Share News

కల్యాణపులోవకు మహాశివరాత్రి శోభ

ABN , Publish Date - Feb 14 , 2026 | 11:44 PM

మండలంలోని చీమలపాడు పంచాయతీ శివారు కల్యాణపులోవలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

కల్యాణపులోవకు మహాశివరాత్రి శోభ
భక్తులు సేదతీరేందుకు ఏర్పాటు చేసిన భారీ షామియానాలు

నేటి నుంచి పోతురాజుబాబు, పెద్దింటమ్మ వార్ల ఉత్సవాలు

అన్ని ఏర్పాట్లు పూర్తి

రావికమతం, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చీమలపాడు పంచాయతీ శివారు కల్యాణపులోవలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కల్యాణపులోవలో కొలువుదీరిన పోతురాజుబాబు, పెద్దింటమ్మ వార్ల ఉత్సవాలను ఈ నెల 15 నుంచి 17 వరకు నిర్వహించనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. జలాశయం దిగువన ఉన్న ఆలయ పరిసరాల్లో పలు చెట్లు, తుప్పలను తొలగించి, 48 ఎకరాల మైదానాన్ని చదును చేయించారు. గత ఏడాది వరకు కల్యాణపు లోవ వరకే ఆర్టీసీ బస్సులు, కార్లు, బైక్‌లను అనుమతించేవారు. దీంతో ఆలయానికి, రిజర్వాయర్‌కు మూడు కిలోమీటర్ల ముందే బస్సులు, కార్లు, బైక్‌లు ఆపేయడంతో అక్కడ నుంచి చిన్నారులు, వృద్ధులతో వచ్చేవారు ఇబ్బంది పడేవారు. అంత దూరం నడవ లేక స్వామి దర్శనం చేసుకోకుండానే వెనుతిరిగేవారు. అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టేలా ఎమ్మెల్యే రాజు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ బస్సులు, కార్లు, బైక్‌లు నేరుగా ఆలయం, రిజర్వాయర్‌ వద్దకే వచ్చేలా చుట్టూ మట్టి రింగ్‌ రోడ్డు నిర్మించారు. అలాగే దొండపూడి ఠాణా నుంచి కల్యాణపులోవ వరకు ఉన్న పలు ఇరుకు కల్వర్టుల వద్ద ఏ మాత్రం ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా అప్రోచ్‌ రోడ్లు వేయించారు. ఆలయం వద్ద భక్తులు సేదతీరడానికి భారీ షామియానాలు ఏర్పాటు చేయించారు. ఆలయం వద్ద భారీ క్యూలైన్లు, అలాగే రిజర్వాయర్‌ వద్ద తొమ్మిది స్నాన ఘట్టాల వద్ద నాచు కారణంగా భక్తులు జారిపోకుండా ఇసుక బస్తాలు వేయించారు.

Updated Date - Feb 14 , 2026 | 11:44 PM