ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మహర్దశ
ABN , Publish Date - Aug 20 , 2026 | 11:11 PM
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మహర్దశ పట్టింది. ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం కళాశాల ఆధునికీకరణకు రూ.5 కోట్ల పీఎం ఉష(ప్రధానమంత్రి ఉచ్చతార్ శిక్షా అభియాన్) పథకం నిధులు మంజూరు చేసింది.
పీఎం ఉష పథకం నిధులతో అత్యాధునిక సదుపాయాలు
కంప్యూటర్, సైన్సు ల్యాబ్‌లు, జిమ్, గ్రంథాలయం, అదనపు తరగతి గదులు
నెల రోజుల్లో పూర్తికానున్న ఆధునికీకరణ పనులు
చింతపల్లి, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మహర్దశ పట్టింది. ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం కళాశాల ఆధునికీకరణకు రూ.5 కోట్ల పీఎం ఉష(ప్రధానమంత్రి ఉచ్చతార్ శిక్షా అభియాన్) పథకం నిధులు మంజూరు చేసింది. ఏడాది క్రితం ప్రారంభమైన నిర్మాణ పనులు 90శాతం పూర్తయ్యాయి. విద్యార్థులకు అదనపు తరగతి గదులు, కంప్యూటర్, సైన్సు ల్యాబ్‌లతో పాటు సెమినార్ హాల్, జిమ్, గ్రంథాలయం అందుబాటులోకి వచ్చాయి. దీంతో సుదీర్ఘకాలంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న తరగతి గదుల కొరత సమస్యకు పరిష్కారం లభించింది.
చింతపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను 2008లో ఏర్పాటు చేశారు. 2010లో పదకొండు గదులతో కళాశాల భవనం నిర్మించారు. కొన్ని గదులు విద్యాబోధనకు, కార్యాలయం, గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్ కోసం వినియోగిస్తున్నారు. కళాశాలలో బీఎస్పీ కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, బోటనీ, జువాలజీ, బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్, బీఏ ఎకనామిక్స్, హిస్టరీ కోర్సులు ఉన్నాయి. కళాశాల ప్రారంభం నుంచి సైన్సు ల్యాబ్‌లు అందుబాటులో లేవు. విద్యార్థులు ల్యాబ్‌లో ప్రయోగాలు చేయకుండానే విద్యాభ్యాసాన్ని పూర్తి చేస్తున్నారు. విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేక అవస్థలు పడేవారు. దీంతో 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కళాశాలల ఆధునికీకరణకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. చింతపల్లి డిగ్రీ కళాశాల విద్యార్థుల విద్యాభ్యాసానికి అవసరమైన పూర్తిస్థాయి సదుపాయాలు కల్పించేందుకు 2025 జూన్‌లో పీఎం ఉషా పథకం ద్వారా రూ.5 కోట్ల నిధులను విడుదల చేసింది. రూ.3.5 కోట్ల నిధులతో జీప్లస్ -1లో అదనపు తరగతి గదుల నిర్మాణం, రూ.50 లక్షలతో పాత కళాశాల భవనం ఆఽధునికీకరణ, రూ.50 లక్షల నిధులతో కళాశాలకు అవసరమైన ఫర్నిచర్, రూ.50 లక్షలతో సాఫ్ట్ కాంపోనెంట్స్‌కు కేటాయించారు.
విద్యార్థులకు కంప్యూటర్ విద్య
కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్ సైన్సు, బీకాం కంప్యూటర్ అప్లికేషన్ కోర్సులు అభ్యసించే విద్యార్థులకు మాత్రమే కంప్యూటర్ విద్యబోధన జరుగుతున్నది. కళాశాలలో కంప్యూటర్ విద్యాబోధన చేసే అధ్యాపకులు ఉన్నప్పటికి ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్ అందుబాటు ఉండేదికాదు. పీఎం ఉష పథకం ద్వారా కళాశాలకు అత్యాధునిక టెక్నాలజీ కలిగిన 50 కంప్యూటర్లను ప్రభుత్వం పంపించింది. ఈ కంప్యూటర్లతో కళాశాలలో ప్రత్యేక ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. దీంతో కళాశాలలో వివిధ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులందరికి పాఠ్యాంశాలతో పాటు గంటసేపు కంప్యూటర్ శిక్షణ పొందుతున్నారు.
ప్రత్యేక సైన్సు ల్యాబ్‌లు
కళాశాల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సైన్సు విద్యార్థులకు ల్యాబ్‌లు అందుబాటులో లేవు. ప్రభుత్వం పీఎం ఉష పథకం ద్వారా నాలుగు ల్యాబ్‌లను మంజూరు చేసింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బోటనీ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. ల్యాబ్‌లలో విద్యార్థులు ప్రయోగాలు చేసేందుకు అవసరమైన అత్యాధునిక పరికరాలను ప్రభుత్వం సమకూర్చుతుంది. ల్యాబ్‌లు అందుబాటులోకి రావడంతో విద్యార్థులు ప్రాక్టికల్ విద్యలో మెరుగైన ప్రతిభ చూపే అవకాశం ఉంది.
సిక్స్ స్టాండింగ్ మల్టీ జిమ్
కళాశాల విద్యార్థుల కోసం పీఎం ఉషలో భాగంగా అత్యాధునిక సిక్స్ స్టాండింగ్ మల్టీ జిమ్ ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులు జిమ్ చేసేందుకు అవసరమైన పరికరాలను ప్రభుత్వం సమకూరుస్తుంది. ఈ ఆధునిక జిమ్ సామగ్రి పదిహేను రోజుల్లో రానున్నది. అలాగే సెమినార్ హాల్‌ను కూడా కళాశాలలో ఏర్పాటు చేశారు. 150-200 మంది కూర్చోవడానికి అనువుగా ఈ హాల్ నిర్మించారు.