Share News

లోకేశ్‌ ప్రజాదర్బార్‌

ABN , Publish Date - Jan 08 , 2026 | 01:14 AM

నగరంలోని పార్టీ కార్యాలయంలో ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్‌ బుధవారం ప్రజాదర్బార్‌ నిర్వహించారు. వివిధ సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వడానికి విచ్చేసిన వారిని ఆప్యాయంగా పలకరించారు. వారి నుంచి అర్జీలు స్వీకరించారు. 83వ వార్డులోని ఏఎంసీ కాలనీలో 20 ఏళ్ల కిందట పేదల కోసం నిర్మించిన నివాసాలు శిథిల స్థితికి చేరుకున్నాయని, వాటిని పునర్నిర్మించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లల చికిత్స నిమిత్తం కేర్‌ సెంటర్‌ నిర్మాణానికి స్థలం, నిధులు కేటాయించాలని కారుణ్య స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు కోరారు.

లోకేశ్‌ ప్రజాదర్బార్‌

పార్టీ కార్యాలయంలో అర్జీల స్వీకరణ

సమస్యల పరిష్కారానికి హామీ

మహారాణిపేట, జనవరి 7 (ఆంధ్రజ్యోతి):

నగరంలోని పార్టీ కార్యాలయంలో ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్‌ బుధవారం ప్రజాదర్బార్‌ నిర్వహించారు. వివిధ సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వడానికి విచ్చేసిన వారిని ఆప్యాయంగా పలకరించారు. వారి నుంచి అర్జీలు స్వీకరించారు. 83వ వార్డులోని ఏఎంసీ కాలనీలో 20 ఏళ్ల కిందట పేదల కోసం నిర్మించిన నివాసాలు శిథిల స్థితికి చేరుకున్నాయని, వాటిని పునర్నిర్మించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లల చికిత్స నిమిత్తం కేర్‌ సెంటర్‌ నిర్మాణానికి స్థలం, నిధులు కేటాయించాలని కారుణ్య స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు కోరారు. తమకు ఇళ్ల స్థలాలు, కమ్యూనిటీ భవనం మంజూరు చేయాలని అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం ముషిడిపల్లికి చెందిన యాదవ సామాజికవర్గానికి చెందినవారు అభ్యర్థించారు. ఎలాంటి ఆధారం లేని తనను కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని నగరంలోని కేఆర్‌ఎం కాలనీకి చెందిన వెంపాడ సుత్తయ్య కోరారు. మ్యుటేషన్‌ దరఖాస్తును తిరస్కరించిన వీఆర్‌వోపై చర్య తీసుకోవాలని కె.కోటపాడు రామయోగి ప్రాంతానికి చెందిన నాగిరెడ్డి గొంగలయ్య కోరారు. వీటన్నింటినీ పరిశీలిస్తానని అర్జీదారులకు మంత్రి లోకేశ్‌ హామీ ఇచ్చారు.

ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చా

ప్రజలకు సేవ చేయడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ‘సాక్షి’ పత్రికపై దాఖలు చేసిన పరువునష్టం కేసుకు సంబంధించి బుధవారం ఆయన నగరంలోని కోర్టులో విచారణకు హాజరయ్యారు. సుమారు ఆరేళ్ల క్రితం ‘సాక్షి’ రాసిన కథనంపై లోకేశ్‌ 12వ అదనపు న్యాయమూర్తి కోర్టులో కేసు వేశారు. విచారణ అనంతరం కోర్టు హాలు నుంచి బయటకు వచ్చిన లోకేశ్‌ కేసు విషయంపై విలేకరులతో మాట్లాడారు. కుట్రపూరితంగా తనపై సాక్షిలో అసత్య కథనం ప్రచురించారని ఆరోపించారు. అసత్య కథనం తనను ఎంతగానో బాధేసిందని, దీనిపై పోరాటం చేయాలని నిర్ణయించుకుని కేసు వేశానన్నారు. తాను ఎప్పుడూ తప్పుచేయలేదని, చేయబోనన్నారు. బుధవారంతో కోర్టులో తన ఎగ్జామినేషన్‌ పూర్తయిందన్నారు. ఈసారి నగరానికి కంపెనీలు తీసుకురావడానికి వస్తానన్నారు. తాను విశాఖ వచ్చిన ప్రతిసారి టీడీపీ కార్యాలయంలో నిలిపివుంచిన బస్సులోనే ఉంటున్నానన్నారు. వాహనాల బిల్లు, చివరకు కాఫీ ఖర్చు తానే భరిస్తానని, అంతటి క్రమశిక్షణ తన తల్లి నేర్పిందని లోకేశ్‌ అన్నారు.

కోర్టు బయట టీడీపీ నేతలు

మంత్రి లోకేశ్‌ ఉదయం 11 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి జిల్లా కోర్టుకు చేరుకున్నారు. ఆయన లోనికి వెళ్లగా..నేతలంతా సాయంత్రం వరకూ బయట వేచి ఉన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పి.గణబాబు, పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు చోడే పట్టాభిరామ్‌, ఏపీ కో-ఆపరేటివ్‌ ఆయిల్‌ ఫెడరేషన్‌, ఎన్టీఆర్‌ వైద్యసేవ, రాష్ట్ర కొప్పల వెలమ, గవర కార్పొరేషన్‌ చైర్మన్లు గండి బాబ్జీ, సీతంరాజు సుఽధాకర్‌, పీవీజీ కుమార్‌, మళ్ల సురేంద్ర, వీఎంఆర్‌డీఎ చైర్మన్‌ ఎంవీ ప్రణవ్‌గోపాల్‌, మాజీ ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వరరావు, విజయనగరం డీసీఎంఎస్‌ చైర్మన్‌ గొంప కృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు, నాయకులు దాడి రత్నాకర్‌, విల్లూరి భాస్కరరావు, లొడగల కృష్ణ, బైరెడ్డి పోతనరెడ్డి, స్థానిక కార్పొరేటర్‌ ఉరుకూటి నారాయణరావు, తదితరులు ఉన్నారు.

మంత్రి తిరుగు ప్రయాణం

గోపాలపట్నం, జనవరి 7 (ఆంధ్రజ్యోతి):

‘సాక్షి’ పత్రికపై వేసిన పరువునష్టం దావా కేసు విచారణ కోసం మంగళవారం రాత్రి నగరానికి వచ్చిన మంత్రి నారా లోకేశ్‌ బుధవారం తిరిగి ప్రయాణమయ్యారు. సాయంత్రం 6.30 గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు, నగర పార్టీ నేతలు లోకేశ్‌కు ఆత్మీయ వీడ్కోలు పలికారు.

Updated Date - Jan 08 , 2026 | 01:14 AM