ప్రతిష్టాత్మకంగా స్థానిక ఎన్నికలు
ABN , Publish Date - Oct 17 , 2026 | 11:23 PM
మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలు టీడీపీ, వైసీపీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి.
ముంచంగిపుట్టుపై కూటమి గురి
రెండు దశాబ్దాలుగా ఎంపీపీ, జడ్పీటీసీ పీఠాలకు టీడీపీ దూరం
హ్యాట్రిక్ కొట్టాలని వైసీపీ యత్నం
వ్యూహాలకు పదును పెడుతున్న నేతలు
ముంచంగిపుట్టు, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి):
మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలు టీడీపీ, వైసీపీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. రెండు దశాబ్దాలుగా మండల పరిషత్ అధ్యక్ష పీఠంతోపాటు జడ్పీటీసీ స్థానానికి దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలు సవాల్గా మారాయి. అధికార కూటమి నాయకులు ఈ రెండు స్థానాలను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో వ్యూహాలకు పదునుపెడుతుండగా, మరోసారి తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.
పార్టీల గెలుపు తీరు
మండలంలో గత ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు వేర్వేరు పార్టీలకు దక్కిన సందర్భాలు ఉన్నాయి. 2001లో ఎంపీపీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా.. జడ్పీటీసీని బీఎస్పీ సొంతం చేసుకుంది. 2006లో కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలను హస్తగతం చేసుకుంది. 2014, 2021లో వైసీపీ రెండింటిని కైవసం చేసుకుంది. ఈసారి జరిగే ఎన్నికల్లో ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకోవాలని కూటమి నేతలు, వైసీపీ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ
కూటమి ప్రభుత్వానికి ఈ ఎన్నికలు రాజకీయంగా కీలకంగా మారడంతో అభ్యర్థుల ఎంపికపై ఆసక్తి నెలకొంది. ఎవరికి టికెట్ కేటాయించినా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలను దక్కించుకోవాలనే దిశగా కూటమి నాయకులు అడుగులు వేస్తున్నారు. అధికారంలో ఉన్న కూటమి నాయకులు తమ బలాన్ని నిరూపించుకోవాలని భావిస్తుండగా, వైసీపీ నేతలు గత ఎన్నికల ఫలితాలను పునరావృతం చేయాలని ముందుకు సాగుతున్నారు. గత ఎన్నికల అనుభవాలు, స్థానిక రాజకీయ సమీకరణాలు, అభ్యర్థుల ఎంపిక, పార్టీల మధ్య ఐక్యత ఈసారి ఫలితాలపై ప్రభావం చూసే అవకాశముంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే కొద్దీ మండల రాజకీయాలు మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అంతిమంగా ప్రజల తీర్పు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుందో వేచి చూడాల్సిందే.