అనకాపల్లిలో భారీ చోరీ
ABN , Publish Date - Aug 08 , 2026 | 12:40 AM
స్థానిక గవరపాలెం విజ్ఞాన సమితి సమీపంలోని ఒక ఇంటిలో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దుండగులు ఇంటి ప్రధానద్వారం తాళాన్ని పగలగొట్టి లోపలకి ప్రవేశించారు. బీరువాలో వున్న ఐదున్నర తులాల బంగారు, 60 తులాల వెండి వస్తువులు, రూ.20 వేల నగదు అపహరించుకుపోయారు. ఇందుకు సంబంధించి పట్టణ సీఐ జి.ప్రేమ్‌కుమార్, ఎస్‌ఐ వెంకటేశ్వరరావు శుక్రవారం మీడియాకు వెల్లడించిన వివరాలిలా వున్నాయి.
ఐదున్నర తులాల బంగారం, 60 తులాల వెండి వస్తువులు అపహరణ
అనకాపల్లి టౌన్, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): స్థానిక గవరపాలెం విజ్ఞాన సమితి సమీపంలోని ఒక ఇంటిలో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దుండగులు ఇంటి ప్రధానద్వారం తాళాన్ని పగలగొట్టి లోపలకి ప్రవేశించారు. బీరువాలో వున్న ఐదున్నర తులాల బంగారు, 60 తులాల వెండి వస్తువులు, రూ.20 వేల నగదు అపహరించుకుపోయారు. ఇందుకు సంబంధించి పట్టణ సీఐ జి.ప్రేమ్‌కుమార్, ఎస్‌ఐ వెంకటేశ్వరరావు శుక్రవారం మీడియాకు వెల్లడించిన వివరాలిలా వున్నాయి.
గవరపాలెం పీలా పోతునాయుడు వీధిలో పెంటకోట సత్యవతి, ఆమె కుమారుడు సతీశ్, కోడలు చిన్నారి నివాసం వుంటున్నారు. రోజు వేకువజామునే హోల్‌సేల్ మార్కెట్‌లో కూరగాయలు కొనుగోలు చేసి, సత్యవతి వాటిని విశాఖపట్నం తీసుకువెళ్లి విక్రయిస్తుంటారు. కొడుకు, కోడలు ఇంటి వద్దనే వీధిలో కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. రోజు మాదిరిగానే సత్యవతి గురువారం రాత్రి విశాఖ నుంచి ఇంటికి వచ్చి, భోజనాలు చేసిన తరువాత ఇంటి ప్రధాన ద్వారానికి తాళం వేసి, మేడపైకి వెళ్లి నిద్రపోయారు. శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంంలో సత్యవతి నిద్రలేచి, కూరగాయల మార్కెట్‌కు వెళ్లేందుకు ఇంటి తలుపులు తీసేందుకు ప్రయత్నించగా రాకపోవడంతో కుమారుడిని నిద్రలేపింది. సతీశ్ వచ్చి చూసి తలుపున బయట గడియ పెట్టి వుండడంతో సమీపంలో ఉన్న తన సోదరుడికి ఫోన్ చేయగా,. అతను వచ్చి గడియ తీశారు. అందరూ కలిసి కిందకు వచ్చి చూడగా ప్రధాన ద్వారానికి వేసిన తాళం పగలగొట్టి వుంది. ఆందోళన చెందుతూ లోపలికి వెళ్లారు. గదిలో బీరువా తెరిచి వుంది. దుస్తులన్నీ చిందరవందరగా పడివున్నాయి. బీరువాలో భద్రపరిచిన ఐదున్నర తులాల బంగారం వస్తువులు, 60 తులాల వెండి వస్తువులు, రూ.20 వేలు నగదు కనిపించలేదు. అర్ధరాత్రి ఒంటి గంట, రెండు గంటల మధ్య చోరీ జరిగివుంటుందని, మేడ మీద నిద్రిస్తున్న తాము కిందకు రాకుండా వుండేందుకు దుండగులు బయట గడియపెట్టారని బాధితులు భావిస్తున్నారు. అనంతరం పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. సీఐ జి.ప్రేమ్‌కుమార్, ఎస్‌ఐ ఎ.వెంకటేశ్వరరావు, సీసీఎస్ సీఐ అప్పలనాయుడు, ఎస్‌ఐ సురేశ్, ఏఎస్‌ఐ కుమార్, పోలీసు సిబ్బంది వచ్చి పరిశీలించారు. క్లూస్ టీమ్ వచ్చి పలుచోట్ల వేలిముద్రలను సేకరించారు. బాధితురాలు పెంటకోట సత్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ వెంకటేశ్వరరావు తెలిపారు.