స్కూల్ ఆటోను ఢీకొన్న లారీ
ABN , Publish Date - Jun 26 , 2026 | 12:15 AM
జాతీయ రహదారిపై మండలంలోని బయ్యవరం కూడలి వద్ద త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. జంక్షన్‌లో రోడ్డు దాటున్న స్కూల్ పిల్లల ఆటోను, లారీ ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ బి.సతీశ్, ప్రత్యేక్ష సాక్షులు తెలిపిన వివరాలిలా వున్నాయి.
ముగ్గురు విద్యార్థులకు తీవ్రగాయాలు
బయ్యవరం కూడలిలో సంఘటన
కశింకోట, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిపై మండలంలోని బయ్యవరం కూడలి వద్ద త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. జంక్షన్‌లో రోడ్డు దాటున్న స్కూల్ పిల్లల ఆటోను, లారీ ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ బి.సతీశ్, ప్రత్యేక్ష సాక్షులు తెలిపిన వివరాలిలా వున్నాయి.
విస్సన్నపేట గ్రామానికి చెందిన పలువురు విద్యార్థులు కశింకోటలోని ఒక ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. వీరిలో వివిధ తరగతులకు చెందిన 13 మంది రోజూ ఒకే ఆటోలో స్కూలుకు రాకపోకలు సాగిస్తుంటారు. గురువారం సాయంత్రం పాఠశాల విడిచిపెట్టిన తరువాత వీరు ఆటోలో ఎక్కి 4.30 గంటల సమయంలో ఇంటికి బయలుదేరారు. ఆటోను జాతీయ రహదారిపై బయ్యవరం వద్ద కుడివైపునకు తిప్పుతుండగా, వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొన్నది. దీంతో ఆటో బోల్తా పడింది. స్థానికులు వెంటనే ఆటో వద్దకు వచ్చి లోపల ఇరుకుపోయిన విద్యార్థులకు బయటకు తీశారు. ఈ ప్రమాదంలో 9వ తరగతి విద్యార్థులు పల్లెల హేమసాగర్, పల్లెల రాఘవకళ్యాణ్, 7వ తరగతి విద్యార్థిని పల్లెల నవజ్యోతికి తీవ్రగాయాలయ్యాయి. మంత్రి వైశాల్య, మంత్రి గౌతం, యలమశెట్టి సాత్విక్, యలమశెట్టి వర్షిణి, వరుణ్‌తేజ్, పల్లెల దినేశ్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి క్షతగాత్రులను 108 అంబులెన్సులో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికిఇ తరలించారు. తీవ్రంగా గాయపడిన హేమసాగర్, రాఘవకళ్యాణ్, నవజ్యోతిలను ఇన్‌పేషేంట్లుగా వుంచి, మిగిలిన వారిని ప్రథమ చికిత్స అనంతరం డిశ్చార్జి చేశారు. కాగా స్కూల్ పిల్లల ఆటో ప్రమాదానికి గురైనట్టు తెలుసుకున్న డీఈవో అప్పారావునాయుడు, టీడీపీ నేత దాడి రత్నాకర్, వీఆర్‌వో నారాయణరావు, జనసేన పార్టీ నాయకులు ఆస్పత్రికి వెళ్లి, విద్యార్థులను పరామర్శించారు. పోలీసులు ఆటో డ్రైవర్, లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.