Share News

మాఘ పౌర్ణమి జాతర

ABN , Publish Date - Jan 31 , 2026 | 01:19 AM

మాఘ పౌర్ణమి సందర్భంగా జిల్లాలోని రేవుపోలవరం, పూడిమడక, ముత్యాలమ్మపాలెం, వాడపాలెం, తదితర సముద్ర తీర ప్రాంతాల్లో జాతర, తీర్థ మహోత్సవాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం రాత్రి ఆయా ప్రదేశాల్లో జాగారం చేసే భక్తులు, ఆదివారం తెల్లవారుజాము నుంచి సముద్రంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అనంతరం సమీపంలో వున్న ఆలయాల్లో స్వామి, అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేస్తారు. ఆయా సముద్ర తీర ప్రాంతాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ అధికారులు అనకాపల్లి, నర్సీపట్నం, గాజువాక, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ముందు జాగ్రత్త చర్యగా సముద్ర తీరంలో గజ ఈతగాళ్లను నియమిస్తున్నారు.

మాఘ పౌర్ణమి జాతర
రేవుపోలవరంలో కొండపై ఉన్న లక్ష్మీ మాధవస్వామి ఆలయం

సముద్ర తీరప్రాంతాల్లో నేటి సాయంత్రం నుంచే తీర్థమహోత్సవాలు

రాత్రంతా జాగారం.. రేపు ఉదయం పుణ్యస్నానాలు

రేవుపోలవరం, పూడిమడక, ముత్యాలమ్మపాలెంలో భారీ ఏర్పాట్లు

వందలాది మంది పోలీసులతో బందోబస్తు

ముందు జాగ్రత్త చర్యగా గజ ఈతగాళ్ల ఏర్పాటు

ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ యాజమాన్యం

ఎస్‌.రాయవరం/ అచ్యుతాపురం/ పరవాడ, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): మాఘ పౌర్ణమి సందర్భంగా జిల్లాలోని రేవుపోలవరం, పూడిమడక, ముత్యాలమ్మపాలెం, వాడపాలెం, తదితర సముద్ర తీర ప్రాంతాల్లో జాతర, తీర్థ మహోత్సవాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం రాత్రి ఆయా ప్రదేశాల్లో జాగారం చేసే భక్తులు, ఆదివారం తెల్లవారుజాము నుంచి సముద్రంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అనంతరం సమీపంలో వున్న ఆలయాల్లో స్వామి, అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేస్తారు. ఆయా సముద్ర తీర ప్రాంతాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ అధికారులు అనకాపల్లి, నర్సీపట్నం, గాజువాక, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ముందు జాగ్రత్త చర్యగా సముద్ర తీరంలో గజ ఈతగాళ్లను నియమిస్తున్నారు.

ఎస్‌.రాయవరం: జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఎస్‌.రాయవరం మండలం రేవుపోలవరం సముద్రతీరానికి మాఘ పౌర్ణమినాడు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. పుణ్యస్నానం ఆచరించిన తరువాత కొండపై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీమాధవ స్వామి వారిని దర్శించుకుంటుంటారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ ఏడాది సుమారు లక్ష మంది భక్తులు వస్తారన్న అంచనాతో ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాగునీరు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు గుడారాలను ఏర్పాటు చేశారు. నర్సీపట్నం డీఎస్సీ పి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నలుగురు సీఐలు, 12 మంది ఎస్‌ఐలు, సుమారు 220 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. 30 మంది గజ ఈతగాళ్లను సిద్ధం చేస్తున్నారు. నర్సీపట్నం డిపో అధికారులు 35 ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.

అచ్యుతాపురం: మాఘపౌర్ణమి సందర్భంగా శనివారం సాయంత్రం పూడిమడకలో జరిగే జాతరకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు లక్ష పైచిలుకు భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల వినోదం కోసం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాట చేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి భక్తులు సముద్ర స్నానాలు చేసి తీరంలోని లక్ష్మి, వేణుగోపాల స్వామి, సుభద్ర, బలరామ సహిత జగన్నాథస్వామిని దర్శించుకుంటారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముగ్గురు సీఐలు, పది మంది ఎస్‌ఐలు, 150 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. డ్రోన్‌ కెమెరాలతో పరిస్థితిని పర్యవేక్షిస్తారు. తీరంలో 30 మంది గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు.

పరవాడ: మండలంలోని ముత్యాలమ్మపాలెంలో శనివారం సాయంత్రం నిర్వహించనున్న మాధవస్వామి తీర్థ మహోత్సవానికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం వుండడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించనున్నారు. రాత్రికి పలు రకాల సాంస్కృతి, జానపద కళారూపాల ప్రదర్శలను ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు రాత్రంతా జాగారం చేసి, ఆదివారం తెల్లవారుజాము నుంచి సముద్రంలో పుణ్యస్నానాలు ఆచరించి, అనంతరం మాధవస్వామిని దర్శించుకొంటారు.

Updated Date - Jan 31 , 2026 | 01:19 AM