గెడ్డలో కొట్టుకుపోయిన లారీ
ABN , Publish Date - Oct 31 , 2026 | 01:17 AM
మండలంలోని మద్ది గ్రామ సమీపాన కల్వర్టు పైనుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న ఇసుకగెడ్డలో ఓ లారీ కొట్టుకుపోయిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
చెట్టు పైకి చేరి ప్రాణాలతో బయటపడిన డ్రైవర్
పద్మనాభంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
పద్మనాభం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి):
మండలంలోని మద్ది గ్రామ సమీపాన కల్వర్టు పైనుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న ఇసుకగెడ్డలో ఓ లారీ కొట్టుకుపోయిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. కాకినాడ నుంచి ఆయిల్ డబ్బాల లోడుతో విజయనగరం వెళుతున్న ఓ లారీ బుధవారం తెల్లవారుజామున మద్ది కల్వర్టుపై నుంచి ప్రయాణిస్తుండగా ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయింది. డ్రైవర్ జనపరెడ్డి సూర్యప్రకాశ్ ప్రవాహ తీవ్రతను గుర్తించకలేకపోవడంతో ఈ సంఘటన జరిగింది. కాగా వాగులో కొట్టుకుపోతూ కొంతదూరం వెళ్లిన తరువాత చెట్ల మధ్య లారీ ఇరుక్కుపోయింది. దీంతో డ్రైవర్ లారీ నుంచి బయటకు వచ్చి, సమీపంలోని చెట్టు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నాడు. అయితే లారీ ఉన్న ప్రదేశం వైపు జన సంచారం లేకపోవడంతో ఈ ఘటనను ఎవరూ గుర్తించలేదు. గెడ్డ ప్రవాహ వేగం తగ్గిన తరువాత డ్రైవర్ ఒడ్డుకు చేరి, స్థానికులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఇదిలావుండగా ఇసుకగెడ్డ ప్రవాహం పెరగడంతో కల్వర్టు పైనుంచి వాహన రాకపోకలను నిలిపివేశామని పోలీసు, రెవెన్యూ అధికారులు ప్రకటించిన తరువాతే ఈ ప్రమాదం చోటుచేసుకోవడం విశేషం.