27 బార్‌లకు లాటరీ
ABN , Publish Date - Feb 06 , 2026 | 12:43 AM
జిల్లాలో 27 బార్‌లను గురువారం లాటరీ ద్వారా కేటాయించారు.
మరో 25 బార్‌లకు దరఖాస్తులు నిల్
మరోసారి నోటిఫికేషన్
విశాఖపట్నం, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో 27 బార్‌లను గురువారం లాటరీ ద్వారా కేటాయించారు. మరో 25 బార్‌లకు దరఖాస్తులు రాలేదు. ఖాళీగా ఉన్న 52 బార్‌లకు ఎక్సైజ్ శాఖ అధికారులు నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. అయితే 27 బార్‌లకు మాత్రమే 108 దరఖాస్తులు అందాయి. ఈ మేరకు గురువారం సిరిపురం జంక్షన్‌లోని వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్ ఎరీనాలో దరఖాస్తుదారుల సమక్షంలో జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి లాటరీ తీసి కేటాయించారు. మిగిలిపోయిన 25 బార్‌లకు తిరిగి నోటిఫికేషన్ జారీచేస్తామని ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ ఆర్.ప్రసాద్ తెలిపారు. 27 బార్‌లకు దరఖాస్తు ఫీజు రూపంలో రూ.5.4 కోట్లు, ప్రాసెసింగ్ ఫీజు రూపంలో రూ.10.8 లక్షలు, లైసెన్స్ ఫీజులో మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ కింద రూ.50.62 కోట్లు మొత్తం...రూ.56.12 కోట్లు ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరింది.
పెద్దాస్పత్రిలో సిబ్బంది దందా
కేజీహెచ్‌లో ఇబ్బంది పడుతున్న రోగులు
సేవల కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్న వార్డు బాయ్‌లు
చెక్ చెప్పేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు 30 చోట్ల ఫిర్యాదు బాక్సులు ఏర్పాటుచేసిన అధికారులు
టోల్ ఫ్రీ నంబర్‌తోపాటు సూపరింటెండెంట్, ఆర్‌ఎంవో నంబర్లు కూడా...
విశాఖపట్నం, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి):
కేజీహెచ్‌లో అనధికార వసూళ్ల వ్యవహారం రోజురోజుకూ శ్రుతిమించుతోంది. వార్డు బాయ్‌లు, శానిటేషన్ సిబ్బంది దందాతో రోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఒక వార్డు నుంచి మరో వార్డుకు, పరీక్షలకు తీసుకువెళ్లడానికి కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. శానిటేషన్ సిబ్బంది టాయిలెట్లు క్లీన్ చేయడానికి, బెడ్ చుట్టుపక్కల శుభ్రం చేసేందుకు డబ్బులు వసూలు చేస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బంది కూడా కొన్నిచోట్ల చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
శానిటేషన్ సిబ్బంది డబ్బుల కోసం డిమాండ్ చేస్తున్న విషయాన్ని ప్లాస్టిక్ సర్జరీ వార్డులో చికిత్స పొందుతున్న రోగి సహాయకుడు ఇటీవల ఆస్పత్రి తనిఖీకి వెళ్లిన కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే సదరు శానిటేషన్ సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ తరహా వసూళ్లను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించడంతో అధికారులు ఆస్పత్రిలోని కీలక ప్రదేశాల్లో 30 చోట్ల ఫిర్యాదు బాక్సులను ఏర్పాటుచేశారు. ఆస్పత్రిలో అందించే సేవలకు డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయాలంటూ టోల్ ఫ్రీనంబర్‌తోపాటు ఆస్పత్రి సూపరింటెండెంట్, సీఎస్‌ఆర్‌ఎంవో నంబర్‌తో కూడిన బోర్డులను 15 చోట్ల ఏర్పాటుచేయించారు. ఇంకా పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్స్‌ను కూడా మూడుచోట్ల ఏర్పాటు చేశారు. నిరంతరం అనౌన్స్ చేస్తూ రోగులు, వారి కుటుంబ సభ్యులను అప్రమత్తం చేస్తున్నారు.
కఠిన చర్యలకు నిర్ణయం
ఆస్పత్రిలో వసూళ్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గైనిక్ విభాగంలో వసూళ్లు వ్యవహారం సాగుతోందన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇలా వసూళ్లకు అవకాశం ఉన్న విభాగాలు ఆస్పత్రిలో పది వరకూ ఉన్నాయి. వాటిపై ప్రత్యేకంగా అధికారులు దృష్టిసారించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఉన్నతాధికారులు అక్కడి రోగులు, వారి సహాయకులతో మాట్లాడి ఎవరైనా డబ్బులు అడిగారా?...అని తెలుసుకోవాలని ఆదేశించారు. అలాగే, ప్రసవానంతరం కుటుంబ సభ్యులకు నవజాత శిశువును సీసీ కెమెరా సమక్షంలో ఇచ్చేలా ఆదేశాలు జారీచేశారు.
ఏయూకు బాంబు బెదిరింపు
తనిఖీలు చేసిన పోలీసులు, బాంబ్ స్క్వాడ్
విశాఖపట్నం, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. గురువారం ఉదయం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల, మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాళ్లకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఈ-మెయిల్స్ వచ్చాయి. వెంటనే అప్రమత్తమై ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించారు. వారు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బాంబు స్క్వాడ్‌తో ఏయూకు చేరుకున్న పోలీసులు ఇంజనీరింగ్ కళాశాల, మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో తనిఖీలు నిర్వహించారు. పోలీసుల తనిఖీలతో విద్యార్థులు, అధ్యాపకులు భయాందోళన చెందారు. సుదీర్ఘ తనిఖీల అనంతరం ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లేవని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేయాలని సైబర్ క్రైమ్, పోలీసు అధికారులను ఏయూ అధికారులు కోరారు.
హోటళ్లపై పీసీబీ దృష్టి
నీటి శుద్ధి ప్లాంట్లు ఉండాల్సిందే...
20 గదులు ఉన్నా తప్పనిసరి
ఎన్జీటీ ఆదేశాల అమలుకు నిర్ణయం
విశాఖపట్నం, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి):
హోటళ్లపై కాలుష్య నియంత్రణ మండలి దృష్టిసారించింది. ఇరవై నుంచి వంద గదులుండే త్రీస్టార్ హోటళ్లు, ఇరవై గదులు ఉండే సాధారణ హోటళ్లు తప్పనిసరిగా సొంతంగా నీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటుచేసుకోవాలన్న జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను అమలు చేయాలని నిర్ణయించారు. ఒక అంచనా ప్రకారం 21 నుంచి 100 గదులుండే త్రీస్టార్ హోటల్‌లో రోజుకు 100 కేఎల్‌డీ, 20 వరకు గదులుండే హోటల్‌లో రోజుకు 10 కేఎల్‌డీ నీటిని వినియోగిస్తారు. ఇంత ఎక్కువ నీటిని వినియోగించి శుద్ధి చేయకుండా మురుగు కాల్వల్లోని విడిచిపెడితే పర్యావరణానికి ముప్పువాటిల్లుతుందని ఎన్జీటీ అభిప్రాయపడింది. ప్రస్తుతం ఫోర్ స్టార్, ఆపైన హోటళ్లలో సొంతంగా నీటి శుద్ధి ప్లాంట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నగరం, జిల్లాలో 20 నుంచి 100 గదులు వరకూ ఉండే హోటళ్ల జాబితాను కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇటువంటి హోటళ్లు భూగర్భ జలాల వినియోగంతో పాటు ఇతరత్రా వాటికి అనుమతులు పొందాలని తెలియజేయాలని నిర్ణయించారు. నీటి శుద్ధితోపాటు ఘన పదార్థాలు, ప్లాస్టిక్, మిగిలిన ఆహారం జీవీఎంసీకి అప్పగించడం వంటి అంశాలను పాటించాలని యాజమాన్యాలకు సమాచారం పంపనున్నారు. ఎన్జీటీ ఆదేశాలు పక్కాగా అమలుచేసే ముందు నగరంలో హోటళ్ల యజమానులతో సమావేశం నిర్వహించనున్నారు.