మగువలు.. మహారాణులు
ABN , Publish Date - Oct 15 , 2026 | 12:47 AM
పురుషులకన్నా మహిళా ఓటర్లు ఎక్కువగా వుండడమో, లేకపోతే మరేదైనా కారణమో తెలియదుగానీ ఈసారి కూడా మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) అనకాపల్లి జోన్ పరిధిలోని అన్ని వార్డులు మహిళలకు రిజర్వు అయ్యాయి. దీంతో ప్రధాన పార్టీల్లోని మహిళా నేతల్లో సంతోషం వ్యక్తం అవుతుండగా, కార్పొరేటర్‌గా పోటీ చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న పురుష నేతలు డీలాపడ్డారు.
జీవీఎంసీ అనకాపల్లి జోన్లో అన్ని వార్డులూ మహిళలకే రిజర్వు
బీసీ మహిళలకు 107, 108, 109, 111 వార్డులు
జనరల్ మహిళలకు 110, 112 వార్డులు...
గత ఎన్నికల్లోనూ అన్ని వార్డులు మహిళలకే కేటాయింపు
ప్రధానపార్టీల పురుష పుంగవులు తీవ్రనిరాశ
అనకాపల్లి టౌన్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): పురుషులకన్నా మహిళా ఓటర్లు ఎక్కువగా వుండడమో, లేకపోతే మరేదైనా కారణమో తెలియదుగానీ ఈసారి కూడా మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) అనకాపల్లి జోన్ పరిధిలోని అన్ని వార్డులు మహిళలకు రిజర్వు అయ్యాయి. దీంతో ప్రధాన పార్టీల్లోని మహిళా నేతల్లో సంతోషం వ్యక్తం అవుతుండగా, కార్పొరేటర్‌గా పోటీ చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న పురుష నేతలు డీలాపడ్డారు. అనకాపల్లి జోన్ పరిధిలో గత ఎన్నికల్లో ఐదు వార్డులు వుండగా, పునర్విభజనలో భాగంగా ఈసారి మరో స్థానం పెరిగి ఆరుకు చేరింది. గత ఎన్నికల్లో జీవీఎంసీలో మొత్తం 98 వార్డులు వుండగా, వాటిలో ఐదు (80, 81, 82, 83, 84) వార్డులు అనకాపల్లి జోన్లో వున్నాయి. పునర్విభజనలో భాగంగా జీవీఎంసీలో వార్డులు 120కి పెరిగాయి. ఈసారి అనకాపల్లి జోన్లో 107 నుంచి 112 వార్డుల వరకు వున్నాయి. జీవీఎంసీ ఉన్నతాధికారులు మంగళవారం రాత్రి విడుదల చేసిన వార్డుల రిజర్వేషన్ల వివరాల ప్రకారం 107, 108, 109, 111 వార్డులను బీసీ మహిళలకు రిజర్వు చేశారు. 110, 112 వార్డులను జనరల్ మహిళలకు కేటాయించారు. ఈ రెండు వార్డుల్లో ఏ వర్గానికి చెందిన మహిళలు అయినా పోటీ చేసే వెసులుబాటు వుంది. కాగా గత ఎన్నికల్లో రెండు స్థానాలు బీసీ మహిళలకు, మూడు స్థానాలు జనరల్ మహిళలకు కేటాయించారు. ఇదిలావుండగా మొత్తం ఆరు వార్డులు మహిళలకే కేటాయించడంతో ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు (పురుషులు) తీవ్ర నిరుత్సాహం చెందారు. ఈసారి కూడా కార్పొరేటర్ అయ్యే అవకాశం రాలేదని వాపోతున్నారు. అనకాపల్లి జోన్లో మొత్తం ఓటర్లు 76,950 మంది ఉండగా.. వీరిలో పురుషులు 37,056 మంది, మహిళలు 39,892 మంది ఉన్నారు.
వార్డుల సమాచారం..
---
107వ వార్డు: బీసీ మహిళ
ఓటర్లు: 12,032
పురుషులు: 5,712
మహిళలు : 6,320
పోలింగ్ కేంద్రాలు: 14
పరిధి: కొప్పాక, కొత్తూరు, నరసింగరావుపేట, సిరసపల్లి, రాజుపాలెం, వల్లూరు, అనకాపల్లి టౌన్‌లోని బోయిగూడెం, కర్రివారివీధి, దాసరిగెడ్డ, రఘురాంకాలనీ ప్రాంతాలు.
108వ వార్డు: బీసీ మహిళ
ఓటర్లు: 13,406
పురుషులు: 6,514
మహిళలు: 6,891
ఇతరులు: 01
పోలింగ్ కేంద్రాలు: 15
పరిధి: గవరపాలెం పరమేశ్వరిపార్కు, నిదానందొడ్డి, మహిళా కళాశాల, చింతావారివీధి, కస్పావీధి, బాలాజీరావుపేట, దేమునిగుమ్మం ప్రాంతాలు.
109వ వార్డు: బీసీ మహిళ
ఓటర్లు: 12,477
పురుషులు: 6,092
మహిళలు: 6,384
ఇతరులు: 01
పోలింగ్ కేంద్రాలు: 14
పరిధి: దాడి వీరునాయుడు వీధి, సుబ్రహ్మణ్యం వీధి, సంతబయలు, నూకాలమ్మ ఆలయం రోడ్డు, చాకలిపేట, రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియం ప్రాంతాలు.
110వ వార్డు: జనరల్ మహిళ
ఓటర్లు: 13,530
పురుషులు: 6,576
మహిళలు: 6,954
పోలింగ్ కేంద్రాలు: 16
పరిధి: శారదా కాలనీ, పరుశురాం కాలనీ, నరసింగరావుపేట, వేల్పులవీధి, న్యూకాలనీ, ఉడ్‌పేట, పూడిమడక రోడ్డులోని పశ్చిమ వైపు ఉన్న ప్రాంతాలు.
111వ వార్డు: బీసీ మహిళ
ఓటర్లు: 11,903
పురుషులు: 5.699
మహిళలు: 6.204
పొలింగ్ కేంద్రాలు: 14
పరిధి: గాంధీనగరం, విజయరామరాజుపేట, అంజయ్య కాలనీ, మిరియాల కాలనీ, లక్ష్మీదేవిపేట, పాత్రుడు కాలనీ, ఏఎంసీ కాలనీ ప్రాంతాలు.
112వ వార్డు: జనరల్ మహిళ
ఓటర్లు: 13,602
పురుషులు: 6,475
మహిళలు: 7,127
పోలింగ్ కేంద్రాలు: 15
పరిధి: కోట్నివీధి, గొల్లవీధి, పెరుగుబజార్, నెయ్యిలవీధి, పప్పులవీధి, లక్ష్మీనారాయణనగర్, మళ్లవీధి, గాంధీబొమ్మ జంక్షన్, రైల్వేస్టేషన్, భీమునిగుమ్మం ప్రాంతాలు.