ప్రజలకు చేరువగా లోకాయుక్త సేవలు
ABN , Publish Date - Jan 30 , 2026 | 01:11 AM
ఉత్తరాంధ్ర ప్రజలకు సేవలు చేరువ చేయాలనే లక్ష్యంతో ఉపలోకాయుక్త పి.రజని గురువారం నగరంలో ఫిర్యాదులు స్వీకరించారు.
ఉత్తరాంధ్ర వాసుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన ఉపలోకాయుక్త రజని
గతంలో నమోదైన ఫిర్యాదులపై విచారణ
నగరంలో రెండు రోజులు క్యాంపు
విశాఖపట్నం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి):
ఉత్తరాంధ్ర ప్రజలకు సేవలు చేరువ చేయాలనే లక్ష్యంతో ఉపలోకాయుక్త పి.రజని గురువారం నగరంలో ఫిర్యాదులు స్వీకరించారు. రెండు రోజుల క్యాంపులో భాగంగా తొలిరోజు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కోర్టు నిర్వహించి...శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల నుంచి వచ్చిన వారి నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. అలాగే గతంలో నమోదైన ఫిర్యాదులపై విచారణ చేపట్టారు. ఉత్తరాంధ్రకు లోకాయుక్త కార్యాలయం (కర్నూలు) దూరంగా ఉన్నందున, ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, ఇప్పటికే నమోదైన కేసుల విచారణ కోసం ఈ క్యాంపు నిర్వహించినట్టు రిజిస్ట్రార్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల సేవల దుర్వినియోగం, ఇతర పాలనా సంబంధ అంశాలపై ఉపలోకాయుక్తకు 45 ఫిర్యాదులు అందాయి. ప్రజల నుంచి లభిస్తున్న స్పందన ఉపలోకాయుక్తపై పెరుగుతున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. ఇటువంటి క్యాంపులు నిర్వహించడం ద్వారా సకాలంలో న్యాయం అందుతుందన్నారు.
ఉప లోకాయుక్తకు పలు ఫిర్యాదులు
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం లాలంకోడూరు పంచాయతీ రామచంద్రాపురంలో సర్వే నంబరు 292లో కట్టా పైడియ్యకు చెందిన 4.1 ఎకరాల డీపట్టా భూమిని రీసర్వేలో వేరొకరి పేరిట రెవెన్యూ రికార్డుల్లో నమోదుచేశారని ఆయన వారసుడు వెంకటేష్ ఉపలోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు గ్రామాల్లో దళితుల భూములను రీసర్వే సమయంలో ఇతరుల పేరిట రికార్డులలో నమోదుచేశారని దళిత హక్కుల సాధన ప్రతినిధి బూసి వెంకటరావు ఫిర్యాదు చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో 1991లో తమకు ప్రభుత్వం ఇచ్చిన డీపట్టా భూములను ఇప్పుడు ప్రజా ప్రతినిధి ఒకరు కబ్జా చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు.