150 వార్డులు చేయండి
ABN , Publish Date - May 21 , 2026 | 12:48 AM
జీవీఎంసీ పరిధిలో వార్డులను 150కు పెంచాలని గాజువాక, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, పి.విష్ణుకుమార్‌రాజులు జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్‌ను కోరారు. వార్డుల విభజనపై బుధవారం కలెక్టర్‌తో చర్చించిన ఇద్దరు ఎమ్మెల్యేలు అనంతరం విలేకరులతో మాట్లాడారు.
కలెక్టర్‌కు ఎమ్మెల్యేలు పల్లా, విష్ణుకుమార్‌రాజు విజ్ఞప్తి
రెండు, మూడు రోజుల్లో ఎమ్మెల్యేలందిరితో సమావేశం: పల్లా
విశాఖపట్నం, మే 20 (ఆంధ్రజ్యోతి): జీవీఎంసీ పరిధిలో వార్డులను 150కు పెంచాలని గాజువాక, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, పి.విష్ణుకుమార్‌రాజులు జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్‌ను కోరారు. వార్డుల విభజనపై బుధవారం కలెక్టర్‌తో చర్చించిన ఇద్దరు ఎమ్మెల్యేలు అనంతరం విలేకరులతో మాట్లాడారు. నగరంలో జనాభా ప్రస్తుతం 26 లక్షలకు చేరిందని, అందుకు అనుగుణంగా వార్డుల సంఖ్యను 150కు పెంచాలని కోరామన్నారు. ప్రస్తుతం వార్డుల సంఖ్యను 98 నుంచి 120కు పెంచారని, అశాస్త్రీయంగా జరిగిన విభజన వల్ల ప్రజలు గందరగోళానికి గురవుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని పేర్కొన్నారు. నగరంలో 150 వార్డులకు సరిపడా జనాభా ఉన్నారని, అందువల్ల జీవీఎంసీ స్పెషల్ ఆఫీసర్ హోదాలో కమిషనర్‌తో చర్చించాలని కలెక్టర్‌ను కోరామన్నారు. రెండు, మూడు రోజుల్లో నగరంలో ఎమ్మెల్యేలమంతా సమావేశమై వార్డుల విభజనపై చర్చిస్తామని పల్లా తెలిపారు. కాగా ఇంధన పొదు పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపు మేరకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం, ఎస్కార్ట్ వాహనాన్ని ప్రభుత్వానికి సరండర్ చేసి సొంత వాహనం వినియోగిస్తున్న ఎమ్మెల్యే పల్లాను ఎమ్మెల్యే విష్షుకుమార్‌రాజు అభినందించారు.