Share News

మెయిడ్స్‌ మోసాలు!

ABN , Publish Date - Mar 04 , 2026 | 01:03 AM

నరసింహనగర్‌ ప్రాంతానికి చెందిన ఒక పెద్దాయన పిల్లలు విదేశాల్లో ఉంటున్నారు.

మెయిడ్స్‌ మోసాలు!

వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల ఆలనాపాలనా చూసేందుకు సహాయకులను నియమిస్తున్న పిల్లలు

దానిని ఆసరాగా తీసుకుంటున్న కొందరు పనిమనుషులు

సెల్‌ఫోన్‌లో వీడియో కాల్స్‌ మాట్లాడించి ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ ద్వారా బ్యాంకు ఖాతాల సమాచారం సేకరణ

వాటి ఆధారంగా డబ్బులు కొల్లగొట్టి పరారైపోతున్న వైనం

పనిలో పెట్టుకునే ముందు

అన్ని వివరాలు తీసుకోవాలని సూచిస్తున్న పోలీసులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నరసింహనగర్‌ ప్రాంతానికి చెందిన ఒక పెద్దాయన పిల్లలు విదేశాల్లో ఉంటున్నారు. దీంతో ఆయన తనకు తోడుగా ఉండేందుకు ఒక పురుషుడిని పనిలో పెట్టుకున్నారు. అతను ఎవరికో వీడియో కాల్‌ చేసి పెద్దాయనతో మాట్లాడించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు బ్యాంకు ఖాతాలోని డబ్బులు మాత్రం విత్‌డ్రా చేసినట్టు మెసేజ్‌ వచ్చింది. అప్పటినుంచి పనికి పెట్టుకున్న మనిషి కూడా కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ ద్వారా ఖాతాలోని డబ్బును లాగేశారని చెప్పడంతో ఆయన ఖంగుతిన్నారు.

ప్రస్తుతం పిల్లలు ఉద్యోగాల నిమిత్తం సుదూర ప్రాంతాల (ఇతర రాష్ర్టాలు/దేశాలు)కు వెళ్లిపోతున్నారు. అక్కడే స్థిరపడుతున్నారు. పిల్లలతోపాటు వెళ్లడానికి తల్లిదండ్రులు నిరాకరిస్తున్నారు. ఏడాదికో...రెండేళ్లకో ఒకసారి వచ్చిపోవాలని, లేదంటే తామే వచ్చి నెల రోజులు అక్కడ ఉండి వస్తామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులకు రోజువారీ పనులు చేసుకునే శక్తి లేకపోవడంతో వారికి సహాయంగా ఉండేందుకు హోం మెయిడ్‌ పేరుతో పని మనుషులను పెడుతున్నారు. తల్లిదండ్రులతోపాటు ఇంట్లోనే ఉంటూ వారికి వంట చేసి, ఆహారం పెట్టడం, ఇల్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతికి ఆరబెట్టడం వంటి పనులు చేసేలా ఒప్పందం చేసుకుంటున్నారు. దీనికోసం నెలకు రూ.15 వేల వరకు జీతంగా ఇస్తున్నారు. ఇటీవల కాలంలో మెయిడ్‌లకు డిమాండ్‌ పెరుగుతోంది. ఇదిలావుండగా వృద్ధులైన తల్లిదండ్రులకు పిల్లలు నెలనెలా భారీగా డబ్బులు పంపిస్తుండడం, వాటిని ఇంట్లో సరుకులు, మందులు కొనుగోలు కోసం వెచ్చించాలని పిల్లలు వీడియో కాల్‌లో చెబుతుండడం...పక్కనే ఉంటున్న మెయిడ్స్‌ వింటున్నారు. తాము సంరక్షిస్తున్న వృద్ధుల ఖాతాలో భారీగా డబ్బు ఉందని తెలుసుకుని కొందరు దురాశకు పోతున్నారు. వారి ఖాతాల్లోని డబ్బును కొల్లగొట్టేందుకు ప్రణాళికలు తయారుచేస్తున్నారు. తమకు తెలిసిన వారికి తమ సెల్‌ఫోన్‌ నుంచి వీడియో కాల్‌ చేసి తాము సంరక్షిస్తున్న వారితో మాట్లాడిస్తున్నారు. ఈ క్రమంలో టెక్నాలజీ ఆధారంగా వృద్ధుల ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ విధానంలో వారి బ్యాంకు ఖాతా వివరాలను సేకరిస్తున్నారు. వాటి ఆధారంగా వృద్ధుల బ్యాంకు ఖాతాలోని డబ్బులు లాగేసి, తర్వాత చడీచప్పుడు లేకుండా పరారైపోతున్నారు. దీనిపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులను వివరణ కోరగా ఈ తరహా మోసాలు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయని, తెలిసిన వ్యక్తులను మాత్రమే పనిలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు.

Updated Date - Mar 04 , 2026 | 01:03 AM