Share News

యంత్రాంగం సన్నద్ధం

ABN , Publish Date - Nov 01 , 2026 | 01:07 AM

ఎలమంచిలి మునిసిపాలిటీకి ఆదివారం జరగనున్న ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 32 వార్డులకు గాను 63 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. పురుషులు 17,450, మహిళలు 19,068, ఇతరులు 8 మందితో కలిపి మొత్తం 36,526 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

యంత్రాంగం సన్నద్ధం
ఎలమంచిలి డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం వద్ద పోలింగ్‌ స్లిప్‌లను పరిశీలిస్తున్న సిబ్బంది

- 32 వార్డులు.. 63 పోలింగ్‌ కేంద్రాలు

- 36,526 మంది ఓటర్లు

ఎలమంచిలి, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): ఎలమంచిలి మునిసిపాలిటీకి ఆదివారం జరగనున్న ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 32 వార్డులకు గాను 63 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. పురుషులు 17,450, మహిళలు 19,068, ఇతరులు 8 మందితో కలిపి మొత్తం 36,526 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ బరిలో ముగ్గురు అభ్యర్ధులు పోటీ పడుతుండగా, 32 వార్డుల్లో కౌన్సిలర్ల స్థానాలకు 77 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ)తో పాటు వైసీపీ, కాంగ్రెస్‌, స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పట్టణంలోని గురవప్ప కల్యాణ మండపంలో ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం నుంచి నిర్దేశించిన సమయానికి 450 మంది పీవోలు, ఏపీవోలు చేరుకుని బ్యాలెట్‌ బాక్సులు, ఓటరు స్లిప్పులతో పాటు ఇతర సామగ్రిని తీసుకున్నారు. మధ్యాహ్నం భోజనాల అనంతరం పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్లారు. మూడు జోన్లలో ఆరు రూట్‌ల ద్వారా 12 మినీ బస్సులు, 5 వ్యాన్లలో ఎన్నికల సామగ్రితో పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. కాగా మునిసిపాలిటీలో ముందుగా గుర్తించిన 23 సమస్యాత్మక, 14 అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల కోసం 250 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేశారు.

ఎన్నికల సిబ్బందికి కలెక్టర్‌ దిశానిర్దేశం

ఎలమంచిలి: ఎన్నికల నియమావళిని అధికారులు కచ్చితంగా పాటించాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశించారు. శనివారం పట్టణంలోని గురవప్ప కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని ఆమె సందర్శించారు. జేసీ శౌర్యమాన్‌ పటేల్‌తో కలిసి బ్యాలెట్‌ బాక్సులు, ఓటరు స్లిప్పులు, తదితర సామగ్రిని పరిశీలించారు. అనంతరం ప్రిసైడింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు, మైక్రో అబ్జర్వర్లకు ఎన్నికల నిర్వహణపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా, సమన్వయంతో నిర్వహించాలని ఆదేశించారు. ఆమె వెంట జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు రవీంద్రదామ, మునిసిపల్‌ కమిషనర్‌ ప్రసాదరాజు, తహశీల్దార్‌ వరహాలు, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Nov 01 , 2026 | 01:07 AM