స్థానిక ఎన్నికల సందడి మొదలు
ABN , Publish Date - Oct 14 , 2026 | 12:34 AM
స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం ఆసన్నం కావడంతో జిల్లాలో సందడి మొదలైంది. ఎంపీడీవో, జిల్లాపరిషత్ కార్యాలయ సిబ్బంది ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎంపీడీవో కార్యాలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ కార్యాలయానికి అమరావతి నుంచి వచ్చిన ఎన్నికల సామగ్రిని(స్టేషనరీ)జిల్లాలోని 11 మండలాలకు పోలింగ్ కేంద్రాల వారీగా తరలించేందుకు సిబ్బంది సిద్ధం చేస్తున్నారు.
- ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం
- స్ట్రాంగ్‌రూమ్, ఓట్ల లెక్కింపు కేంద్రాల పరిశీలన
- బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేస్తున్న సిబ్బంది
పాడేరురూరల్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం ఆసన్నం కావడంతో జిల్లాలో సందడి మొదలైంది. ఎంపీడీవో, జిల్లాపరిషత్ కార్యాలయ సిబ్బంది ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎంపీడీవో కార్యాలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ కార్యాలయానికి అమరావతి నుంచి వచ్చిన ఎన్నికల సామగ్రిని(స్టేషనరీ)జిల్లాలోని 11 మండలాలకు పోలింగ్ కేంద్రాల వారీగా తరలించేందుకు సిబ్బంది సిద్ధం చేస్తున్నారు. అలాగే పాడేరు మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను ఎంపీడీవో జె.తేజరతన్, డిప్యూటీ ఎంపీడీవో ఆర్‌వీఎస్ రమేశ్ పర్యవేక్షిస్తున్నారు. మండలంలోని 26 పంచాయతీల్లో 246 వార్డులకు 492 బ్యాలెట్ బాక్సులు అవసరంకాగా, ప్రస్తుతం కార్యాలయంలో ఉన్న బాక్సులను పరిశీలించి సిద్ధంగా ఉన్న 150 బాక్సులను శుభ్రం చేయించారు. మరో 342 కొత్త బ్యాలెట్ బాక్సులు అమరావతి నుంచి రానున్నాయని వారు తెలిపారు. అదే విధంగా ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు, స్ట్రాంగ్‌రూమ్ ఏర్పాటుకు మంగళవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వారు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అవసరమైన ముందస్తు చర్యలు చేపడతామని పేర్కొన్నారు.