Share News

బదిలీలకు పైరవీలు

ABN , Publish Date - Jun 26 , 2026 | 12:16 AM

అధికారులు, సిబ్బంది బదిలీకి గడువు జూన్‌ 25తో ముగియగా, దానిని జూలై ఐదో తేదీ వరకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

బదిలీలకు పైరవీలు

సాధారణ బదిలీలకు గురువారంతో ముగిసిన గడువు

జూలై 5 వరకు పెంచిన ప్రభుత్వం

అన్ని శాఖల్లోను చిగురించిన ఆశలు

అమరావతి ఉన్నతాధికారులతో జోరుగా మంతనాలు

ఆరోపణలు ఉన్నవారికి కీలక పోస్టింగ్‌లు!

విశాఖపట్నం, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి):

అధికారులు, సిబ్బంది బదిలీకి గడువు జూన్‌ 25తో ముగియగా, దానిని జూలై ఐదో తేదీ వరకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో బదిలీలు, మంచి పోస్టుల కోసం ఎదురు చూస్తున్న వారిలో ఆశలు మొలకెత్తాయి. ఈ పది రోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించారు.

విశాఖపట్నం అందరికీ ఆమోదయోగ్యమైన ప్రాంతం. ఇక్కడే పనిచేయాలని కొందరు పట్టుబట్టి మరీ డిప్యుటేషన్లు వేయించుకుంటున్నారు. ఏసీబీ కేసులు ఉన్నా సరే నజరానాలు సమర్పించుకొని ఉత్తర్వులు తెచ్చుకుంటున్నారు. అటవీ శాఖలో పక్క జిల్లా అధికారిగా పనిచేసిన వ్యక్తి ఇంటి దగ్గర రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయి విచారణ ఎదుర్కొంటున్నారు. అంతకుముందు రేంజర్‌గా పనిచేస్తున్నప్పుడు ఏసీబీ వలకు చిక్కారు. గతంలో అనకాపల్లి జిల్లాలో గ్రానైట్‌ తవ్వకాలకు నిబంధనలకు వ్యతిరేకంగా అనుమతులు ఇచ్చిన వ్యవహారంలో ఇటీవల ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అటువంటి అధికారి వీఎంఆర్‌డీఏలో అటవీ విభాగం అధికారిగా పోస్టింగ్‌ తెచ్చుకున్నారు. అలాగే ఆడిట్‌ శాఖలో రిటైరైన ఓ అధికారిణి ఆ మరుసటిరోజే తన భర్త గతంలో చైర్మన్‌గా వ్యవహరించిన కార్పొరేషన్‌లో పోస్టింగ్‌ వేయించుకున్న సంగతి తెలిసిందే.

వాణిజ్య పన్నుల శాఖలో బదిలీల వివాదం నడుస్తోంది. గతంలో వందల కోట్ల రూపాయల జీఎస్‌టీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు మళ్లీ కీలక పోస్టింగ్‌ల కోసం యత్నిస్తున్నారు. విశాఖలో జీరో బిల్లింగ్‌ వ్యాపారం అధికం. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి ఎలక్ర్టికల్‌, హార్డ్‌వేర్‌, పెయింటింగ్‌, తదితర వ్యాపారాలు చేసేవారు రోజుకు లక్షలాది రూపాయల అమ్మకాలు చేసినా రూ.పది వేలకు మించి బిల్లు ఇవ్వరు. అంతా ‘ఎస్టిమేషన్‌’ చీటీలతోనే నడుపుతారు. వారి నుంచి వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు భారీగా ముడుపులు అందుతుంటాయనే ప్రచారం ఉంది. ఇంకా బోగస్‌ సర్టిఫికెట్లతో జీఎస్‌టీ వ్యాపారం చేసేవారు కూడా ఎక్కువే. అందుకే వాణిజ్య శాఖలో విశాఖలో పోస్టింగ్‌కు డిమాండ్‌ ఎక్కువ. ఇక్కడి సర్కిళ్లలో బదిలీలకు కనీసం రూ.20 లక్షలు అయినా ఇచ్చుకోవలసిందేనని ఆయా వర్గాలు చెబుతున్నాయి.

రిజిస్ట్రేషన్ల శాఖలో...

రిజిస్ట్రేషన్ల శాఖలో సబ్‌ రిజిస్ట్రార్లు వారి అర్హతలకు తగిన విధులే నిర్వహించాలని ఇటీవల ఆర్థిక శాఖ సూచించింది. గ్రేడ్‌-1 పోస్టుల్లో గ్రేడ్‌-2 సబ్‌ రిజిస్ట్రార్లు పనిచేస్తున్న విషయం గుర్తించి, వారందరినీ మార్చాలని ఆదేశించింది. దీనిపై విజయవాడ అధికారులు కసరత్తు చేశారు. ఉత్తరాంరఽధ జిల్లాల్లో సుమారు 18 మంది సబ్‌ రిజిస్ట్రార్లు అర్హతకు తగని పోస్టుల్లో ఉన్నారని గుర్తించారు. వారిని మార్చాలని భావించారు. దీనికి కూడా పైరవీలు జరిగాయి. ప్రస్తుతం ఉన్న స్థానాల్లో కొనసాగించాలని కొందరు, ఫలానా సీటు కావాలని మరికొందరు కోరుకుంటున్నారు. ఇలాంటి వారంతా నేరుగా పెద్దలతోనే ‘రేటు’ మాట్లాడుకుంటున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. వాస్తవానికి ఈ మార్పులపై బుధవారం ఉత్తర్వులు వస్తాయని కొందరు భావించారు. ప్రభుత్వం గడువు పెంచడంతో తమ ప్రయత్నాలు ఫలిస్తాయని ఆశిస్తున్నారు. విశాఖ జిల్లా వరకు తీసుకుంటే మధురవాడ, ద్వారకానగర్‌, గోపాలపట్నం, గాజువాక కార్యాలయాలు గ్రేడ్‌-1 సబ్‌ రిజిస్ట్రార్లతో నడపాలి. గాజువాక, గోపాలపట్నాల్లో గ్రేడ్‌-2 సబ్‌ రిజిస్ట్రార్లు పనిచేస్తున్నారు. వీరిలో ఒకరికి కొద్దిరోజుల క్రితమే పదోన్నతి లభించింది. దాంతో అక్కడే కొనసాగించాలని కోరుతున్నారు. వాస్తవానికి పదోన్నతి వచ్చిన వారిని బదిలీ చేయాలి. అధికారులు ఏమి చేస్తారో చూడాలి. ఆనందపురం, భీమునిపట్నం, పెదగంట్యాడ, పెందుర్తిల్లో ఉన్నవి గ్రేడ్‌-2 కార్యాలయాలు. అక్కడ కొన్ని మార్పులు చేయాల్సి ఉందని అధికారులు అంటున్నారు. ఏదేమైనా విజయవాడ నుంచి ఉత్తర్వులు వస్తేనే ఆశావహుల కలలు నెరవేరుతాయి. వీటిలో ఎక్కడా రాజకీయ ప్రమేయం లేకపోవడం విశేషం.

Updated Date - Jun 26 , 2026 | 12:16 AM