‘మహా’ ఉత్కంఠ
ABN , Publish Date - Oct 12 , 2026 | 01:00 AM
జీవీఎంసీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈనెల 14 లేదా 15 ఎన్నికల షెడ్యూల్ జారీ అయ్యే అవకాశం ఉంది.
జీవీఎంసీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై విశ్లేషణలు
జనాభా నిష్పత్తి ప్రకారం అధికారుల కసరత్తు
నేడు రిజర్వేషన్‌లు ఖరారుచేస్తూ నోటిఫికేషన్ జారీ
మేయర్ పీఠం ఓసీ మహిళకు కేటాయించే ఛాన్స్!
రాష్ట్రస్థాయి నేతలకు ఫోన్‌చేసి ఆశావహుల ఆరా
జీవీఎంసీలో బీసీలకు 40, ఎస్సీలకు పది, ఎస్టీలకు ఒకటి
ఓపెన్ కేటగిరీలో 69 వార్డులు
అన్ని కేటగిరీల్లోనూ సగం సీట్లు మహిళలకు
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈనెల 14 లేదా 15 ఎన్నికల షెడ్యూల్ జారీ అయ్యే అవకాశం ఉంది. దీనికిముందు రిజర్వేషన్‌లను ఖరారుచేస్తూ గెజిట్ జారీచేయాల్సి ఉంది. దీంతో మేయర్, కార్పొరేటర్ పదవులను ఆశిస్తున్న వారంతా రిజర్వేషన్‌ల కోసం రాష్ట్రస్థాయిలోని నేతలు, అధికారులకు ఫోన్‌చేసి ఆరా తీస్తున్నారు. కొందరునేతలు మేయర్ రిజర్వేషన్‌పై లోతుగా విశ్లేషణ చేస్తున్నారు. గతంలో మేయర్ పదవిని బీసీ జనరల్‌కు రిజర్వుచేయడంతో ఈసారి ఓసీ మహిళకు కేటాయించనున్నారనే ప్రచారం జరుగుతోంది.
రాష్ట్రంలోని అన్ని పట్టణస్థానిక సంస్థలకు అక్టోబరు నెలాఖరుకు ఎన్నికలను పూర్తిచేస్తామని ప్రకటించిన రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు ్లపూర్తిచేసింది. వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితా ప్రదర్శన, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఎన్నికల సామగ్రి సరఫరా ప్రక్రియలను పూర్తిచేయగా, ఆఖరి అంకమైన రిజర్వేషన్‌ల ఖరారుపై కసరత్తు పూర్తిచేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా అన్నివర్గాలకు సముచితప్రాధాన్యం కల్పించేలా ఖరారుచేయాలని నిర్ణయించింది. దీనిపై కసరత్తు ప్రారంభించాలని అన్ని జిల్లాలు, మున్సిపల్ కార్పొరేషన్‌ల అధికారులను ఆదేశిస్తూ ఆదివారం జీవో జారీచేసింది. ఈ మేరకు జీవీఎంసీ పరిధిలోని జనాభాతో పాటు మొత్తం ఓటర్ల సంఖ్యను కులాలు, కేటగిరీవారీగా అధికారులు సిద్ధం చేశారు. ప్రభుత్వం సోమవారం రిజర్వేషన్‌ల నిష్పత్తిని ఖరారుచేస్తూ ప్రకటన జారీ చేయగానే ప్రతిపాదనను జీవీఎంసీ అధికారులు సిద్ధం చేసి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌కు అందజేస్తారు. పరిశీలన అనంతరం కలెక్టర్ గెజిట్ జారీచేస్తారు. ఈప్రక్రియ పూర్తైన తర్వాత ఈనెల 14 లేదా 15న రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను జారీచేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మేయర్, వార్డుల రిజర్వేషన్‌పై ఉత్కంఠ
జీవీఎంసీ మేయర్ పదవితోపాటు కార్పొరేటర్‌గా పోటీ కి ఉత్సాహపడుతున్న ఆశావహుల్లో రిజర్వేషన్ల ప్రకటనపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలోనే అతిపెద్ద మునిసిపల్ కార్పొరేషన్ కావడంతో జీవీఎంసీ మేయర్ పీఠంపై సీనియర్ ప్రజాప్రతినిధులతోపాటు ఆర్థికంగా సంపన్నులైన రాజకీయనేతలు కన్నేశారు. రిజర్వేషన్ తమకు అనుకూలిస్తే టికెట్ కోసం ఒత్తిడి తేవాలని చూస్తున్నారు. మేయర్ పదవి రిజర్వేషన్ కోసం ఇప్పటికే రాజధానిలో రాష్ట్రస్థాయి నేతలతోపాటు పరిచయం ఉన్న అధికారులకు ఫోన్‌చేసి ఆరాతీస్తున్నారు. ఉన్నతస్థాయి అధికారుల సమాచారం మేరకు జీవీఎంసీ మేయర్ పీఠాన్ని ఓసీ మహిళకు రిజర్వుచేసే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు వార్డు కార్పొరేటర్ల రిజర్వేషన్‌లకు కూడా సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉండడంతో ఆశాహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
రోస్టర్ మేరకు...
రోస్టర్ ప్రకారం ఎస్టీలకు 7.5 శాతం, ఎస్సీలకు 15 శాతం, బీసీలకు 28 శాతం సీట్లును కేటాయించాల్సి ఉంటుంది. ఈ మేరకు జీవీఎంసీ పరిధిలోని 120 వార్డులకు ఎస్టీలకు తొమ్మిది వార్డులను కేటాయించాలి. కానీ ఎస్టీల సంఖ్య స్వల్పం కావడంతో గత ఎన్నికల్లో మాదిరిగానే వారికి ఒక సీటు కేటాయించే అవకాశం ఉంది. ఎస్సీలకు 15 శాతం అంటే 18 సీట్లు కేటాయించాలి. కానీ జీవీఎంసీ మొత్తం జనాభాలో ఎస్సీల నిష్పత్తి తక్కువ. దీంతో పది వార్డులు కేటాయించే వీలుంది. బీసీలకు 28 శాతం అంటే 35 వార్డులు వారికి కేటాయించాలి. కానీ రాష ్ట్రప్రభుత్వం బీసీలకు పార్టీపరంగా అదనపు సీట్లు కేటాయించే అవకాశం ఉండడంతో వారికి 40 వార్డులు దక్కే అవకాశం ఉంది. మిగిలిన వార్డులను ఓసీ కేటగిరీలకు కేటాయిస్తారు. అన్నికేటగిరీలతోపాటు ఓసీ కేటగిరిలో కూడా సగం సీట్లు కచ్చితంగా మహిళలకే కేటాయించాల్సి ఉంటుంది. ఈ మేరకు 120 మంది కార్పొరేటర్లలో 60 మంది మహిళలకు చాన్స్ లభించనుంది.