Share News

చోడవరంలో స్వయంభూ గౌరీశ్వరాలయం పుష్కరిణికి మహర్దశ

ABN , Publish Date - Jun 09 , 2026 | 01:53 AM

స్థానిక స్వయంభూ గౌరీశ్వరాలయం పుష్కరిణి అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి.

చోడవరంలో స్వయంభూ గౌరీశ్వరాలయం పుష్కరిణికి మహర్దశ

రూ.2 కోట్ల వ్యయంతో అభివృద్ధి

చోడవరం, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి):

స్థానిక స్వయంభూ గౌరీశ్వరాలయం పుష్కరిణి అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. సుమారు రెండు కోట్ల రూపాయలతో ఆలయ ప్రాంగణాన్ని ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చి దిద్దడానికి ప్రణాళికాబద్ధంగా పనులు జరుగుతున్నాయి.

సుమారు ఎనిమిది శతాబ్దాల చరిత్ర కలిగి, స్వయంభూ దేవాలయంగా పేరొందిన స్థానిక స్వయంభూ గౌరీశ్వరాలయానికి ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ ఆలయానికి ఉత్తర దిక్కున పుష్కరిణి వుంది. గతంలో ఈ పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేవారు. అయితే ఏళ్ల తరబడి నిర్వహణకు నోచుకోకపోవడంతో పూడిక, వ్యర్థాలు పేరుకుపోయాయి. జమ్ము గడ్డి పెరిగిపోయింది. నీరు నాచుపట్టి దుర్వాసన వచ్చేది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత స్థానిక ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎన్‌ రాజు, స్వయంభూ గౌరీశ్వరాలయం పుష్కరిణికి పూర్వవైభవం తీసుకురావాలని సంకల్పించారు. ప్రభుత్వం నిధులతోపాటు దాతల సహకారంతో అభివృద్ధి చేయడానికి నమూనా ప్రణాళికను రూపొందించారు. తొలుత ప్రభుత్వం రూ.50 లక్షలు మంజూరు చేసింది. ఎమ్మెల్యే రాజు విజ్ఞప్తి మేరకు దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందచేస్తున్నారు. సుమారు రెండు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో గత నెలలో పుష్కరిణి అభివృద్ధి పనులు మొదలుపెట్టారు. పుష్కరిణిలో మట్టిని పూర్తిగా తొలగించి కాంక్రీటుతో బేస్‌మెంట్‌ వేస్తున్నారు. చుట్టూ ఉద్యానవనాన్ని అభివృద్ధి చేస్తారు. పుష్కరిణి లోపల నాలుగు వైపులా పిల్లర్లు నిర్మించి, వాటిపై శ్లాబ్‌ వేసి భక్తులు ప్రదక్షిణ చేయడానికి నడకమార్గంగా మారుస్తారు. పుష్కరిణి మధ్యలో చతురస్రాకారంలో వేదిక నిర్మించి, దానిపై భారీ శివపార్వతుల విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఈ వేదిక వద్దకు చేరుకునేందుకు ఒకవైపు నుంచి ర్యాంపు నిర్మిస్తారు. ఈ పనులన్నీ పూర్తయితే చోడవరంతోపాటు చుట్టుపక్కల మండలాల ప్రజలకు ఇది ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా మారుతుంది. కూటమి ప్రభుత్వ హయాంలో గౌరీశ్వరాలయం పుష్కరిణిని అభివృద్ధి చేయడం సంతోషకరమని భక్తులు అంటున్నారు.

దాతలు సహకారం అందించాలి

కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, ఎమ్మెల్యే

స్వయంభూ గౌరీశ్వరాలయం పుష్కరిణి అభివృద్ధికి ప్రభుత్వపరంగా ఆర్థిక సహకారం అందుతున్నది. అలాగే భక్తులు కూడా తమ స్థాయికి తగ్గట్టు విరాళాలు అందించి సహకరించాలి. పుష్కరిణి అభివృద్ధి పనులు పూర్తయితే ఈ ప్రదేశం ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుంది. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి పుష్కరిణిని భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తాం.

Updated Date - Jun 09 , 2026 | 01:53 AM