకు నిర్వహణ లేక నెల రోజులుగా నిరుపయోగంగా ఉంది. మిగిలిన మండలాల్లో రక్షిత పథకాలకు సంబంధించిన మోటార్లు తరచూ కాలిపోవడం, పైపులైన్లు పాడవడం, నిల్వ ట్యాంకులు దెబ్బతినడం సర్వసాధారణంగా మారిపోయింది. వీటి నిర్వహణకు ఈ ఏడాది వేసవిలో జిల్లాలో అన్ని పంచాయతీలకు రూ.1.5 కోట్లు అవసరమని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. నిధులు వస్తాయని భావించి అనేక పంచాయతీల్లో ఇప్పటికే పనులు కూడా చేపట్టారు. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు నిర్వహణ నిధులు విడుదల కాకపోవడంతో పంచాయతీలు రక్షిత నీటి సరఫరా విషయంలో చేతులెత్తేస్తున్నాయి. కొన్నిచోట్ల ప్రత్యేకాధికారులు చొరవ తీసుకొని నీటి పథకాలకు మరమ్మతులు చేయిస్తున్నా, కాంట్రాక్టరుకు చెల్లింపులు జరగడం లేదు. దీంతో రక్షిత పథకాలు అరకొరగానే పనిచేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం పొంచి వుంది. గతంలో నిర్వహణ ఖర్చుల కోసం గ్రామ పంచాయతీలకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేసేవారు. ఆర్‌డబ్ల్యూఎస్ విభాగానికి సమ్మర్ క్రాష్ ప్రోగ్రామ్ నిర్వహణకు నిధులు కేటాయింపులు జరిగేవి. ప్రస్తుతం పంచాయతీల్లో సాధారణ నిధుల కొరత, ఆర్‌డబ్ల్యూఎస్‌కు నిధులు విడుదల కాకపోవడంతో వేసవిలో నీటి అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇబ్బందులు తప్పవని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. తక్షణమే ప్రత్యేక నిధులు విడుదలు చేసి, పథకాల మరమ్మతులు చేపట్టకపోతే రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర తాగునీటి సమస్య తప్పదని తెలుస్తోంది. జిల్లాలో నీటి పథకాల నిర్వహణపై ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ అనిల్‌కుమార్‌ను వివరణ కోరగా, రక్షిత నీటి పథకాల నిర్వహణ బాధ్యతలు పంచాయతీలే చూస్తున్నాయని తెలిపారు. కొన్ని రక్షిత పథకాలకు మేజర్ మరమ్మతు పనుల కోసం అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించామని, నిధులు రాగానే పనులు ప్రారంభించి పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతం జిల్లాలో గ్రామ పంచాయతీల్లో అందుబాటులో ఉన్న నిధులతో పథకాల నిర్వహణ బాధ్యతలు చూడాలని సూచించినట్టు ఆయన తెలిపారు.