Share News

చిదిమేసిన లారీ

ABN , Publish Date - Jul 09 , 2026 | 01:07 AM

స్నేహితుడితో కలిసి బీచ్‌కు వెళ్లి సరదాగా గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ తిరుగు ప్రయాణమైన విద్యార్థినిని లారీ చిదిమేసింది. కొద్ది నిమిషాల్లో గమ్యం చేరుకుంటుందనగా మృత్యువు కబళించింది. ఈ విషాదకర సంఘటన పెందుర్తి సమీపంలోని సరిపల్లి వద్ద బుధవారం సాయంత్రం జరిగింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలివి...

చిదిమేసిన లారీ
భవ్యశ్రీ (పాతచిత్రం)

ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన వైనం

ఇంజనీరింగ్‌ విద్యార్థిని దుర్మరణం

మరో విద్యార్థికి తీవ్ర గాయాలు

పెందుర్తి, జూలై 8 (ఆంధ్రజ్యోతి):

స్నేహితుడితో కలిసి బీచ్‌కు వెళ్లి సరదాగా గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ తిరుగు ప్రయాణమైన విద్యార్థినిని లారీ చిదిమేసింది. కొద్ది నిమిషాల్లో గమ్యం చేరుకుంటుందనగా మృత్యువు కబళించింది. ఈ విషాదకర సంఘటన పెందుర్తి సమీపంలోని సరిపల్లి వద్ద బుధవారం సాయంత్రం జరిగింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలివి...

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం లాలంకోడూరుకు చెందిన పూసర్ల రామకోటి కుమార్తె భవ్యశ్రీ (20) పినగాడిలోని వెల్ఫేర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ఆఖరి సంవత్సరం చదువుతోంది. కళాశాలకు చెందిన హాస్టల్‌లో ఉంటోంది. కాగా సబ్బవరం మండలం బాటజంగాలపాలేనికి చెందిన నల్లమారి కార్తీక్‌ (20) ఇదే కళాశాలలో బీటెక్‌ చదువుతున్నాడు. వీరిద్దరూ స్నేహితులు. బుధవారం ఉదయం కార్తీక్‌, భవ్యశ్రీ కలిసి ద్విచక్ర వాహనంపై భీమిలి బీచ్‌కు వెళ్లారు. అక్కడ సాయంత్రం వరకు సరదాగా గడిపి తిరిగి వస్తుండగా పెందుర్తి సర్వీస్‌ రోడ్డులో రాజయ్యపేట సమీపాన మలుపు వద్ద అదేమార్గంలో వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం పైనుంచి ఇద్దరూ తుళ్లి, రోడ్డుపై పడిపోయారు. భవ్యశ్రీ లారీ వెనుక చక్రాల కింద పడిపోవడంతో ఘటనాస్థలంలోనే మృతిచెందింది. మరోవైపు పడిపోయిన కార్తీక్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం అనంతరం లారీ ఆగకుండా వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న పెందుర్తి ఎస్‌ఐ జిలానీ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. భవ్యశ్రీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. గాయపడిన కార్తీక్‌ను ఆస్పత్రిలో చేర్చించి, కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jul 09 , 2026 | 01:07 AM