Share News

చోడవరం, మాడుగులకు మహర్దశ

ABN , Publish Date - May 17 , 2026 | 11:15 PM

చోడవరం, మాడుగుల నియోజకవర్గాల రూపురేఖలు మారనున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాంబిల్లి నుంచి అనకాపల్లి, చోడవరం, మాడుగుల ప్రాంతాలను కలుపుతూ భోగాపురం వరకూ సెమీ రింగు రోడ్డు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలపడంతో ఈ రెండు నియోజకవర్గాలకు మహర్దశ పట్టనుంది.

చోడవరం, మాడుగులకు మహర్దశ
సెమీ రింగు రోడ్డుగా మారనున్న వెంకన్నపాలెం- కె.కోటపాడు రోడ్డు

భోగాపురం వరకు సెమీ రింగు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం

ఉత్తరాంధ్ర జిల్లాలను అనుసంధానిస్తూ 102 కిలోమీటర్ల మేర నిర్మాణం

కూటమి ప్రభుత్వ నిర్ణయంతో మారనున్న రెండు నియోజకవర్గాల భవిష్యత్తు

చోడవరం, మే 17 (ఆంధ్రజ్యోతి): చోడవరం, మాడుగుల నియోజకవర్గాల రూపురేఖలు మారనున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాంబిల్లి నుంచి అనకాపల్లి, చోడవరం, మాడుగుల ప్రాంతాలను కలుపుతూ భోగాపురం వరకూ సెమీ రింగు రోడ్డు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలపడంతో ఈ రెండు నియోజకవర్గాలకు మహర్దశ పట్టనుంది.

వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో చేపట్టనున్న 102 కిలోమీటర్ల పొడవున సెమీ రింగు రోడ్డు రాంబిల్లి నుంచి అచ్యుతాపురం, అనకాపల్లి, చోడవరం, మాడుగుల నియోజకవర్గాలను తాకుతూ కొత్తవలస మీదుగా విజయనగరం జిల్లా భోగాపురాన్ని కలిపేలా రంగం సిద్ధమైంది. వీఎంఆర్‌డీఏ చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉందని వీఎంఆర్‌డీఏ అధికారవర్గాల సమాచారం. విశాఖనగరంపై పెరుగుతున్న ట్రాఫిక్‌ ఒత్తిడిని తగ్గించే దిశగా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా చేపడుతున్న ఈ సెమీ రింగు రోడ్డు నిర్మాణంలో నాలుగు నుంచి ఆరు వరుసల వరకు రోడ్డు అభివృద్ధి చేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న రహదారితో పాటు జాతీయ రహదారికి ప్రత్యామ్నాయంగా చేపట్టే సెమీ రింగు రోడ్డు నిర్మాణం వల్ల భవిష్యత్తులో విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలన్నింటికీ ప్రధాన జిల్లాలతో మరింత అనుసంధానం ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే డీపీఆర్‌ తయారీ దిశగా అడుగులు పడడంతో వచ్చే ఏడాదిలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పట్టాలెక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సెమీ రింగు రోడ్డు అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి, ఎలమంచిలి నియోజకవర్గాల్లోని రాంబిల్లి, అచ్యుతాపురం, అనకాపల్లి, కశింకోట, మునగపాక మండలాల మీదుగా, అలాగే చోడవరం మండలం వెంకన్నపాలెం మీదుగా నరసాపురం జంక్షన్‌ నుంచి, అక్కడ నుంచి కె.కోటపాడు, ఆనందపురం, దేవరాపల్లి మండలాల మీదుగా, విజయనగరం జిల్లా కొత్తవలస, డెంకాడ ప్రాంతాలను కలుపుతూ వెళ్లనున్నట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఈ సెమీ రింగు రోడ్డు నిర్మాణంతో ఇంతకాలం గ్రామీణప్రాంతంలో వెనుకబాటుతనంలో ఉన్న చోడవరం, మాడుగుల నియోజకవర్గాలకు మహర్దశ పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. వాస్తవానికి పారిశ్రామిక పరంగా అనకాపల్లి జిల్లా ఇటీవల కాలంలో బాగానే పురోగతి చెందుతున్నది. విశాఖ, విజయనగరం జిల్లాలకు కూడా రహదారి సౌకర్యాలు బాగానే ఏర్పడ్డాయి. అల్లూరి జిల్లా కూడా పర్యాటకపరంగా అభివృద్ధి చెందుతున్నది. అయితే పూర్తిగా గ్రామీణ ప్రాంతంగా ఉండిపోయిన చోడవరం, మాడుగుల నియోజకవర్గాలు మాత్రం రహదారుల పరంగా అభివృద్ధి విషయంలో ఇతర ప్రాంతాలకంటే చాలా వెనుకబడిపోయాయనే చెప్పాలి. కేవలం వ్యవసాయ ఆధారితమైన ఈ రెండు నియోజకవర్గాల్లో రహదారి, రవాణా సౌకర్యాలు లేకపోవడంతో దశాబ్దాల తరబడి ఎదుగూ బొదుగూ లేకుండా ఉండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సెమీ రింగు రోడ్డు ఈ రెండు నియోజకవర్గాలను కలుపుతూ వెళ్లడం ద్వారా భవిష్యత్తులో ఈ ప్రాంతం పారిశ్రామికంగా, వ్యాపారపరంగా కూడా ఇతర ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం చేపట్టే ఈ సెమీ రింగు రోడ్డు వల్ల చోడవరం, మాడుగుల నియోజకవర్గాల తలరాత మారుతుందన్న ఆశలు స్థానికుల్లో చిగురిస్తున్నాయి.

Updated Date - May 17 , 2026 | 11:15 PM