చెరువులకు మహర్దశ
ABN , Publish Date - May 14 , 2026 | 12:55 AM
జిల్లాలోని నర్సీపట్నం, చోడవరం జలవనరుల శాఖ డివిజన్ల పరిధిలోని చెరువుల అభివృద్ధి పనులకు పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి.
అభివృద్ధి పనులకు రూ.8.23 కోట్లు
జలధార- జలహారతి కార్యక్రమంలో 117 పనులు
చోడవరం డివిజన్‌కి 69, నర్సీపట్నం డివిజన్‌కి 48
పరిపాలనా అనుమతులు మంజూరు
నర్సీపట్నం, మే 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని నర్సీపట్నం, చోడవరం జలవనరుల శాఖ డివిజన్ల పరిధిలోని చెరువుల అభివృద్ధి పనులకు పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. జలధార-జలహారతి కార్యక్రమంలో భాగంగా గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి, మదాలు, స్లూయిజ్ మరమ్మతులు, షట్టర్ల ఏర్పాటు, పంట కాలువలలో పూడికతీత పనులు చేపట్టనున్నారు. నర్సీపట్నం జలవనరుల శాఖ డివిజన్‌లో 48, చోడవరంలో 69 చొప్పున.. మొత్తం 117 అభివృద్ధి పనులకు మెటీరియల్ కాంపౌండ్ కింద జిల్లా ఖనిజ సంపద (డీఎంఎఫ్) నుంచి రూ.8.23 కోట్లు మంజూరు చేశారు. ఈ పనులకు సంబంధించి పరిపాలనా అనుమతులు ఇస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అంతే కాకుండా రూరల్ ప్రాంతంలో చెరువులు, కాలువలలో పూడికతీత పనులు ఉపాధి హమీ పథకంలో చేపట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
చెరువులు, పంట కాలువలకు పూర్వ వైభవం
గొలుసుకట్టు చెరువులు, పంట కాలువలకు పూర్వవైభవం రానున్నది. గత పదేళ్లకు పైగా అభివృద్ధికి నోచుకోకపోవడంతో పూడిక పేరుకుపోయి పంట కాలువలన్నీ మరుగు కాలువలుగా మారిపోయాయి. ఉదాహరణకు నర్సీపట్నం జర్నలిస్ట్ కాలనీ మీదుగా వెళ్లే పెదబొడ్డేపల్లి పెద్ద చెరువు పంట కాలువలో మురుగు పేరుకుపోయి డ్రైనేజీని తలపిస్తోంది. గొలుగొండ మండలంలోని 113 చెరువులకు గాను 50 చెరువులకు గేట్లు పూర్తిగా పాడయ్యాయి. దారగడ్డ ఆనకట్ట పూర్తిగా శిథిలావస్థకు చెరుకుంది. గత వైసీపీ ప్రభుత్వం ఇరిగేషన్ అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఐదేళ్ల పాలనలో చెరువులు, పంట కాలువల అభివృద్ధికి నయా పైసా నిధులు విదల్చలేదు. దీంతో చెరువులు, కాలువల్లో పూడిక పేరుకుపోయి ఆయకట్టుకి సాగునీరు అందే పరిస్థితి లేకుండాపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జలధార- జలహారతి పథకంలో చెరువుల అభివృద్ధికి చర్యలు చేపట్టింది. జిల్లాలో ఈ 117 పనులు పూర్తయితే సాగునీటి వనరులు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటాయి. నర్సీపట్నం డివిజనల్‌లో 48 పనులకు రూ.2.73 కోట్లు, చోడవరం డివిజన్‌లో 69 వర్కులకు రూ.5.5 కోట్లు చొప్పున మొత్తం 117 పనులను రూ.8.23 కోట్ల్లతో చేపట్టనున్నారు.