మన్యాన్నివదలని మలేరియా
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:34 AM
ఏజెన్సీలో మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఇటీవల విడుదల చేసిన నివేదికలో వెల్లడించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
ఏటా విజృంభణ
గిరిజనుల్లో రక్తహీనతకు ఇదో కారణం
ఏజెన్సీలో మలేరియా వ్యాప్తికి అనుకూల భౌగోళిక వాతావరణం
పకడ్బందీగా జరగని నియంత్రణ చర్యలు
రాష్ట్రంలోని కేసుల్లో 40 శాతం జిల్లాలోనే నమోదు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
ఏజెన్సీలో మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఇటీవల విడుదల చేసిన నివేదికలో వెల్లడించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వాస్తవానికి ఏజెన్సీలో ఉన్న భౌగోళిక పరిస్థితులు, చల్లని వాతావరణం మలేరియా వ్యాప్తికి అనుకూలంగా ఉండడంతో మలేరియాను పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాని పని. అయితే నివారణ చర్యలు చేపట్టడంలోనూ అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించకపోవడంతో మలేరియా నివారణ చర్యలు కాగితాలకే పరిమితమవుతున్నాయనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో మలేరియా స్థితిగతులపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఇటీవల విడుదల చేసిన నివేదికలో అల్లూరి జిల్లాకు సంబంధించిన అనేక విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. రాష్ట్రంలో మొత్తం నమోదైన మలేరియా కేసుల్లో సుమారుగా 40 శాతం కేసులు జిల్లాలోనే ఉండడం గమనార్హం.
సముద్ర మట్టానికి 3,500 అడుగుల ఎత్తులో ఉన్న గిరిజన ప్రాంతంలో ఏడు లక్షల మంది గిరిజనులు జీవిస్తున్నారు. అయితే ఇక్కడ వాతావరణం దోమల వ్యాప్తికి అనుకూలంగా ఉండడంతో ప్రతి ఏడాది సుమారుగా మూడు నుంచి నాలుగు లక్షల మందికి జ్వరాలు వస్తాయి. దీంతో వారికి రక్త పరీక్షలు నిర్వహించి సుమారుగా రెండు వేల మంది వరకు మలేరియా బారిన పడుతున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వాస్తవానికి జ్వరాల బారిన పడి, రక్త పరీక్షలు చేయించుకున్న మూడు లక్షల మంది గిరిజనుల్లో కచ్చితంగా పది వేల మంది వరకు మలేరియా బారిన పడుతున్నారనేది అనధికారిక అంచనా. ఇక మరణాల విషయానికి వస్తే గిరిజనుల మృతికి అధికారులు ఏనాడూ వాస్తవ కారణాలు చెప్పిన పాపాన పోలేదు. లెక్కలకు దొరకని మరణాలు జరిగినా, అవి సాధారణ, ఆకస్మిక మరణాలుగానే అధికారులు ప్రకటిస్తున్నారు. అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఫిబ్రవరి 22 వరకు ఏజెన్సీలో 37 వేల 190 మందికి జ్వరం సోకింది. వారికి నిర్వహించిన రక్త పరీక్షల్లో 49 మందికి మలేరియా నిర్ధారణైంది. అలాగే గతేడాది(జనవరి నుంచి ఫిబ్రవరి 22 వరకు) ఇదే సమయానికి 45 వేల 270 మంది జ్వర బాధితులకు రక్త నమూనాలు పరీక్షించగా 129 మందికి మలేరియా ఉన్నట్టు నిర్ధారణైంది. కానీ వాస్తవానికి మలేరియా సోకిన వారి సంఖ్య రెట్టింపు ఉంటుందనే వాదన వినిపిస్తున్నది.
మలేరియా నియంత్రణపై చిత్తశుద్ధి కరువు
జిల్లాలో ఎత్తైన, చల్లని ప్రదేశమైన గిరిజన ప్రాంతంలోనే మలేరియా వ్యాప్తి అధికంగా ఉంటుంది. కానీ దాని నియంత్రణపై అధికార యంత్రాంగానికి సంపూర్ణ చిత్తశుద్ధి లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి మలేరియా విభాగం చాలా చిన్నది. జిల్లా వ్యాప్తంగా ఉన్న మలేరియా విభాగంలో పది మంది సిబ్బంది ఉండరు. కానీ మలేరియా నివారణకు చేపట్టే చర్యల్లో వైద్య ఆరోగ్యశాఖతో పాటు ఇతర శాఖల అధికారులు భాగస్వాములు కావాలి. అలాగే మలేరియా నిర్మూలనకు ఐటీడీఏ, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి ప్రత్యేక చర్యలు చేపట్టాలి. కానీ అటువంటి చర్యలు చేపట్టకుండా మలేరియా నిర్మూలన కేవలం మలేరియా విభాగానికి మాత్రమే సంబంధించినదిగా భావిస్తూ మినహా శాఖలు మిన్నకుంటున్నాయి. దీంతో ఏజెన్సీలో దోమల వ్యాప్తి అరికట్టడం, మలేరియాను నిర్మూలించడం మలేరియా విభాగానికి తలకు మించిన భారంగా ఉంటుంది. అలాగే కేంద్రం అందిస్తున్న పిచికారీ మందు, అందుకు అయ్యే ఖర్చులతోనే మలేరియా నివారణ చర్యలు చేపడుతున్నారు. వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్ శాఖలు ఆశించిన స్థాయిలో పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.
సమష్టి కృషితోనే మలేరియా నియంత్రణ సాధ్యం
ఏజెన్సీలో అన్ని ప్రభుత్వ శాఖల సమష్టి కృషితోనే మలేరియా నియంత్రణ సాధ్యమని మలేరియా విభాగం అధికారులు, వైద్యులు అంటున్నారు. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరిచే పనులను పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది చేపట్టడం, గ్రామాల్లో జ్వరాలు సోకిన వెంటనే వారికి మందులు ఇచ్చే పనిని వైద్య ఆరోగ్యశాఖ చేపడితే చాలా వరకు మలేరియా వ్యాప్తిని అరికట్టవచ్చు. అందుకు ఐటీడీఏ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉంది. ఏజెన్సీలో వైద్యారోగ్య శాఖ, మలేరియా విభాగం, పంచాయతీరాజ్, వెలుగు సిబ్బందిని సమన్వయం చేసి పల్లెల్లో మలేరియా నివారణకు అవసరమైన చర్యలు చేపడితే సత్ఫలితాస్తాయని మలేరియా విభాగం అధికారులు అంటున్నారు. అలాగే మలేరియా కారక దోమల నివారణకు చేపట్టే మందు పిచికారీ పనులు, దోమల లార్వాను నాశనం చేసే యాంటీ లార్వా ఆపరేషన్లు సక్రమంగా జరగడం లేదనే చెప్పాలి.
మలేరియా నివారణకు చేపట్టాల్సిన చర్యలివే...
- ఏజెన్సీ ప్రాంతానికి ప్రత్యేకంగా జిల్లా మలేరియా నివారణ అధికారిని నియమించాలి.
- దోమల నివారణకు ఉపయోగించే మందును ప్రతి ఏడాది మార్చి నెలలోనే ఉన్నతాధికారులు సమకూర్చాలి.
- ప్రతి ఏడాది ఏప్రిల్ రెండో వారం నుంచే దోమల నివారణ మందును పిచికారీ చేయాలి.
- దోమల ఉత్పత్తి పెరగకుండా దోమల గుడ్లను లార్వా దశలోనే నాశనం చేసే యాంటీ లార్వా ఆపరేషన్ ప్రక్రియను సక్రమంగా చేపట్టాలి.
- మొక్కుబడిగా కాకుండా ప్రతి పల్లెలోనూ దోమల నివారణ మందు పిచికారీ చేయాలి.
- స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను పిచికారీ పనుల్లో భాగస్వాములను చేయాలి
- మలేరియా నివారణకు చేపట్టే చర్యల్లో కచ్చితంగా సహకరించాలని వైద్య ఆరోగ్యశాఖ, ఇతర శాఖల సిబ్బందికి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయాలి.
- ఏజెన్సీలో మలేరియా వ్యాప్తి, మరణాలపై వాస్తవాలను అధికారులు గ్రహించాలి. తప్పుడు లెక్కలు, మరణాలపై అవాస్త ప్రకటనలు వంటి చర్యల వల్ల మలేరియా నివారణ చర్యలకు విఘాతం కలుగుతుందని అధికారులు గుర్తించాలి.
- గిరిజనులకు జ్వరం వచ్చిన వెంటనే మలేరియా పరీక్ష, ఇతర వైద్య సేవలు అందుబాటులో ఉంచాలి.
గత ఆరేళ్లుగా మన్యంలో మలేరియా కేసుల వివరాలు
వ.సం. సంవత్సరం రక్తపూతల సంఖ్య(జ్వరబాధితులు) మలేరియా కేసులు
1. 2021 4,011,17 733
2. 2022 4,055,44 714
3. 2023 3,82,778 1,673
4. 2024 3,43,917 1,678
5. 2025 4,46,114 2,086
6. 2026 37,190 49(జనవరి నుంచి ఈ నెల 22 వరకు)