Share News

ఆర్కే బీచ్‌లో మహా శివరాత్రి వేడుకలు

ABN , Publish Date - Feb 14 , 2026 | 12:39 AM

జిల్లాలోని 79 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఓటర్ల జాబితాల తయారీకి అధికారులు సన్నద్ధమయ్యారు.

ఆర్కే బీచ్‌లో మహా శివరాత్రి వేడుకలు

టీఎస్‌ఆర్‌ ఆధ్వర్యంలో మహా కుంభాభిషేకం నిర్వహణ

విశాఖపట్నం, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి):

ఏటా మాదిరిగానే ఈ నెల 15న మహా శివరాత్రిని పురస్కరించుకుని టీఎస్‌ఆర్‌ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్‌లో మహా కుంభాభిషేకాన్ని నిర్వహిస్తున్నట్టు కాకినాడ భారత యజ్ఞపీఠం ప్రతినిధి, ఉత్సవ నిర్వాహకులు రత్నాల చంద్రశేఖర్‌ తెలిపారు. సిరిపురంలోని టీఎస్‌ఆర్‌ బంగ్లాలో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివారం ఉదయం భక్తులతో స్వయంగా పవిత్ర జలాలు, పండ్ల రసాలతో శివలింగానికి అభిషేకాన్ని టీఎస్‌ఆర్‌ చేయించనున్నట్టు వెల్లడించారు. ఉత్సవ కన్వీనర్‌, తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్‌ మాట్లాడుతూ విశాఖ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ ప్రాంతానికి ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం వాటిల్లకూడదన్న ఉద్దేశంతో ఏటా టీఎస్‌ఆర్‌ మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నారన్నారు. టీఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ కార్యదర్శి ఎస్‌కే బాషా మాట్లాడుతూ భక్తులకు రుద్రాక్షలు, పసుపు తాళ్లు, ప్రసాదాలు ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఉదయం 9 నుంచి ఒంటి గంట వరకు మహా కుంభాభిషేకం, మధ్యాహ్నం హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతాయన్నారు. సమావేశంలో పేడాడ రమణకుమారి, జీవీ రామచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.


నేడు పాఠశాలలకు సెలవు లేదు

విశాఖపట్నం, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలోని అన్ని పాఠశాలలూ శనివారం యథావిధిగా పనిచేస్తాయని విద్యాశాఖాధికారి ఎన్‌.ప్రేమకుమార్‌ తెలిపారు. మొంథా తుఫాన్‌ సమయంలో పాఠశాలలకు మూడు రోజులు సెలవు ఇచ్చారు. విద్యా సంవత్సరంలో పాఠశాలలు విధిగా 220 రోజులు పనిచేయాల్సి ఉంటుంది. తుఫాన్‌ సమయంలో సెలవులు ఇచ్చినందున...ఇప్పటికే రెండు నెలలు రెండు శనివారాలు పాఠశాలలు నిర్వహించారు. ఈ నెల కూడా రెండో శనివారం పాఠశాలలు పనిచేస్తాయని డీఈవో తెలిపారు.


పోర్టు సెక్రటరీగా శంకర్‌బాబు

విశాఖపట్నం, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం పోర్టు సెక్రటరీగా ఎం.శంకర్‌బాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మార్మగోవా పోర్టు సెక్రటరీగా పనిచేస్తున్న ఆయన్ను కేంద్ర పోర్టులు, నౌకా జల రవాణా శాఖ విశాఖపట్నం పోర్టుకు బదిలీ చేసింది. ముందుగా పోర్టు డిప్యూటీ చైర్మన్‌ రోష్ని అపరంజి కొరాటిని మర్యాదపూర్వకంగా కలిశారు.


పంచాయతీ ఓటర్ల జాబితాల రూపకల్పన

కలెక్టరేట్‌ నుంచి సంబంధిత అధికారులకు సమాచారం

ఇంటింటికీ వెళ్లి కులాల వివరాలు సేకరించాలని ఆదేశం

వాటిని బట్టి రిజర్వేషన్‌ల ఖరారు

వచ్చే నెల 9న పంచాయతీల్లో తుది జాబితాలు ప్రదర్శన

విశాఖపట్నం, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలోని 79 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఓటర్ల జాబితాల తయారీకి అధికారులు సన్నద్ధమయ్యారు. వచ్చే నెల తొమ్మిదో తేదీన పంచాయతీల వారీగా జాబితాలు ప్రదర్శించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నాలుగు రోజుల క్రితమే ఆదేశాలు జారీచేసింది. దీని ప్రకారం ఇంటింటికీ వెళ్లి సమగ్ర సమాచారం సేకరించాలని పంచాయతీ అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం కలెక్టరేట్‌లోని ఎన్నికల విభాగం 79 గ్రామ పంచాయతీల ఓటర్ల వివరాలకు సంబంధించిన సాఫ్ట్‌ కాపీని జిల్లా పంచాయతీ విభాగానికి అందజేసింది. పూర్తి సమాచారంతో కూడిన జాబితాలను భీమిలి, పెందుర్తి నియోజకవర్గాల ఎన్నికల అధికారుల నుంచి తీసుకోవాలని డీపీవోకు జిల్లా యంత్రాంగం సూచించింది. బూత్‌ల వారీగా వివరాలు అందిన తరువాత గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాను పంచాయతీ కార్యదర్శులకు సంబంఽధితమండల పరిషత్‌ అధికారులు ఇస్తారు. వాటి ప్రకారం పంచాయతీలో ఇంటింటికీ వెళ్లి కులాల వివరాలు సేకరించాలని ఆదేశించారు. కులాల వివరాలు సేకరిస్తారు తప్ప ఉప కులం సమాచారం నమోదుచేయరు. కులాల వివరాల మేరకు ఆయా పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. ఈ వివరాలతో కూడిన ఓటర్ల జాబితా వచ్చే నెల తొమ్మిదో తేదీన పంచాయతీల వారీగా ప్రకటిస్తారు. పంచాయతీల పరిధిలోని అన్ని గ్రామాల్లో గల ఓటర్ల వివరాలు కచ్చితంగా సేకరించాలని పంచాయతీల అధికారులకు జిల్లా పంచాయతీ అధికారులు స్పష్టం చేశారు. నగరానికి ఆనుకుని ఉన్న పలు పంచాయతీల్లో ఎక్కువమంది అపార్టుమెంట్లలో నివాసం ఉంటున్నారు. వారి వివరాలు కూడా నమోదుచేయాలని ఆదేశించారు.

Updated Date - Feb 14 , 2026 | 12:39 AM