Share News

పెద్దేరు రైతుకు మహర్దశ

ABN , Publish Date - Mar 10 , 2026 | 12:48 AM

రెండు దశాబ్దాల నుంచి సాగునీటి కోసం ఇక్కట్లు పడుతున్న పెద్దేరు ఆయకట్టు రైతుల కష్టాలు ఎట్టకేలకు గట్టెక్కనున్నాయి. ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన కుడికాలువ ఆధునికీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. పెద్దేరు ప్రాజెక్టు వద్ద గత ఏడాది డిసెంబరులో పనులు ప్రారంభించగా, రావికమతం మండలం కవ్వగుంట వరకు సుమారు పది కిలోమీటర్ల మేర కాలువలో తుప్పలు తొలగింపు, పూడిక తీత, సిమెంట్‌ లైనింగ్‌ పనులు ఇటీవల పూర్తయ్యాయి.

పెద్దేరు రైతుకు మహర్దశ
కవ్వగుంట వద్ద సిమెంట్‌ లైనింగ్‌ పనులు

శరవేగంగా కుడి కాలువ ఆధునికీకరణ

రూ.29 కోట్లతో 26 కిలోమీటర్ల మేర సిమెంట్‌ లైనింగ్‌ పనులు

ప్రాజెక్టు వద్ద నుంచి కవ్వగుంట వరకు పది కి.మీ.ల మేర ఇటీవల పూర్తి

ప్రస్తుతం రావికమతం మండల పరిధిలో ఎక్స్‌కవేటర్లతో తుప్పలు, పూడిక తొలగింపు

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సీసీ లైనింగ్‌

బుచ్చెయ్యపేట మండలం గున్నెంపూడి వరకు పనులు

వచ్చే ఖరీఫ్‌ నుంచి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరు.

రావికమతం, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): రెండు దశాబ్దాల నుంచి సాగునీటి కోసం ఇక్కట్లు పడుతున్న పెద్దేరు ఆయకట్టు రైతుల కష్టాలు ఎట్టకేలకు గట్టెక్కనున్నాయి. ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన కుడికాలువ ఆధునికీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. పెద్దేరు ప్రాజెక్టు వద్ద గత ఏడాది డిసెంబరులో పనులు ప్రారంభించగా, రావికమతం మండలం కవ్వగుంట వరకు సుమారు పది కిలోమీటర్ల మేర కాలువలో తుప్పలు తొలగింపు, పూడిక తీత, సిమెంట్‌ లైనింగ్‌ పనులు ఇటీవల పూర్తయ్యాయి. ప్రస్తుతం రావికమతం మండల పరిధిలో పనులు జరుగుతున్నాయి. మే నెల చివరినాటికి పనులు పూర్తవుతాయని, వచ్చే ఖరీఫ్‌ నుంచి ఆయకట్టు అంతటికీ సాఫీగా సాగునీరు అందుతుందని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు.

మాడుగుల మండలం రావిపాలెం సమీపంలోని గర్నికం వద్ద పెద్దేరు గెడ్డపై 1993లో రిజర్వాయర్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మాడుగుల, రావికమతం, బుచ్చెయ్యపేట మండ లాల్లో సుమారు 20 వేల ఎకరాలకు నీరు అందించాలన్నది లక్ష్యం. సుమారు పుష్కరకాలం తరువాత 2006లో ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యింది. అయితే అప్పటి ప్రభుత్వం నిధులు సరిగా ఇవ్వకపోవడంతో కాలువలను పూర్తిస్థాయిలో తవ్వలేదు. ఎడమ కాలువ పొడవు 45 కిలోమీటర్లుకాగా 29 కిలోమీటర్లు మాత్రమే తవ్వారు. కుడి కాలువ 26 కిలోమీటర్లు తవ్వినప్పటికీ ఇది ఎడమ కాలువ కన్నా ఎత్తున వుండడం, రెగ్యులేటర్‌ లేకపోవడంతో కుడి కాలువ ఆయకట్టు సుమారు 12 వేల ఎకరాలకు నీరు సరిగా అందని పరిస్థితి నెలకొంది. దీనికితోడు కాలువ తవ్వకంలో సాంకేతిక లోపాల కారణంగా పలుచోట్ల గట్లకు గండ్లు పడ్డాయి. కాలువకు సిమెంట్‌ లైనింగ్‌ లేకపోవడం, నిర్వహణ కొరవడడంతో పిచ్చిమొక్కలు, పూడిక పేరుకుపోయాయి. మదుములు శిథిలావస్థకు చేరుకున్నాయి. కాలువను ఆధునీకరించి తమ పొలాలకు సాగునీరు అందించాలని గత వైసీపీ హయంలో రైతులు పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. కానీ ఒక్క ఏడాది కూడా బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల సమయంలో.. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్దేరు ఆధునికీకరణకు నిధుల మంజూరు చేయిస్తామని మాడుగుల, చోడవరం టీడీపీ అభ్యర్థులు బండారు సత్యనారాయణమూర్తి, కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు హామీ ఇచ్చారు. గత ఏడాది అధికారులతో ప్రతిపాదనలు తయారు చేయించి ప్రభుత్వానికి పంపారు. పెద్దేరు ప్రాజెక్టు వద్ద నుంచి రావికమతం మండలం మీదుగా బుచ్చెయ్యపేట మండలం గున్నెంపూడి చిన్నాల చెరువు వరకు 26 కిలోమీటర్ల మేర కాలువలో తుప్పలు తొలగింపు, పూడిక తీత, సిమెంట్‌ లైనింగ్‌, మదుముల మరమ్మతు పనులకు రూ.29.25 కోట్లు కేటాయించింది. టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి, గత ఏడాది డిసెంబరులో పనులు మొదలుపెట్టారు. ప్రాజక్టు వద్ద నుంచి రావికమతం కవ్వగుంట వరకు సుమారు పది కిలోమీటర్ల మేర సిమెంట్‌ లైనింగ్‌ పనులు ఇటీవల పూర్తయ్యాయి. ప్రస్తుతం బుడ్డిబంద, కేబీపీ అగ్రహారం, దిడ్డిబాదనపాడు మీదుగా మేడివాడ పెద్దచెరువు వరకు కాలులో తుప్పల తొలగింపు, పూడిక తీత, సీసీ లైనింగ్‌ పనులు సాగుతున్నాయి. తరువాత బుచ్చెయ్యపేట మండలం గున్నెంపూడి చిన్నాలు చెరువు వరకు పనులు చేస్తారు. మరో మూడు నెలల్లో కాలువ ఆధునికీకరణ పనులు పూర్తవుతాయని, వచ్చే ఖరీఫ్‌ నుంచి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు సరఫరా అవుతుందని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు.

Updated Date - Mar 10 , 2026 | 12:48 AM