Share News

47 మద్యం దుకాణాలకు లాటరీ

ABN , Publish Date - Oct 09 , 2026 | 12:35 AM

జిల్లాలో రెన్యువల్‌కాకుండా మిగిలిపోయిన 52 మద్యం దుకాణాల్లో 47 దుకాణాలను లాటరీ ద్వారా వ్యాపారులకు కేటాయించారు.

47 మద్యం దుకాణాలకు లాటరీ

కేటాయించిన జేసీ విద్యాధరి

విశాఖపట్నం, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో రెన్యువల్‌కాకుండా మిగిలిపోయిన 52 మద్యం దుకాణాల్లో 47 దుకాణాలను లాటరీ ద్వారా వ్యాపారులకు కేటాయించారు. వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్‌ ఎరినాలో గురువారం దుకాణాలకు జాయింట్‌ కలెక్టర్‌ జి.విద్యాధరి లాటరీ తీశారు. జిల్లాలో ఓపెన్‌ కేటగిరీలో 145, గీతకులాలకు 14 మద్యం దుకాణాలను ప్రభుత్వం కేటాయించింది. 2024 ఆగస్టులో నిర్వహించిన లాటరీలో ఆయా దుకాణాలకు రెండేళ్లపాటు ప్రావిజన్‌ లైసెన్స్‌లు జారీచేశారు. వాటి కాలపరిమితి గతనెల 30తో ముగియడంతో ఏడాదిపాటు రెన్యువల్‌ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అయితే 52 దుకాణాల రెన్యువల్‌కు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో వాటికి ఆసక్తి గల వ్యాపారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. ఒక్కో దుకాణానికి కనీసం నాలుగు దరఖాస్తులు వస్తే వాటికి లాటరీ తీసి కేటాయించాలని సూచించారు. దీంతో జిల్లాలోని 47 దుకాణాలకు మాత్రమే నాలుగు అంతకంటే ఎక్కువ దరఖాస్తులు రావడంతో వాటికి జాయింట్‌కలెక్టర్‌ ఆధ్వర్యంలో గురువారం లాటరీ తీశారు. 47 దుకాణాలకు 202 మంది దరఖాస్తు చేసుకోవడంతో ఒక్కో దరఖాస్తుకు రూ.మూడు లక్షలు చొప్పున మొత్తం రూ.6.06 కోట్లు ఆదాయం వచ్చిందని ఎక్సైజ్‌శాఖ సూపరింటెండెంట్‌ ఆర్‌.ప్రసాద్‌ తెలిపారు. ప్రాసెసింగ్‌ ఫీజు కింద రూ.2.02 లక్షలు, లైసెన్స్‌ఫీజు మొదటివాయిదా కింద రూ.10.42 కోట్లు, పర్మిట్‌రూమ్‌ ఫీజు కింద రూ.1.15 కోట్లు మొత్తంగా రూ.17.65 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి సమకూరిందన్నారు. మిగిలిపోయిన ఐదు దుకాణాలకు శుక్రవారం వరకు దరఖాస్తులు స్వీకరించి, ఈనెల పదిన లాటరీ తీసి కేటాయిస్తామన్నారు.


15 నుంచి ‘ఉక్కు’లో పదోన్నతులు

కేంద్ర ఉక్కు కార్యదర్శి సందీప్‌ ఫౌండ్రిక్‌

విశాఖపట్నం, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు ఉద్యోగులకు ఈ నెల 15వ తేదీ నుంచే పదోన్నతులు కల్పిస్తామని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సందీప్‌ ఫౌండ్రిక్‌ ప్రకటించారు. ఆయన గురువారం ప్లాంటును సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపిక చేసిన అధికారులు, ఉద్యోగులతో ప్లాంటు ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఈ ఏడాది జూన్‌ నుంచి వర్తించేలా ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు నిర్ణయించామన్నారు. ప్లాంటులో లోపాలు, ఉద్యోగులు నివాసం ఉండే క్వార్టర్ల భద్రత విషయంలో రాజీ పడవద్దని సూచించారు. విధి నిర్వహణలో ప్రామాణికాలు పాటించాలన్నారు. కోక్‌ ఓవెన్‌ పనితీరును మెరుగుపరిచి, వచ్చే జనవరి నుంచి సగటున 250 పుష్‌లను తీయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. ఫినిష్డ్‌ స్టీల్‌ సగటున 11 వేల టన్నులు ఉండేలా, నెలకు రూ.3వేల కోట్ల అమ్మకాలు జరిగేలా లక్ష్యం నిర్దేశించుకోవాలని సూచించారు. అన్ని ప్రాంతాల్లోను హౌస్‌ కీపింగ్‌ సిబ్బందిని నియమించాలన్నారు. అయితే కార్యదర్శి అధికారుల సంఘం, కార్మిక సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయకపోవడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తంచేశాయి. పదోన్నతుల ప్రక్రియ సరిగ్గా లేదని, వివాదాలకు తావిచ్చే విధంగా ఉందని, కొందరికి అన్యాయం జరుగుతుందని పలువురు ఆరోపించారు.


గాజువాకలో రూ.8 కోట్లతో కన్వెన్షన్‌ సెంటర్‌

ఉద్యోగ భవన్‌ ఆధునికీకరణకు శంకుస్థాపన

భీమిలి గెస్ట్‌హౌస్‌ లీజు పునరుద్ధరణకు నో

వీఎంఆర్‌డీఏ బోర్డు సమావేశంలో నిర్ణయం

విశాఖపట్నం, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)కు సిరిపురంలో ఉన్న ఉద్యోగ భవన్‌ను ఆధునికీకరించడానికి గురువారం శంకుస్థాపన చేశారు. ఇన్‌చార్జి కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ ఆధ్వరంలో బోర్డు సమావేశం నిర్వహించారు. ఇందులో మొత్తం 23 అంశాలను ప్రతిపాదించారు. గాజువాకలో రూ.8 కోట్లతో కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మిస్తారు. భీమిలిలో వీఎంఆర్‌డీఏకి చెందిన గెస్ట్‌హౌస్‌ను దీర్ఘకాలిక లీజుకు ఇచ్చారు. దానిని పునరుద్ధరించమని కాంట్రాక్టర్‌ కోరగా తిరస్కరించారు. ఆధునికీకరించి, వేలం ద్వారా కేటాయించాలని నిర్ణయించారు. అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది, నిర్వహణ కాంట్రాక్ట్‌లు ముగియడంతో టెండర్లు పిలవాలని ప్రతిపాదించారు. ఈ నిర్ణయాలను పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సురేశ్‌కుమార్‌ ఆమోదం పొందాక వెల్లడిస్తామని అధికార వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో వీఎంఆర్‌డీఏ ఛైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌, అదనపు కమిషనర్‌ కీర్తి, సెక్రటరీ మురళీకృష్ణ, సీఈ వినయకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.


రాయితీ సరుకులు నిల్‌!

రైతుబజార్లలో కనుమరుగైన స్టాల్స్‌

ఇప్పటికే బియ్యం కౌంటర్లు మూసివేత

ఉల్లి సరఫరాదీ అదే పరిస్థితి

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

రైతుబజార్లలో రాయితీ సరకులు మాయమైపోయాయి. బహిరంగ మార్కెట్‌లో ధరలు ఎక్కువగా ఉన్నాయని, తక్కువ ధరకు అందించేందుకు తెరిచిన బియ్యం, ఉల్లిపాయల విక్రయాలు నిలిచిపోయాయి. సోనామసూరి రకం బియ్యం కిలో రూ.70 నుంచి రూ.80 వరకు ఉంది. ఈ నేపథ్యంలో కిలో రూ.52 చొప్పున రైతుబజార్లలో విక్రయించడానికి ఏర్పాట్లు చేశారు. ఇవి వారానికి రెండు రోజులు మాత్రమే పనిచేస్తున్నాయి. తెరిచిన రోజు కౌంటర్ల ముందు కొనుగోలుదారులు బారులు తీరుతున్నారు. డిమాండ్‌ ఎక్కువగా ఉండడంతో అవసరమైన నిల్వలు సరఫరా చేయాలి. కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. మూడు రోజులుగా నగరంలోని 15 రైతుబాజర్లలోనూ బియ్యం కౌంటర్లు మూసివేశారు.

రెండు రోజులే రాయితీ ఉల్లి

ఉల్లిపాయల ధర బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.60కు చేరింది. దాంతో రాయితీపై అందిస్తామని పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు. మార్కెటింగ్‌ శాఖాధికారులు ఆయన మాటలు లెక్క చేయలేదు. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లడంతో ఈ నెల 3న రైతుబజార్లలో కిలో రూ.32 చొప్పున మనిషికి రెండు కిలోలు ఇచ్చారు. జిల్లాకు వచ్చిన 35 టన్నుల ఉల్లిని 15 రైతుబజార్లకు సరఫరా చేయగా రెండు రోజుల్లోనే అమ్ముడయ్యాయి. వాస్తవానికి విశాఖకు నాసిరకం ఉల్లి వచ్చింది. అయితే ఎమ్మెల్యేలు చీవాట్లు పెడతారని, ప్లాస్టిక్‌ కవర్లలో పెట్టి పంపిణీ చేయించారు. అయినా సరుకు మొత్తం అమ్ముడుపోయింది. అంతే ఆ ఒక్క లోడుతో సరిపెట్టేశారు. గత మూడు రోజులుగా రాయితీ ఉల్లి అందుబాటులో లేదు. మార్కెటింగ్‌ శాఖాధికారులను అడిగితే ఉల్లి రేటు తగ్గిపోయిందని, అందుకే తెప్పించడం లేదని చెబుతున్నారు. మహారాష్ట్ర ఉల్లి బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.60కి అమ్ముతున్నారు. కర్నూలు ఉల్లి నాణ్యతలేదు. అది రూ.40కి దొరుకుతోంది. ఇవి తగ్గిన ధరలని చెబుతూ అధికారులు రాయితీ ఉల్లి అంశం పక్కన పెట్టేశారు.


ఆర్టీసీ ఏరో బస్సులకు నెలవారీ పాసులు

పదో తేదీనుంచి జారీకి సన్నాహాలు

విశాఖపట్నం, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ఏరో బస్సులకు నెలవారీ పాసులు జారీ చేయన్నుట్టు రీజనల్‌ మేనేజర్‌ అప్పలనాయుడు తెలిపారు. పాత గాజువాక నుంచి ఎన్‌ఏడీ జంక్షన్‌ మీదుగా పది, సింథియా మీదుగా రైల్వేస్టేషన్‌ మార్గంలో మరో పది ఏరో బస్సులు నడుస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో విమానాశ్రయానికి రూ.400 చార్జీ వసూలు చేస్తున్నారు. కాగా పది రోజుల ఛార్జీతో నెల రోజుల పాసు ఇస్తున్నామని ఆర్‌ఎం తెలిపారు. ఈ పాసుతో విమానాశ్రయానికే కాకుండా ఆ మార్గంలో తగరపువలస, భీమిలి, కొత్తవలస, సబ్బవరం, పరవాడ, లంకెలపాలెం వరకు ఇతర బస్సుల్లోనూ వెళ్లవచ్చునన్నారు. సిటీ బస్సులు, మెట్రో ఎక్స్‌ప్రెస్సుల్లోనూ పాసులు చెల్లుబాటవుతాయన్నారు. ఈ నెల పదో తేదీ నుంచి ద్వారకా బస్‌స్టేషన్‌, మద్దిలపాలెం, ఎంవీపీ కాలనీ, మధురవాడ, గాజువాక, స్టీల్‌సిటీ, సింహాచలం, పెందుర్తి బస్‌ స్టేషన్లలో పాసులు జారీ చేస్తారన్నారు. ఏరో ఎక్స్‌ప్రెస్‌ జనరల్‌ పాసు నెలకు రూ.7,060, గురుద్వారా నుంచి విమానాశ్రయం వరకు రూ.6,060, ఇస్కాన్‌ టెంపుల్‌ నుంచి విమానాశ్రయం 6,060, జూ పార్కు నుంచి విమానాశ్రయం రూ.5,060, ఐటీ పార్కు నుంచి విమానాశ్రయం రూ.5,060, మారికవలస నుంచి విమానాశ్రయం రూ.4,060, ఆనందపురం నుంచి విమానాశ్రయం రూ.3,060, తగరపువలస నుంచి విమానాశ్రయం రూ.2,060, ఎయిర్‌పోర్టు జంక్షన్‌ నుంచి విమానాశ్రయం వరకు రూ.1,060గా పాసుల ధరలు నిర్ణయించామన్నారు.

Updated Date - Oct 09 , 2026 | 12:35 AM