Share News

లారీ అదుపు తప్పి బోల్తా

ABN , Publish Date - Nov 28 , 2026 | 01:22 AM

జాతీయ రహదారిపై ఎలమంచిలి మండలం రేగుపాలెం సమీపంలో వై జంక్షన్‌ వద్ద శుక్రవారం ఉదయం లారీ అదుపు తప్పి, ద్విచక్ర వాహనంపై పడడంతో తండ్రి, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, కొద్దిసేపటికి కుమార్తె మృతిచెందింది. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించింది. ఈ సంఘటనకు సంబంధించి రూరల్‌ ఎస్‌ఐ ఉపేంద్ర తెలిపిన వివరాలిలా వున్నాయి.

లారీ అదుపు తప్పి బోల్తా
జాతీయ రహదారిపై బోల్తాపడిన లారీ, ధ్వంసమైన ద్విచక్ర వాహనం. (ఇన్‌సెట్‌లో) నాగసాయి లక్ష్మి (ఫైల్‌)

పక్కనున్న ద్విచక్ర వాహనంపై పడడంతో డిగ్రీ విద్యార్థిని మృతి

తండ్రికి తీవ్రగాయాలు

జాతీయ రహదారిపై స్తంభించి ట్రాఫిక్‌... చిక్కుకున్న హోం మంత్రి అనిత కాన్వాయ్‌

ఎలమంచిలి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిపై ఎలమంచిలి మండలం రేగుపాలెం సమీపంలో వై జంక్షన్‌ వద్ద శుక్రవారం ఉదయం లారీ అదుపు తప్పి, ద్విచక్ర వాహనంపై పడడంతో తండ్రి, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, కొద్దిసేపటికి కుమార్తె మృతిచెందింది. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించింది. ఈ సంఘటనకు సంబంధించి రూరల్‌ ఎస్‌ఐ ఉపేంద్ర తెలిపిన వివరాలిలా వున్నాయి.

ఎలమంచిలి మండలం మన్యంపాలెం గ్రామానికి చెందిన కల్లెం నాగసాయి లక్ష్మి (18) స్థానిక ప్రభుత్వ డిర కళాశాలలో చదువుతున్నది. ఆమెను కళాశాల వద్ద దిగబెట్టడానికి తండ్రి రాజు ద్విచక్ర వాహనంపై ఎక్కించుకు ఎలమంచిలి బయలుదేరారు. రేగుపాలెం వై జంక్షన్‌ వద్ద ఎలమంచిలి పట్టణంలోకి (పాత జాతీయ రహదారిలోకి) రావడానికి యూ టర్న్‌ తీసుకోవాలి. వీరు ఇక్కడికి చేరుకున్నప్పుడు తుని వైపు నుంచి ఎలమంచిలి వెళ్లడానికి లారీ ఒకటి యూ టర్న్‌ తీసుకుంటుండడంతో రాజు డివైడర్‌ వద్ద ఆగారు. ఈ సమయంలో అనకాపల్లి నుంచి తుని వైపు ఇనుప బండిల్స్‌ లోడుతో వెళుతున్న లారీ, యూ టర్న్‌ తీసుకుంటున్న లారీని తప్పించే క్రమంలో కుడి వైపునకు బోల్తా పడింది. ఈ లారీ నుంచి ఇనుప బండిల్స్‌ ద్విచక్రవాహనంపై పడడంతో తండ్రి, కుమార్తెలకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో కొద్దిసేపట్లో అంబులెన్స్‌ వచ్చి, క్షతగాత్రులను అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తరలించారు. నాగసాయి లక్ష్మి పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స పొందుతూ మృతిచెందింది. రాజు చికిత్స పొందుతున్నారు. కాగా ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి కారణమైన లారీని, రోడ్డుపై పడిన ఇనుప బండిల్స్‌ను క్రేన్ల సాయంతో పక్కకు తీయించారు. అనంతరం వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు.

ట్రాఫిక్‌లో హోం మంత్రి అనిత కాన్వాయ్‌

ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి హోం మంత్రి వంగలపూడి అనిత కాన్వాయ్‌ అనకాపల్లి నుంచి పాయకరావుపేట వైపు వెళుతున్నది. ప్రమాదం కారణంగా ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో హోం మంత్రి కాన్వాయ్‌ కూడా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయింది. సుమారు 20 నిమిషాలపాటు జాతీయ రహదారిపైనే వుండిపోవాల్సి వచ్చింది. ఏం జరిగిందో తెలుసుకున్న ఆమె.. వాహనంలో నుంచి దిగి, సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో మృతిచెందిన విద్యార్ధిని కుటుంబం గురించి ఆరా తీసి, ఆమె తండ్రి రాజుకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రేగుపాలెం జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ సిగ్నల్‌ లైట్లను ఏర్పాటు చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు ఫోన్‌లో సూచించారు. కాగా మృతురాలి తండ్రి కల్లెం రాజకు ముగ్గురు కుమార్తెలు. అందరినీ కష్టపడి చదివిస్తున్నారు. పెద్దకుమార్తె నాగసాయి లక్ష్మి రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో కుటుంబంతోపాటు గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Updated Date - Nov 28 , 2026 | 01:22 AM