Share News

రైతుబజార్లలో మాయాజాలం

ABN , Publish Date - May 28 , 2026 | 01:21 AM

రైతుబజార్లలో గత కొద్దికాలంగా జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఓ అధికారి వేధింపులు తట్టుకోలేక బాధితులు నోరు విప్పుతున్నారు. అన్నీ ఆయనే చేసి ఏదైనా తప్పు జరిగితే దిగువ స్థాయి మీదకు తోసేయడాన్ని వారు భరించలేకపోతున్నారు.

రైతుబజార్లలో  మాయాజాలం

నిమ్మకాయల వ్యాపారికి అటెండర్‌ ఉద్యోగం

ఎమ్మెల్యేల పేరు చెప్పి అధికారుల అక్రమాలు

ఒక రైతుబజార్‌లో వాచ్‌మన్‌కు

మరో బజార్‌లో అటెండర్‌ ఉద్యోగం

బజార్‌ల నిర్వహణపై పెరుగుతున్న ఆరోపణలు

(విశాఖపట్నం/గోపాలపట్నం/

తగరపువలస/సీతమ్మధార-ఆంధ్రజ్యోతి)

రైతుబజార్లలో గత కొద్దికాలంగా జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఓ అధికారి వేధింపులు తట్టుకోలేక బాధితులు నోరు విప్పుతున్నారు. అన్నీ ఆయనే చేసి ఏదైనా తప్పు జరిగితే దిగువ స్థాయి మీదకు తోసేయడాన్ని వారు భరించలేకపోతున్నారు.

రైతుబజార్లలో ఎస్టేట్‌ అధికారితో పాటు అటెండర్‌, వాచ్‌మన్‌ కూడా ఉంటారు. వారిని సమయం, సందర్భం లేకుండా ఇటీవల బదిలీలు చేస్తున్నారు. ఇందులో కూడా సదరు అధికారి స్వలాభం చూసుకుంటున్నారు. ఏ బజార్‌లోనైనా ఏదైనా పోస్టు ఖాళీ అయితే బదిలీ చేయొచ్చు. సర్దుబాటు చేయొచ్చు. కానీ కొత్తగా బజార్‌ ఏర్పాటైతే అక్కడి పోస్టులకు తప్పనిసరిగా ఇంటర్వ్యూలు నిర్వహించాలి. దీనికి జాయింట్‌ కలెక్టర్‌ ద్వారా నోటిఫికేషన్‌ ఇచ్చి, దరఖాస్తులు ఆహ్వానించాలి. ఆరు నెలల క్రితం ఆరిలోవలో ప్రారంభించిన రైతుబజార్‌కు అటెండర్‌ లేరు. ఆ పోస్టు కోసం ఇటీవల ఇంటర్వ్యూలు నిర్వహించారు. సీతమ్మధారలో నిమ్మకాయలు అమ్ముకునే వ్యాపారికి ఆ పోస్టు కట్టబెట్టడానికి బేరాలు కుదుర్చుకున్నారు. పద్ధతి ప్రకారం నోటిఫికేషన్‌ ఇచ్చారు. జాయింట్‌ కలెక్టర్‌ కార్యాలయంలోనే ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు. అయితే ఆ పోస్టు రావాలంటే అర్హతలతో పాటు ఎమ్మెల్యేల సిఫారసు కూడా ఉండాలని సదరు అధికారి నిమ్మకాయల వ్యాపారికి చెప్పడంతో జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేల లేఖలు సంపాదించి సమర్పించినట్టు తెలిసింది. ఒకే అభ్యర్థికి ఇద్దరు ఎమ్మెల్యేలు సిఫారసు చేయడంతో పోస్టు దాదాపుగా ఖరారైపోయింది. దీనికి రూ.5 లక్షలు తీసుకున్నట్టు సమాచారం. వారం రోజుల్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులు రానున్నాయి. ఈ అంశంపై జేసీ మరోసారి దృష్టి పెట్టాలని రైతుబజార్లలో వ్యాపారులు సూచిస్తున్నారు.

పెందుర్తిలో వాచ్‌మెన్‌...చిట్టివలసలో అటెండర్‌

రైతుబజార్లలో ఉద్యోగుల డిజిగ్నేషన్లు నచ్చినట్టు మార్చేస్తున్నారు. భీమిలి నియోజకవర్గ పరిధిలోని చిట్టివలస/తగరపువలసలో కూటమి ప్రభుత్వం రాగానే రైతుబజార్‌ ప్రారంభించారు. ఏడాది పాటు ఎస్టేట్‌ అధికారితోనే నడిపించారు. ఇటీవల అక్కడ అటెండర్‌ను వేశారు. కొత్త బజారు కాబట్టి ఆ పోస్టుకు ఇంటర్వ్యూలు నిర్వహించాలి. నోటిఫికేషన్‌ ఇవ్వాలి. కానీ ఈ రెండూ చేయలేదు. పెందుర్తి బజారులో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న వ్యక్తిని చిట్టివలస బజారుకు బదిలీ చేసి అటెండర్‌ డిజిగ్నేషన్‌ ఇచ్చారు. దీనికి కూడా భారీగానే ఓ అధికారికి నగదు ముట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం అమరావతి అధికారుల దృష్టికి వెళ్లగా, పెందుర్తిలో పగటిపూట వాచ్‌మెన్‌గా ఉండేవాడని, చిట్టివలసలో నైట్‌ వాచ్‌మన్‌గా పెట్టామని చెప్పినట్టు తెలిసింది.

కార్డులు, స్టాంపులన్నీ ఆ బ్యాగులోనే

రైతుబజార్లలో కొత్త వారికి కార్డులు ఇవ్వడం, వాటిపై స్టాంపులు వేయడం వంటివి గోపాలపట్నంలోని వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ కార్యాలయం అవన్నీ చూసుకుంటుంది. అక్కడ అసిస్టెంట్‌ డైరెక్టర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ తదితరులు ఉన్నారు. ఆ ప్రాసెస్‌ అంతా వారే చేయాలి. గతంలో అలాగే జరిగేది. కానీ ఏడాది కాలంగా రైతుబజార్లను పర్యవేక్షిస్తున్న ఓ అధికారే కొత్తకార్డులు, వాటిపై వేయాల్సిన స్టాంపు తన బ్యాగులో పెట్టుకొని తిరుగుతున్నారు. ఎవరికి ఎక్కడ అవసరమైతే వాటిని ఆయనే ప్రాసెస్‌ చేసి ఇచ్చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యాలయం సిబ్బందిని నామమాత్రం చేశారని అంటున్నారు. ఈ వ్యవహారాలన్నింటిపైనా జాయింట్‌ కలెక్టర్‌ దృష్టిసారించి రైతుబజార్లను ప్రక్షాళన చేయాల్సి ఉంది.

Updated Date - May 28 , 2026 | 01:21 AM