బస్సును ఢీకొన్న లారీ
ABN , Publish Date - Jan 28 , 2026 | 12:35 AM
మండలంలోని ఈదులపుట్టు గ్రామ మలుపు వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న సంఘటన మంగళవారం చోటుచేసుకుంది.
సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు
పెదబయలు, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఈదులపుట్టు గ్రామ మలుపు వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. అనకాపల్లి డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు పాడేరు నుంచి ప్రయాణికులతో జోలాపుట్టు వెళుతోంది. మండలంలోని గలగండ పంచాయతీ ఈదులపుట్టు గ్రామ మలుపు వద్దకు వచ్చే సరికి పెదబయలు నుంచి పాడేరు వైపు వెళుతున్న లారీ.. ఆర్టీసీ బస్సును ఢీకొంది. దీంతో బస్సు పక్కన ఉన్న తుప్పల్లోకి వెళ్లి నిలిచిపోయింది. లారీ రోడ్డు పక్కన ఉన్న లోయలోకి దూసుకువెళ్లింది. ఆ రెండు వాహనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వారందర్నీ జోలాపుట్టు వెళ్లే మరో బస్సులో తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.