Share News

హైవేపై లారీ డ్రైవర్‌ హత్య?

ABN , Publish Date - May 23 , 2026 | 12:26 AM

జాతీయ రహదారిపై మండలంలోని పోతిరెడ్డిపాలెం జంక్షన్‌ సమీపంలో లారీ డ్రైవర్‌ ఒకరు సొంత సోదరుడి చేతిలో హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనకు స్థలానికి వెళ్లి పరిశీలించారు.

హైవేపై లారీ డ్రైవర్‌ హత్య?
లారీ డ్రైవర్‌ మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ ధనుంజయరావు, పోలీసులు

సొంత సోదరుడే ఇనుప రాడ్డుతో కొట్టి చంపినట్టు పోలీసుల అనుమానం

ఎలమంచిలి, మే 22 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిపై మండలంలోని పోతిరెడ్డిపాలెం జంక్షన్‌ సమీపంలో లారీ డ్రైవర్‌ ఒకరు సొంత సోదరుడి చేతిలో హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనకు స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఇతను బిహార్‌ రాష్ట్రానికి చెందిన లారీ డ్రైవర్‌గా గుర్తించారు. అక్కడ వున్న లారీ క్లీనర్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు ప్రాథమికంగా అందించిన సమాచారం మేరకు వివరాలిలా వున్నాయి. బిహార్‌కు చెందిన లారీ శుక్రవారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో తుని వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్నది. ఇందులో వున్న డ్రైవర్‌, క్లీనర్‌ అన్నదమ్ములు. వీరి మరో సోదరుడైన డ్రైవర్‌ ఇంకో లారీలో విశాఖ వైపు నుంచి తుని వైపు వెళుతున్నాడు. ఈ క్రమంలో తుని వైపు నుంచి వస్తున్న లారీని డ్రైవర్‌ పోతిరెడ్డిపాలెం జంక్షన్‌ సమీపంలో ఆపాడు. కొద్దిసేపటి తరువాత విశాఖ వైపు నుంచి వస్తున్న లారీ కూడా ఇక్కడకు వచ్చి ఆగింది. రెండు లారీల డ్రైవర్లు (సోదరులు) కిందకు దిగి మాట్లాడుకుంటూ కొద్ది సేపటికి గొడవకు దిగారు. ఈ క్రమంలో విశాఖ నుంచి వస్తున్న లారీ డ్రైవర్‌, ఇనుప రాడ్డుతో మరో డ్రైవర్‌ తలపై గట్టిగా కొట్టాడు. దీంతో అతను రోడ్డుపై కుప్పకూలి చనిపోయాడు. సమాచారం అందుకున్న సీఐ ధనుంజయరావు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతిచెందిన డ్రైవర్‌ లారీ క్లీనర్‌ను ప్రశ్నించారు. తము ముగ్గురం అన్నదమ్ములను అతను చెప్పారు. ఇద్దరు డ్రైవర్ల మధ్య గొడవ జరిగినప్పుడు తాను లారీలోనే వున్నానని, ఇద్దరి మధ్య ఏం జరిగిందో తనకు తెలియదని అతను చెబుతున్నాడు.

Updated Date - May 23 , 2026 | 12:26 AM