Share News

మద్యం దుకాణాలకు నేడు లాటరీ

ABN , Publish Date - Oct 08 , 2026 | 12:55 AM

జిల్లాలో మిగిలిపోయిన మద్యం దుకాణాల కేటాయింపు కోసం గురువారం లాటరీ నిర్వహిస్తున్నట్టు ఎక్సైజ్‌ శాఖ అధికారి ఆర్‌.ప్రసాద్‌ తెలిపారు.

మద్యం దుకాణాలకు నేడు లాటరీ

52 దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం

47 దుకాణాలకు నాలుగు, అంతకంటే ఎక్కువ దరఖాస్తులు

విశాఖపట్నం, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో మిగిలిపోయిన మద్యం దుకాణాల కేటాయింపు కోసం గురువారం లాటరీ నిర్వహిస్తున్నట్టు ఎక్సైజ్‌ శాఖ అధికారి ఆర్‌.ప్రసాద్‌ తెలిపారు. జిల్లాలో 158 మద్యం దుకాణాలు ఉండగా, వాటిలో 107 దుకాణాలను వ్యాపారులు సెప్టెంబరులో రెన్యువల్‌ చేసుకున్నారన్నారు. 51 దుకాణాల యజమానులు లైసెన్స్‌లు రెన్యువల్‌ చేసుకోలేదని, అలాగే గతంలో ఒక దుకాణానికి వేలం నిర్వహించలేదన్నారు. మొత్తం 52 దుకాణాల నిర్వహణకు ఇప్పుడు దరఖాస్తులను ఆహ్వానించామన్నారు. దరఖాస్తులు అందజేసేందుకు ఈనెల ఆరో తేదీ (బుధవారం) వరకు అవకాశం కల్పించామన్నారు. ఒక్కో దుకాణానికి కనీసం నాలుగు దరఖాస్తులు వస్తేనే లాటరీ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిందని, ఇప్పటివరకూ 47 దుకాణాలకు నాలుగు కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయన్నారు. పద్మనాభం మండలంలోని ఒక దుకాణానికి కేవలం ఒక దరఖాస్తు మాత్రమే రాగా, ఆనందపురం మండలంలోని ఒక దుకాణం, భీమిలి రూరల్‌లోని మూడు దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదని, వాటికి లాటరీ నిర్వహించడం లేదని జిల్లా ఎక్సైజ్‌ శాఖ అధికారి తెలిపారు. నాలుగు కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చిన 47 దుకాణాలకు వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్‌ థియేటర్‌లో జిల్లా కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ సమక్షంలో లాటరీ తీయడం జరుగుతుందన్నారు.


డ్రగ్స్‌ ముఠాపై డెకాయ్‌ ఆపరేషన్‌

ఎండీఎం పౌడర్‌, లిక్విడ్‌ గంజాయితో ముగురిని అరెస్టు చేసిన పోలీసులు

విశాఖపట్నం, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి):

నగరంలో యువతకు డ్రగ్స్‌, లిక్విడ్‌ గంజాయి (యాష్‌ఆయిల్‌) విక్రయిస్తున్న ముఠాను త్రీటౌన్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులుఅదుపులోకి తీసుకున్నారు. నగరానికి కొందిన కొందరు యువకులు ముఠాగా ఏర్పడి గంజాయి, డ్రగ్స్‌ విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు ఒక యువకుడితో గంజాయి, ఎండీఎం పౌడర్‌ కావాలని ఆముఠాను సంప్రదించేలా డెకాయ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ముఠాసభ్యులు ఆ యువకుడికి ఎండీఎం పౌడర్‌, లిక్విడ్‌ గంజాయి అందజేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు... గాజువాక పరిసర ప్రాంతాలకు చెందిన విద్యాసాగర్‌, పీవీ శివప్రసాద్‌, ఎ.మధు డ్రగ్స్‌, గంజాయి విక్రయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఒక యువకుడిని పిలిచి అతడితో ఎండీఎం పౌడర్‌, లిక్విడ్‌ గంజాయి కావాలని వారిని సంప్రదించారు. నిజమేనని భావించిన నిందితులు ఒక కారులో బుధవారం సాయంత్రం ఈస్ట్‌పాయింట్‌కాలనీకి వచ్చి, 50 గ్రాముల ఎండీఎం పౌడర్‌, లీటర్‌ లిక్విడ్‌ గంజాయి అందజేస్తుండగా త్రీటౌన్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడిచేసి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితులను త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదుచేశారు. దీనికి సంబంధించిన వివరాలను గురువారం వెల్లడిస్తామని త్రీటౌన్‌ పోలీసులు తెలిపారు.


వీఈఆర్‌కు నిపుణుల కమిటీ నియామకం

విశాఖపట్నం, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): నీతి ఆయోగ్‌ ద్వారా అభివృద్ధి చేయనున్న విశాఖపట్నం ఎకనామిక్‌ రీజియన్‌ (వీఈఆర్‌) కోసం మహారాష్ట్ర, ఏపీలోని పురపాలన, పట్టణాభివృద్ధి సంస్థలు కలిసి పనిచేసేలా మహారాష్ట్రకు చెందిన నిపుణులతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చీఫ్‌ ఇన్వెస్టిమెంట్‌ అండ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శంకర్‌ దేశ్‌పాండే, సిటీ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ మహారాష్ట్ర చీఫ్‌ ప్లానర్‌ రవీంద్ర మంకర్‌, మహారాష్ట్ర హౌసింగ్‌ అండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అఽథారిటీ డిప్యూటీ సీఈఓ అనిల్‌ వాంఖడే, స్లమ్‌ రీహేబలిటేషన్‌ అథారిటీ చీఫ్‌ ఇంజినీర్‌ ఆర్‌ మిత్కర్‌, టౌన్‌ ప్లానిగ్‌ అండ్‌ వాల్యూయేషన్‌ విభాగం డైరెక్టర్‌ జితేంద్ర లక్ష్మణ్‌ భోపాలేలను నియమించారు. వీఈఆర్‌లో జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏలు ప్రతిపాదించే ప్రాజెక్ట్‌లకు వీరు అన్ని రకాల సాంకేతిక సహకారం అందిస్తారు. వీఈఆర్‌ పనులకు ఈ కమిటీ సలహాలు అందిస్తుంది.

Updated Date - Oct 08 , 2026 | 12:55 AM