Share News

పార్టీ వాయిస్‌ వినిపించండి

ABN , Publish Date - Jan 30 , 2026 | 01:08 AM

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ విశాఖ జిల్లా పర్యటనలో ఉండగానే ఆ పార్టీ ఎమ్మెల్యేలకు పార్టీ పెద్దలు కొద్దిసేపు క్లాస్‌ తీసుకున్నారు.

పార్టీ వాయిస్‌ వినిపించండి

జనసేన ఎమ్మెల్యేలకు పెద్దల సూచన

కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లండి

ఉత్సవ్‌ విజయవంతమయ్యేలా ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు సమన్వయంతో పనిచేయాలని సూచన

విశాఖపట్నం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి):

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ విశాఖ జిల్లా పర్యటనలో ఉండగానే ఆ పార్టీ ఎమ్మెల్యేలకు పార్టీ పెద్దలు కొద్దిసేపు క్లాస్‌ తీసుకున్నారు. వాస్తవానికి గురువారం ఉదయం పార్టీ అధినేతే వర్చువల్‌ సమావేశంలో ఎమ్మెల్యేలతో మాట్లాడతారని, అంతా అందుబాటులో ఉండాలని సూచించారు. అయితే ఆయన జంతు ప్రదర్శనశాల, కంబాలకొండ సందర్శనకు బయలుదేరడంతో విజయవాడ పార్టీ కార్యాలయం నుంచి రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహార్‌, పార్టీ కార్యాలయ వ్యవహారాలు చూసే ఎమ్మెల్సీ హరిప్రసాద్‌లు ఆడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ఒక్క ఉమ్మడి విశాఖ జిల్లాలోనే నలుగురు ఎమ్మెల్యేలు ఉండడంతో ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి పార్టీ వాయిస్‌ వినిపించాలని వారికి సూచించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న పథకాల గురించి అవసరమైనప్పుడు తప్పనిసరిగా మీడియా ముందుకువచ్చి మాట్లాడాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగం విషయంపై పెద్దఎత్తున చర్చ జరుగుతున్నందున దానిపై కూడా ప్రాంతాల వారీగా మాట్లాడాల్సి ఉందన్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా జనసేన పార్టీ అధినేతపై ప్రతిపక్ష పార్టీ నాయకులు విరుచుకుపడుతున్నారని, దానిపై కూడా స్పందించాలని, వాటిని ఖండించాలని సూచించారు. విశాఖ ఉత్సవ్‌, అనకాపల్లి ఉత్సవ్‌, అరకు ఉత్సవ్‌లు విజయవంతంగా జరిగేలా ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

Updated Date - Jan 30 , 2026 | 01:08 AM