వృథాగా పోతున్న మాచ్‌ఖండ్ నీరు
ABN , Publish Date - Oct 23 , 2026 | 11:57 PM
మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీటిని పంపించే టన్నెల్ పాయింట్ (టీపీ) డ్యాం వద్ద నీరు వృథాగా పోతోంది.
టీపీ డ్యాం వద్ద పనిచేయని గేట్లు
పట్టించుకోని అధికారులు
ముంచంగిపుట్టు, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి):
మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీటిని పంపించే టన్నెల్ పాయింట్ (టీపీ) డ్యాం వద్ద నీరు వృఽథాగా పోతోంది. జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పాదనకు ఎంతో అవసరమైన నీరు వృఽథాగా పోతున్నా ప్రాజెక్టు అధికారులు కనీసం దృష్టి సారించకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. విద్యుత్ ఉత్పాదనకు అవసరమైన నీటిని డుడుమ జలాశయం నుంచి సొరంగం గుండా టీపీ డ్యాంకు పంపిస్తారు. జలాశయం వద్ద ఉన్న పవర్ గేట్లు సక్రమంగా పని చేయకపోవడంతో అదనంగా నీరు విడుదల అవుతోంది. పవర్ గేట్లు అర అడుగు ఎత్తాల్సి ఉండగా.. సుమారు అడుగు ఎత్తాల్సి వస్తుంది. ఈ కారణంగానే టీపీ డ్యాం నీరు ఎక్కువగా సరఫరా అవుతోంది. దీంతో అక్కడ నుంచి విద్యుత్ సరఫరాకు అవసరమైన నీటిని పంపించగా.. మిగిలిన నీరు బయటకు పోతున్నది. ఎల్‌నినో సమయంలో నిత్యం నీరు వృథాగా పోతుండడంతో ఆ ప్రభావం విద్యుదుత్పత్తిపై చూపుతుందని పలువురు అంటున్నారు. ప్రాజెక్టు అధికారులు వెంటనే స్పందించి పవర్ గేట్లకు మరమ్మతులు చేపట్టి నీటి వృథాను కట్టడి చేయాల్సి ఉంది. విద్యుత్ ఉత్పాదనకు అవసరమైర నీటిని మాత్రమే సరఫరా చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు సూచిస్తున్నారు.