ఎన్టీఆర్ వైద్యాలయానికి మహర్దశ
ABN , Publish Date - Sep 13 , 2026 | 01:08 AM
అన్ని రకాల వైద్య సేవలు ఎన్టీఆర్ వైద్యాలయంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఎంపీ సీఎం రమేశ్ తెలిపారు. ఎన్టీఆర్ వైద్యాలయం ఆవరణలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద రూ.22.2 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ విభాగాన్ని శనివారం విజయవాడ నుంచి కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్‌లు వర్చువల్‌గా ప్రారంభించిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, సుందరపు విజయ్‌కుమార్‌తో కలిసి ఇక్కడ పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
- అందుబాటులోకి 50 పడకల క్రిటికల్ కేర్ విభాగం
- విజయవాడ నుంచి వర్చువల్‌గా ప్రారంభించిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా, సీఎం చంద్రబాబు
- రూ.6.70 కోట్లతో వైద్యాలయం 400 పడకల విస్తరణకు ప్రతిపాదనలు
- ఎంపీ సీఎం రమేశ్
అనకాపల్లి టౌన్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): అన్ని రకాల వైద్య సేవలు ఎన్టీఆర్ వైద్యాలయంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఎంపీ సీఎం రమేశ్ తెలిపారు. ఎన్టీఆర్ వైద్యాలయం ఆవరణలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద రూ.22.2 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ విభాగాన్ని శనివారం విజయవాడ నుంచి కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్‌లు వర్చువల్‌గా ప్రారంభించిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, సుందరపు విజయ్‌కుమార్‌తో కలిసి ఇక్కడ పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ క్రిటికల్ కేర్ సెంటర్ అందుబాటులోకి రావడంతో అనకాపల్లి జిల్లా ప్రజారోగ్య రంగంలో ముందడుగు వేసిందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను విశాఖకు తరలించాల్సిన అవసరం తగ్గడంతో పాటు పేదలు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి కూడా తగ్గుతుందన్నారు. అన్ని రకాల వైద్య సేవలు ఇక్కడే అందేలా జిల్లా ఆస్పత్రిని అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. క్రిటికల్ కేర్ సెంటర్‌కు అదనంగా రూ.7.5 కోట్ల విలువైన అత్యాధునిక వైద్య పరీక్షలు అందుబాటులోకి రానున్నాయన్నారు. భవిష్యత్తులో 20 పడకల డయాలసిస్ సేవలను విస్తరించనున్నామన్నారు. ఇప్పటికే వైద్యాలయంలో సీఎస్‌ఆర్ నిధులతో ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి తీసుకువచ్చామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో జిల్లా ఆస్పత్రిని 400కు పైగా పడకలకు విస్తరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. దశల వారీగా ఆస్పత్రి భవనాలను ఆధునికీకరించి రోగులకు పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. రానున్న రోజుల్లో ఎంఆర్‌ఐ స్కాన్‌ను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు. అనకాపల్లి పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో జిల్లాకు ఈఎస్‌ఐ వైద్యకళాశాల కోసం కృషి చేస్తున్నామని ఎంపీ సీఎం రమేశ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీయూఎఫ్‌ఐడీసీ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, కార్పొరేషన్ల చైర్మన్లు బత్తుల తాతయ్యబాబు, పీవీజీ కుమార్, డీసీఎంఎస్ చైర్‌పర్సన్ కోట్ని బాలాజీ, జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు తాడి శాంతికుమారి, ఆళ్ల రామచంద్రరావు, డీడీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.