Share News

స్థానిక సమరం

ABN , Publish Date - Oct 15 , 2026 | 12:58 AM

స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

స్థానిక సమరం

నెలాఖరులోగా జీవీఎంసీ ఎన్నికల ప్రక్రియ పూర్తి

నవంబరు 3న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు

పంచాయతీలకు మూడు విడతల్లో...

నవంబరు 26, 29, డిసెంబరు రెండో తేదీన నిర్వహణ

విశాఖపట్నం, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి):

స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మహా విశాఖ నగర పాలక సంస్థకు అతి తక్కువ వ్యవధిలో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా ఎన్నికల సంఘం తేదీలు ప్రకటించింది. నెలాఖరులోగా ఓట్ల లెక్కింపు పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించింది.

ఈసారి పునర్విభజన వల్ల వార్డుల సంఖ్య 98 నుంచి 120కి పెరగడంతో ఈ ఎన్నిక మహా సంగ్రామాన్నే తలపించేలా ఉంది. కూటమిలో సీట్ల సర్దుబాటుపై సమాలోచనలు ప్రారంభమయ్యాయి. మేయర్‌ అభ్యర్థిపై మంతనాలు జరుగుతున్నాయి. వార్డుల విభజన నేపథ్యంలో ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలనే దానిపై ఆశావహులు తర్జనభర్జన పడుతున్నారు. తమకు పోటీ చేసే అవకాశం కల్పించాలంటూ పార్టీ పెద్దలను కలిసి వినతిపత్రాలను సమర్పిస్తున్నారు. ఆర్థిక వనరుల సమీకరణకు ప్రయత్నాలు ప్రారంభించారు.

జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలకు కూడా రిజర్వేషన్లను ఖరారు చేశారు. దీంతో గ్రామీణ రాజకీయం ఊపందుకుంది. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ స్థానాన్ని బీసీ-జనరల్‌కు కేటాయించారు. విశాఖ జిల్లాలో భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి నాలుగు మండలాలే ఉండడంతో మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే ఇక్కడ జడ్పీ ఎన్నికల ప్రక్రియ చాలా సులభంగా పూర్తయ్యే అవకాశం ఉంది. జిల్లాలో నాలుగు జెడ్పీటీసీ స్థానాలు, 53 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటికి రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఈ ఎన్నికల ప్రక్రియ అక్టోబరు 19న ప్రారంభమై నవంబరు 5వ తేదీతో ముగుస్తుంది. నవంబరు మూడో తేదీన ఎన్నికలు జరగనున్నాయి. గ్రామ పంచాయతీల ఎన్నికలు మూడు విడతల్లో జరగనున్నాయి. నవంబరు 26న మొదటి విడత, 29న రెండో విడత, డిసెంబరు రెండో తేదీన మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 13, 16, 19 తేదీల్లో నోటిఫికేషన్లు జారీ అవుతాయి.


మహా సంగ్రామం

జీవీఎంసీకి ఎన్నికలకు 16 నుంచి 18వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ

19న పరిశీలన

21 వరకు ఉపసంహరణకు గడువు, అదేరోజు అభ్యర్థుల జాబితా

28న ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు వరకు పోలింగ్‌

30న ఓట్ల లెక్కింపు

విశాఖపట్నం, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠ బుధవారం నోటిఫికేషన్‌ జారీచేశారు. ఈనెల 16 నుంచి 18 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం కల్పించారు. 19న నామినేషన్ల స్ర్కూట్నీ (పరిశీలన) జరుగుతుంది. 21 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. అదేరోజు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రదర్శిస్తారు. 28న ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటలు వరకు పోలింగ్‌ జరుగుతుంది. ఒకవేళ ఎక్కడైనా రీపోలింగ్‌ జరపాల్సి వస్తే 29వ తేదీని రిజర్వు చేశారు. 30న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ స్పష్టంచేశారు. నామినేషన్ల స్వీకరణకు ఒక్కరోజు ముందుగా నోటిఫికేషన్‌ జారీచేయడంతో పోటీకి దిగాలనుకుంటున్న అభ్యర్థులు అందుకు అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవడంపై పడ్డారు.


టీడీపీకే మేయర్‌ సీటు

అభ్యర్థుల వేటలో అధిష్ఠానం

మూడేసి పేర్లు సూచించాలని ఎమ్మెల్యేలకు ఆదేశం

ప్రచారంలో పార్టీ నేతలు పల్లా, పట్టాభి, బాబ్జీ కుటుంబ సభ్యుల పేర్లు

అధిష్ఠానం తర్జనభర్జన

అభ్యర్థి ఖరారుకు మరింత సమయం పట్టే అవకాశం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం మేయర్‌ స్థానానికి కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థినే రంగంలోకి దించాలని నిర్ణయమైనట్టు విశ్వసనీయంగా తెలిసింది. తమకు అవకాశం కల్పించాలని జనసేన, బీజేపీలు కోరినా వారికి ఇతర ప్రాంతాల్లో అడిగిన స్థానాలు ఇవ్వడంతో ఆ రెండు పార్టీలు విశాఖ మేయర్‌ స్థానంపై గట్టిగా పట్టుబట్టలేదని సమాచారం. దాంతో టీడీపీ నుంచి ఎవరిని పోటీలో దించాలి?...అనే అంశంపై చర్చ మొదలైంది. విజయవాడలోని పార్టీ కార్యాలయం నుంచి టీడీపీ ఎమ్మెల్యేలకు బుధవారం ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. విశాఖ మేయర్‌ స్థానానికి ఎవరిని పోటీకి దించితే బాగుంటుందో మూడేసి పేర్లు సూచించాలని కోరినట్టు తెలిసింది. విశాఖ మేయర్‌ స్థానాన్ని జనరల్‌ మహిళకు రిజర్వ్‌ చేయడంతో ఏ వర్గానికి చెందిన మహిళ అయినా పోటీ చేసే అవకాశం ఏర్పడింది.

విశాఖపట్నం ఇప్పుడు అంతర్జాతీయ నగరంగా పేరు తెచ్చుకుంది. గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుతో ప్రపంచం అంతటికీ విశాఖపట్నం పేరు పరిచయమైంది. డేటా హబ్‌గా, పర్యాటక కేంద్రంగా, పారిశ్రామిక, ఆర్థిక రాజధానిగా వర్ధిల్లుతున్న విశాఖలో ప్రథమ పౌరురాలు విద్యావంతురాలు అయి ఉంటే బాగుంటుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అన్నీ దృష్టిలో ఉంచుకొని అభ్యర్థిని ఎంపిక చేయాలని భావిస్తున్నాయి. పార్టీలో ఆ స్థాయి కలిగిన మహిళలు పెద్దగా లేకపోవడంతో నాయకులు తమ కుటుంబం నుంచి మహిళలకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ అభ్యర్థనలను అధిష్ఠానం పరిగణనలోకి తీసుకుంటుందా? లేదంటే కొత్త వారికి అవకాశం ఇస్తుందా? అనేది వేచి చూడాల్సి ఉంది. మేయర్‌ అభ్యర్థిని అధిష్ఠానమే ప్రకటిస్తుంది. ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్లు వేయడానికి గడువు ఉండడంతో కాసింత మేధోమధనం చేశాక అభ్యర్థిని ఎంపిక చేస్తారని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీలో విద్యావంతులను ఎంపిక చేయాలని భావిస్తే రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు భార్య లావణ్య ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌. జిల్లా పార్టీ అధ్యక్షుడు పట్టాభి కుమార్తె కూడా విద్యావంతురాలే. పెందుర్తి పార్టీ ఇన్‌చార్జి గండి బాబ్జీ కోడలు న్యాయవాది. మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కోడలు కూడా విద్యాధికురాలే. ఆ పేరును కూడా పరిశీలించాలని ఆ కుటుంబం కోరుతోంది. వీరు కాకుండా తాజాగా వీఎంఆర్‌డీఏ మాజీ చైర్‌పర్సన్‌ అక్కరమాని విజయనిర్మల పేరును పరిగణనలోకి తీసుకోవాలని ఆమె భర్త వెంకటరావు బుధవారం విశాఖపట్నం వచ్చిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామిని కలిసి కోరారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధిలోని మాజీ కార్పొరేటర్‌ ముక్కా శ్రావణి పేరును నాయకులు కొందరు ప్రతిపాదించారు. పల్లా వ్యక్తిగత సహాయకుడు మురళీ తన భార్య కొడాలి ఉష దరఖాస్తును పార్టీ కార్యాలయంలో సమర్పించినట్టు జిల్లా ఎమ్మెల్యేలకు బుధవారం సమాచారం ఇచ్చారు. అయితే మాజీ మేయర్‌ డీవీ సుబ్బారావు కుమారుడు హైకోర్టు మాజీ న్యాయమూర్తి డీవీ సోమయాజులు భార్యను టీడీపీ వర్గాలు రెండు వారాల క్రితం సంప్రతించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇలా అనేక అభ్యర్థనలు ప్రచారంలోకి వచ్చాయి.


అమలులోకి ఎన్నికల కోడ్‌

విశాఖపట్నం, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి):

స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో కోడ్‌ అమలులోకి వచ్చిందని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్‌ కిశోర్‌ ప్రకటించారు. రాజకీయ నాయకుల విగ్రహాలన్నింటికీ ముసుగులు వేయాలని అధికారులకు సూచించారు. రాజకీయ నాయకులకు సంబంధించిన వాల్‌ పోస్టర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు అన్నీ వెంటనే తొలగించాలన్నారు. శిలాఫలకాలపై పేర్లు కనిపించకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన స్టాటిక్‌ సర్వైవలెన్స్‌ బృందాలు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, ఎన్నికల నియమావళి పర్యవేక్షణ బృందాలు, ఎన్నికల వ్యయ పర్యవేక్షణ బృందాలు ఏర్పాటుచేసి పనులు ప్రారంభించాలన్నారు.

Updated Date - Oct 15 , 2026 | 12:58 AM