కదిలిన యంత్రాంగం
ABN , Publish Date - Jun 30 , 2026 | 12:38 AM
వాతావరణం మార్పుల ప్రభావంతో ఏజెన్సీలో జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. సోమవారం జిల్లాలోని 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి బాధితులకు వైద్యులు అవసరమైన సేవలు అందించారు.
జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక వైద్య శిబిరాలు
వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో చర్యలు
జ్వర పీడితులకు విస్తృత సేవలు
వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచన
పాడేరు, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): వాతావరణం మార్పుల ప్రభావంతో ఏజెన్సీలో జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. సోమవారం జిల్లాలోని 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి బాధితులకు వైద్యులు అవసరమైన సేవలు అందించారు.
మన్యంలో జ్వరాలు, మలేరియా కేసుల పెరుగుదలపై ‘జ్వరాల విజృంభణ’ శీర్షికన ’ఆంధ్రజ్యోతి’లో ఆదివారం ప్రచురితమైన కథనానికి వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు స్పందించారు. జిల్లాలోని 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి, బాధితులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు. దీంతో సోమవారం జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో జ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలున్న ప్రాంతాల్లోనూ వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆరోగ్య ఉపకేంద్రం పరిధిలో రోగులను పక్కాగా గుర్తించి సకాలంలో వైద్య సేవలు అందించాలని ఉన్నతాధికారులు సూచించారు.
వైద్య సేవలు ముమ్మరం
వాతావరణంలోని మార్పులతో పాటు రానున్న అపిడిమిక్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో వైద్య సేవలను మరింత ముమ్మరం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు, వైద్యులను కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అవసరమైన ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు, హైరిస్క్ గ్రామాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. జ్వరాలతో బాధపడుతున్న వారికి వైద్యం అందని పరిస్థితులు ఏర్పడకూడదని, క్షేత్ర స్థాయిలో పారామెడికల్ సిబ్బంది, ఆశా కార్యకర్తలు నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. రోగాలతో గిరిజనులు ప్రాణాలు కోల్పోకూడదని, వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం చేయవద్దని కలెక్టర్ సూచించారు.