Share News

మాడుగుల మోదకొండమ్మ జాతర రేపు

ABN , Publish Date - Jun 01 , 2026 | 12:36 AM

స్థానిక మోదకొండమ్మ అమ్మవారి జాతరకు భారీఎత్తున ఏర్పాట్లు చేపట్టారు. జూన్‌ రెండో తేదీ మంగళవారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సాధారణ భక్తులకు దర్శనాలు ప్రారంభిస్తారు. భక్తులు ఇళ్ల వద్ద పూజించిన ఘటాలతో ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లిస్తారు.

మాడుగుల మోదకొండమ్మ జాతర రేపు
అమ్మవారి అవతారంలో ఏర్పాటు చేసిన భారీ విద్యుత్‌ సెట్టింగు

ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు

మాడుగుల, మే 31 (ఆంధ్రజ్యోతి): స్థానిక మోదకొండమ్మ అమ్మవారి జాతరకు భారీఎత్తున ఏర్పాట్లు చేపట్టారు. జూన్‌ రెండో తేదీ మంగళవారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సాధారణ భక్తులకు దర్శనాలు ప్రారంభిస్తారు. భక్తులు ఇళ్ల వద్ద పూజించిన ఘటాలతో ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లిస్తారు. ఉత్సవానికి సంబంధించి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయాన్ని, పరిసరాలను ఆదివారం రాత్రికే విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. గ్రామంలోని ప్రధాన రహదారుల్లో విద్యుద్దీపాల సెట్టింగులు ఏర్పాటు చేశారు. వేసవి కావడంతో మండుటెండలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఇబ్బంది కలగకుండా పందిళ్లు వేశారు. తోపులాటలు జరగకుండా క్యూలైన్లు ఏర్పాటుచేశారు. మజ్జిగ, మంచినీరు, ప్రసాదాలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్‌ పుప్పాల అప్పలరాజు మాట్లాడుతూ, మోదకొండమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు చిన్నపాటి అసౌకర్యం కూడా కలగకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేశామన్నారు. మంగళవారం రాత్రి మాడుగులలో పలు వేదికలపై వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు వుంటాయని చెప్పారు. అమ్మవారి జాతర సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు ఎస్పీ పి.శ్రావణి ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, పది మంది ఎస్‌ఐలు, 250 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశామని ఎస్‌ఐ జి.నారాయణరావు తెలిపారు. ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా ఘాట్‌రోడ్డు వైపునుంచి వచ్చే వాహనాలను వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి, ఎం.కోడూరు వైపు నుంచి వచ్చే వాహనాలను ఆలయం వెనుక వైపు నుంచి మళ్లిస్తామన్నారు.

Updated Date - Jun 01 , 2026 | 12:36 AM