మాచ్‌ఖండ్‌ను ఆధునికీకరించాల్సిందే..
ABN , Publish Date - Jun 14 , 2026 | 10:51 PM
ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రాన్ని ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని ఒడిశా విద్యుత్ సంస్థ నిర్వహణ విభాగం డైరెక్టర్ మహంతి అభిప్రాయపడ్డారు.
ఒడిశా విద్యుత్ సంస్థ నిర్వహణ విభాగం డైరెక్టర్ మహంతి
ముంచంగిపుట్టు, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రాన్ని ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని ఒడిశా విద్యుత్ సంస్థ నిర్వహణ విభాగం డైరెక్టర్ మహంతి అభిప్రాయపడ్డారు. ఇటీవల అగ్నిప్రమాదానికి గురైన మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రాన్ని ఆదివారం ఆయన సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ కేంద్రంలో దెబ్బతిన్న భాగాలను మరమ్మతులు చేయడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేయడం అవసరమని తెలిపారు. ఇందుకు అవసరమైతే ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల ఉన్నతాధికారులతో చర్చించి అనుమతులు పొందేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే ప్రమాదం సంభవించి మూడు వారాలు గడిచిన తర్వాతే ఒడిశా అధికారులు ప్రాజెక్టును సందర్శించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఆయన వెంట సీలేరు సముదాయ ప్రధాన ఇంజనీర్ కేవీ రాజారావు, కొలాబ్ జల విద్యుత్ కేంద్ర ప్రధాన అధికారి చిత్తరంజన్ స్వైన్, ఉప ప్రధాన నిర్వాహక అధికారి జి.శ్రీనివాసరావు, తదితరులు ఉన్నారు.