భోగాపురం ప్రయాణికుల కోసం నగరంలో నాలుగు చోట్ల లాంజ్‌లు
ABN , Publish Date - Jul 05 , 2026 | 12:49 AM
విశాఖపట్నం నుంచి భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ అధికారులు నగరంలో నాలుగు ప్రాంతాల్లో ‘పాసింజర్ లాంజ్‌లు’ ఏర్పాటు చేస్తున్నారు.
విశాఖపట్నం, జూలై 4 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం నుంచి భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ అధికారులు నగరంలో నాలుగు ప్రాంతాల్లో ‘పాసింజర్ లాంజ్‌లు’ ఏర్పాటు చేస్తున్నారు. గురుద్వారా, వుడా పార్క్, ఆటోనగర్, వెంకోజీపాలెం...అందుకు అనువైన ప్రాంతాలుగా గుర్తించారు. అక్కడ అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, తప్పనిసరి అయితే అక్కడి బస్‌షెల్టర్లు, ఆక్రమణలు కూడా తొలగించి తగిన స్థలం ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌కు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ బాలసుబ్రహ్మణ్యం తాజాగా లేఖ రాశారు. పాసింజర్ లాంజ్‌లను జీఎంఆర్ యాజమాన్యం ఏర్పాటు చేస్తుందని, వాటిలో వసతులు జిల్లా యంత్రాంగం కల్పించాలని కోరారు. వీటితో పాటు శ్రీకాకుళం జిల్లాలో కూడా ఒక పాసింజర్ లాంజ్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. త్వరలో విశాఖపట్నం వచ్చే 20 ఎలక్ట్రిక్ బస్సులను ఆయా మార్గాల్లో నడపనున్నారు.
నేడు ఉపాధ్యాయుల సర్దుబాటు
విశాఖపట్నం, జూలై 4 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ ఆదివారం చేపట్టనున్నారు. ఇందుకు జూన్ 30వ తేదీ వరకు ఉన్న విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి మేరకు మిగులు ఉన్న పాఠశాలల నుంచి తక్కువగా ఉన్న పాఠశాలలకు టీచర్లను తాత్కాలికంగా పంపుతారు. సర్దుబాటు ప్రక్రియ మండల పరిధిలోని పాఠశాలల మధ్యే చేపడతారు. జిల్లాలో మిగులుగా ఉన్న 290 మంది ఉపాధ్యాయులను ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు సర్దుబాటు చేయనున్నారు. దీనికి సంబంధించి విద్యాశాఖ కసరత్తు పూర్తిచేసింది.
సర్ వేగవంతం
ఒక్కరోజే 1.25 లక్షల ఫారాల డిజిటలైజ్
నేడు కూడా సచివాలయాల్లో శిబిరాలు
విశాఖపట్నం, జూలై 4 (ఆంధ్రజ్యోతి):
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో జిల్లా యంత్రాంగం వేగం పెంచింది. శనివారం ఒక్కరోజే 1.25 లక్షల ఎన్యుమరేషన్ ఫారాలను డిజిటలైజ్ చేసింది. జిల్లాలో 20,23,009 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటి వరకు 19,82,550 మందికి (98 శాతం) ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. వారిలో 8,15,293 మంది (40.3 శాతం) ఫారాలను పూరించి బీఎల్‌వోలు/సచివాలయాల్లో అందజేయడంతో డిజిటలైజేషన్ చేశారు. ఇప్పటివరకూ పశ్చిమ నియోజకవర్గంలో 47.57 శాతం ఫారాలను డిజిటలైజ్ చేయగా, అతి తక్కువగా ‘సౌత్’లో 34.26 శాతం మాత్రమే అయింది. శనివారం అన్ని సచివాలయాల్లో ఓటర్ల నుంచి ఎన్యుమరేషన్ ఫారాలు స్వీకరించారు. ఆదివారం కూడా ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు. కాగా డిజిటలైజేషన్ ప్రక్రియ మరింత వేగంగా సాగేందుకు వీలుగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇద్దరు సీనియర్ అధికారులను కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ నియమించారు. అపార్టుమెంట్లు, పోష్ లొకాలిటీలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
ముసురు
విశాఖపట్నం, జూలై 4 (ఆంధ్రజ్యోతి):
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ప్రభావంతో నగరంలో ముసురు వాతావరణం నెలకొంది. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు దఫదఫాలుగా జల్లులు కురిశాయి. దీంతో వాతావరణం చల్లబడింది. ఆదివారం నగరంలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
సీఐల బదిలీ
విశాఖపట్నం, జూన్ 4 (ఆంఽధ్రజ్యోతి):
నగర పోలీస్ కమిషనరేట్‌లో పలువురు సీఐలను బదిలీ చేస్తూ సీపీ శంఖబ్రతబాగ్చి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ద్వారకా నగర్ సీఐగా పనిచేస్తున్న డీవీ రమణను స్పెషల్ బ్రాంచి-3కి బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న జి.ఉమామహేశ్వరరావును ద్వారకా సీఐగా నియమించారు. బొబ్బిలి సీఐగా పనిచేస్తూ సీటీకి బదిలీపై వచ్చిన ఎస్.శ్రీనివాస్‌కు ఆరిలోవ సీఐగా పోస్టింగ్ ఇచ్చారు. ఎస్.కోట సీఐగా పనిచేస్తూ బదిలీపై సిటీకి వచ్చిన ఎల్.అప్పలనాయుడును త్రీటౌన్ సీఐగా నియమించారు.
ద్వారకా ఏసీపీ అన్నెపు నర్సింహమూర్తికి అదనపు ఎస్పీగా పదోన్నతి
విశాఖపట్నం, జూన్ 4 (ఆంధ్రజ్యోతి):
నగర పోలీస్ కమిషనరేట్‌లో ద్వారకా సబ్‌డివిజన్ ఏసీపీగా పనిచేస్తున్న అన్నెపు నర్సింహమూర్తికి అదనపు ఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. అదనపు ఎస్పీగా పదోన్నతి పొందిన ఆయన్ను మంగళగిరిలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఆరిలోవ సీఐగా పనిచేస్తూ ఇటీవలే డీఎస్పీగా పదోన్నతి పొందిన మల్లేశ్వరరావును ద్వారకా ఏసీపీగా నియమించే అవకాశం ఉందని పోలీస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.